Thummala Nageswara Rao: పక్క రాష్ట్రాల్లోనూ యూరియా కొరత..
ABN , Publish Date - Aug 15 , 2025 | 03:49 AM
యూరియా కొరత కేవలం తెలంగాణలోనే కాదు.. పక్క రాష్ట్రాలైన ఆంధ్రప్రదేశ్, తమిళనాడులో కూడా ఉందని వ్యవసాయశాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అన్నారు.
రాంచందర్‌రావుది అవగాహనారాహిత్యం
బీజేపీది రైతు వ్యతిరేక ప్రభుత్వం: తుమ్మల
హైదరాబాద్, ఆగస్టు 14 (ఆంధ్రజ్యోతి): యూరియా కొరత కేవలం తెలంగాణలోనే కాదు.. పక్క రాష్ట్రాలైన ఆంధ్రప్రదేశ్, తమిళనాడులో కూడా ఉందని వ్యవసాయశాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అన్నారు. దేశంలో ఏ రాష్ట్రంలో యూరియా కొరత లేదని, రాష్ట్ర ప్రభుత్వమే కృత్రిమ కొరత సృష్టిస్తోందంటూ రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు రాంచందర్‌రావు చేసిన వ్యాఖ్యలపై ఆయన తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. రాంచందర్‌రావు వ్యాఖ్యలు అవగాహనారాహిత్యానికి నిదర్శనమని విమర్శించారు. రాష్ట్రానికి కేంద్రం ఎంత యూరియా కేటాయించింది, ఎంత సరఫరా చేసింది అనే వాస్తవాలను ముందుగా తెలుసుకోవాలని సూచించారు.
ఇలాంటి ఆరోపణలు తెలంగాణ బీజేపీకి రైతుల పట్ల ఉన్న చిత్తశుద్ధిని శంకిపజేస్తున్నాయన్నారు. కేంద్రంలో ఉన్న బీజేపీది రైతు మిత్ర ప్రభుత్వం కాదని, రైతు వ్యతిరేక ప్రభుత్వమని ధ్వజమెత్తారు. కేంద్రం కావాలనే కొన్ని రాష్ట్రాలపై సవతి తల్లి ప్రేమ చూపుతోందని తుమ్మల ఆక్షేపించారు. రాష్ట్రానికి కేంద్రం నుంచి ఇంకా 3.20 లక్షల టన్నుల ఎరువులు రావాల్సి ఉందని వివరించారు. ఇప్పటికైనా బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ప్రగల్భాలు మాని.. చేతనైతే ఆ యూరియాను తెప్పించాలంటూ ఘాటుగా వ్యాఖ్యానించారు.