Transport Department: వాహన ఫిట్‌నెస్.. ఇక ఆటోమేటిక్
ABN , Publish Date - Feb 17 , 2025 | 04:14 AM
రవాణాశాఖకు 14 ఆటోమేటిక్ ఫిట్‌నెస్ టెస్టింగ్ సెంటర్లు(ఏటీఎస్) రానున్నాయి. ప్రస్తుతం వాహనాలను రవాణాశాఖ అధికారులు మాన్యువల్‌గా పరిశీలన జరిపి, ఫిట్‌నెస్ ధ్రువీకరణ పత్రాలను అందజేస్తున్నారు.

రవాణా శాఖకు త్వరలో 14 ఆటోమేటిక్ ఫిట్‌నెస్ సెంటర్లు
జిల్లాల్లో 10.. హైదరాబాద్‌లో 4.. ప్రతిపాదనలు సిద్ధం
ప్రస్తుతం మాన్యువల్‌గా వాహనాల తనిఖీ.. పారదర్శకత
లేకపోవడంతో యథేచ్ఛగా ఫిట్‌నెస్ పత్రాల జారీ
ప్రమాదాల బారిన వాహనాలు.. ఏటీఎస్‌తో పరిష్కారం
హైదరాబాద్, ఫిబ్రవరి 16 (ఆంధ్రజ్యోతి): రవాణాశాఖకు 14 ఆటోమేటిక్ ఫిట్‌నెస్ టెస్టింగ్ సెంటర్లు(ఏటీఎస్) రానున్నాయి. ప్రస్తుతం వాహనాలను రవాణాశాఖ అధికారులు మాన్యువల్‌గా పరిశీలన జరిపి, ఫిట్‌నెస్ ధ్రువీకరణ పత్రాలను అందజేస్తున్నారు. ఈ విధానంలో పారదర్శకత లేకపోవడం.. ఫిట్‌నెస్ సర్టిఫికెట్లు ఉన్న వాహనాలు కూడా ప్రమాదాల బారిన పడుతున్నట్లు గణాంకాలు స్పష్టం చేస్తుండడంతో.. ప్రభుత్వం ఏటీఎస్ వైపు మొగ్గుచూపుతోంది. ఏటీఎ్‌సలలో కార్లు మొదలు.. భారీ వాహనాల వరకు వేగంగా పరీక్షలు నిర్వహించే అవకాశాలుంటాయి. రోజుకు సగటున 40 వాహనాలకు పరీక్షలు నిర్వహించవచ్చు. ఉమ్మడి జిల్లాల్లో.. ఒక్కోటి చొప్పున 10, హైదరాబాద్‌లో 4 ఏటీఎస్ కేంద్రాలను ఏర్పాటు చేసేందుకు రవాణాశాఖ అధికారులు ప్రతిపాదనలను సిద్ధం చేశారు. ఒక్కో సెంటర్ ఏర్పాటుకు రూ.8 కోట్ల చొప్పున.. మొత్తం 14 కేంద్రాలకు రూ.112 కోట్లు ఖర్చవుతుందని ప్రాథమికంగా అంచనా వేశారు. ఆంధ్రప్రదేశ్‌లో రెండు ఏటీఎ్‌సలు ఉన్నాయి. వీటి పనితీరును పరిశీలించేందుకు ఇటేవలే రవాణాశాఖ, రహదారులశాఖ అధికారుల బృందం ఒకటి అనకాపల్లిలోని ఏటీఎ్‌సను సందర్శించింది. ఆ కేంద్రాన్ని ఓ ప్రైవేటు సంస్థ నిర్వహిస్తోంది. ప్రైవేటు సంస్థతో ప్రభు త్వ ఒప్పందాలు, ఇతర అంశాలను పరిశీలించింది. దీనిపై ప్రభుత్వానికి ఓ నివేదికను అందజేయనుంది. ప్రభుత్వం ఈ నివేదికను పరిశీలించాక.. రాష్ట్రంలోనూ ఈ కేంద్రాలను ప్రవేశపెట్టేలా అధికారులు ప్రతిపాదనలను రూపొందించారు.
అక్రమాలకు చెక్
రవాణాశాఖలో ఏజెంట్ల రాజ్యం గురించి తెలియంది కాదు..! డ్రైవింగ్ లైసెన్స్ మొదలు.. వాహనాల ఫిట్‌నెస్ వరకు ప్రభుత్వం నిర్ణయించే ధర ఒకటైతే.. ఏజెంట్లు దాన్ని నాలుగైదు రెట్లు పెంచి వసూలు చేస్తుంటారు. ఏటా విద్యాసంవత్సరం ఆరంభంలో స్కూలు బస్సులు, దసరా, సంక్రాంతి సమయంలో ప్రైవేట్ ట్రావెల్స్‌కు చెందిన బస్సులపై రవాణాశాఖ అధికారులు దాడులు నిర్వహిస్తున్న విషయం తెలిసిందే..! మిగతా సమయాల్లో వాటి గురించి పట్టించుకోరనే అపవాదులున్నాయి. ట్రక్కులు, లారీల సంగతి దేవుడెరుగు? ఇక రవాణాశాఖ కార్యాలయాల్లో ఫిట్‌నె్‌సను మాన్యువల్‌గా నిర్వహిస్తున్నారు. ఇక్కడ కూడా ఏజెంట్ల జోరు ఉందనే ఆరోపణలున్నాయి. ఫిట్‌నెస్ విషయంలో ఏటీఎ్‌సలను అందుబాటులోకి తీసుకువస్తే.. వ్యవస్థలో పారదర్శకత ఉంటుందని ప్రభుత్వం అభిప్రాయపడుతోంది.