Share News

Ration Shops: 3 నెలల రేషన్‌ కోటా పంపిణీ నేటితో ఆఖరు

ABN , Publish Date - Jun 30 , 2025 | 03:11 AM

మూడు నెలల కోటా బియ్యం పంపిణీ కార్యక్రమం నేటితో ముగియనుంది. ఇప్పటికే జూన్‌, జూలై, ఆగస్టు నెలలకు సంబంధించిన కోటా బియ్యాన్ని పంపిణీ చేసిన నేపథ్యంలో రాష్ట్రంలో రెండు నెలలపాటు రేషన్‌ షాపులు మూతపడనున్నాయి.

 Ration Shops: 3 నెలల రేషన్‌ కోటా పంపిణీ నేటితో ఆఖరు

  • రెండు నెలల పాటు రేషన్‌ దుకాణాలు బంద్‌

  • మళ్లీ సెప్టెంబరులో రేషన్‌ బియ్యం పంపిణీ

హైదరాబాద్‌, జూన్‌ 29 (ఆంధ్రజ్యోతి): ‘మూడు నెలల కోటా బియ్యం పంపిణీ’ కార్యక్రమం నేటితో ముగియనుంది. ఇప్పటికే జూన్‌, జూలై, ఆగస్టు నెలలకు సంబంధించిన కోటా బియ్యాన్ని పంపిణీ చేసిన నేపథ్యంలో రాష్ట్రంలో రెండు నెలలపాటు రేషన్‌ షాపులు మూతపడనున్నాయి. మళ్లీ సెప్టెంబరు నెలలో బియ్యం పంపిణీ చేయాల్సి ఉంటుంది. వాస్తవానికి ప్రతి నెలలో మొదటి 15రోజులు రేషన్‌ బియ్యం పంపిణీ ఉంటుంది. కానీ కేంద్ర ప్రభుత్వం ఈసారి కీలక నిర్ణయం తీసుకుంది. వర్షాకాలంలో మారుమూల ప్రాంతాలు, గిరిజన, కొండ ప్రాంతాల ప్రజల ఇబ్బందులు దృష్టిలో పెట్టుకొని దేశమంతా ఒకేసారి మూడు నెలల కోటా బియ్యాన్ని పంపిణీ చేయాలని రాష్ట్రాలకు ఉత్తర్వులు జారీ చేసింది. కేంద్రం ఉత్తర్వులకు అనుగుణంగా రాష్ట్రంలో కూడా జూన్‌ 1 నుంచి బియ్యం పంపిణీ ప్రారంభమైంది.


ప్రతి లబ్ధిదారునికి నెలకు 6 కిలోల చొప్పున మూడు నెలల కోటా కింది 18 కిలోలు పంపిణీ చేశారు. అయితే దేశవ్యాప్తంగా దొడ్డు బియ్యం పంపిణీ చేయగా... రాష్ట్రంలో మాత్రం సన్నబియ్యం ఇవ్వడం విశేషం. రాష్ట్ర ప్రభుత్వం ఏప్రిల్‌ నుంచే సన్నబియ్యం పంపిణీ పథకానికి శ్రీకారం చుట్టింది. ఏప్రిల్‌, మే నెలల్లో... ఏ నెల కోటా ఆ నెలకు పంపిణీ చేసింది. జూన్‌ నెల నుంచి కేంద్ర ప్రభుత్వం ప్రత్యేక ఉత్తర్వులు జారీచేయటంతో... 3నెలల కోటాకు సరిపడా సన్నబియ్యం సర్దుబాటు చేసింది. ఈ 3 నెలలకు కలిపి 6 లక్షల టన్నుల సన్నబియ్యాన్ని రాష్ట్ర ప్రభుత్వం పంపిణీ చేయటం గమనార్హం. రాష్ట్రవ్యాప్తంగా 94.34లక్షల రేషన్‌ కార్డులు ఉండగా వీటిపై 3.6కోట్ల మంది లబ్ధిదారులు ఉన్నారు.

Updated Date - Jun 30 , 2025 | 03:11 AM