Thummala Nageshwar Rao: తెలంగాణ చేనేతకు దేశవ్యాప్తంగా గుర్తింపు
ABN , Publish Date - Aug 08 , 2025 | 03:56 AM
జాతీయ చేనేత దినోత్సవం సందర్భంగా హైదరాబాద్‌లోని పీపుల్స్‌ప్లాజాలో ఏర్పాటు చేసిన చేనేత వస్త్ర ప్రదర్శనను వ్యవసాయశాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు గురువారం ప్రారంభించారు.
పీపుల్స్‌ప్లాజాలో వస్త్ర ప్రదర్శనను ప్రారంభించి చేనేత కళాకారులను సత్కరించిన మంత్రి తుమ్మల
ఖైరతాబాద్, ఆగస్టు 7 (ఆంధ్రజ్యోతి): జాతీయ చేనేత దినోత్సవం సందర్భంగా హైదరాబాద్‌లోని పీపుల్స్‌ప్లాజాలో ఏర్పాటు చేసిన చేనేత వస్త్ర ప్రదర్శనను వ్యవసాయశాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు గురువారం ప్రారంభించారు. ఈ సందర్భంగా చేనేత కళాకారులు తయారుచేసిన ఉత్పత్తులను పరిశీలించి వారిని అభినందించారు. త్రిళింగ పట్టు చీరలను, తెలంగాణ అథెంటిక్ వీవ్స్ లోగోను ఆవిష్కరించి, కొండా లక్ష్మణ్ బాపూజీ చేనేత పురస్కారాలకు ఎంపికైన కళాకారులను సత్కరించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. చేనేత రంగంలో తెలంగాణ దేశంలోనే ప్రత్యేక గుర్తింపును పొందిందని, కార్మికుల సంక్షేమం, జియోట్యాగింగ్, అభివృద్ధిలో తెలంగాణ మొదటిస్థానంలో ఉందని తెలిపారు.
గద్వాల, నారాయణపేట, పోచంపల్లి ఇక్కత్, సిద్దిపేట గొల్లభామ చీరలు అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు పొందాయన్నారు. జౌళిశాఖ ముఖ్య కార్యదర్శి శైలజా రామయ్యర్ మాట్లాడుతూ.. చేనేత కార్మికుల అభివృద్ధి కోసం ప్రభుత్వం అనేక కార్యక్రమాలను చేపడుతోందన్నారు. నేతన్న పొదుపు కార్యక్రమం, నేతన్న భద్రత పథకంతో పాటు చేనేత రుణమాఫీ కోసం ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు 33 కోట్ల రూపాయల నిధులను విడుదల చేశామన్నారు.
ఈ వార్తలు కూడా చదవండి..
గువ్వల రాజీనామా.. స్పందించిన బీఆర్ఎస్
తురకా కిషోర్‌ను తక్షణమే విడుదల చేయండి: హైకోర్టు