Road Accident: సంగారెడ్డి జిల్లాలో రోడ్డు ప్రమాదం.. నలుగురి మృతి
ABN , Publish Date - Jan 04 , 2025 | 05:15 AM
సంగారెడ్డి జిల్లా గుమ్మడిదల మండలం నల్లవల్లి అటవీ ప్రాంతంలో శుక్రవారం ఉదయం జరిగిన రోడ్డు ప్రమాదంలో నలుగురు చనిపోయారు. ముగ్గురికి తీవ్ర గాయాలయ్యాయి.

గుమ్మడిదల మండలం నల్లవల్లి అటవీ ప్రాంతంలో ఆటోను ఢీకొన్న కారు
బోల్తాపడ్డ ఆటోను వెనుక నుంచి ఢీకొట్టిన కూరగాయల ఆటో
నర్సాపూర్/గుమ్మడిదల, జనవరి 3 (ఆంధ్రజ్యోతి): సంగారెడ్డి జిల్లా గుమ్మడిదల మండలం నల్లవల్లి అటవీ ప్రాంతంలో శుక్రవారం ఉదయం జరిగిన రోడ్డు ప్రమాదంలో నలుగురు చనిపోయారు. ముగ్గురికి తీవ్ర గాయాలయ్యాయి. హైదరాబాద్-మెదక్ 765డీ జాతీయ రహదారిపై ఓ మలుపు దగ్గర మెదక్ వైపు నుంచి వేగంగా వస్తున్న కారు.. హైదరాబాద్ వైపు నుంచి వస్తున్న ప్రయాణికుల ఆటోను ఢీకొట్టింది. ఆటో బోల్తాపడింది. అదే సమయంలో వెనుక నుంచి వస్తున్న మరో కూరగాయల ఆటో.. ముందు ఆటోను ఢీకొంది. ప్రమాదంలో.. మొదటి ఆటోలో ఉన్న మనీషా(25), ఐశ్వర్య(22), ప్రవీణ్(30) అక్కడికక్కడే చనిపోయారు.
గాయపడ్డ అనసూయ(62)ను ఆస్పత్రికి తరలించగా.. చికిత్స పొందుతూ ఆ వృద్ధురాలు చనిపోయింది. వెనుక ఆటోలో ఉన్న నర్సాపూర్‌కు చెందిన ప్రవీణ్, రాజు, సంతో్‌షలకు గాయాలయ్యాయి. మనీషా 2 నెలల క్రితమే నర్సాపూర్ సబ్ డివిజన్ పీఆర్ ఇంజనీరింగ్ కార్యాలయంలో ఏఈగా ఉద్యోగం సాధించింది. విధులకు వెళ్తూ ప్రమాదంలో మృతిచెందింది.