Local Body Polls: సెప్టెంబరు రెండో వారంలో స్థానిక నోటిఫికేషన్!
ABN , Publish Date - Aug 31 , 2025 | 03:46 AM
రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికలకు సెప్టెంబరు రెండో వారంలో నోటిఫికేషన్ రానుంది. మొదట ఎంపీటీసీ, జడ్పీటీ సీ స్థానాలకే ఎన్నికలు నిర్వహిస్తారు. గ్రామ పంచాయతీలకు ఆ తర్వాత నిర్వహించాలని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తోంది.
ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికలకు సర్కారు సన్నద్ధం
రేపో ఎల్లుండో బీసీలకు 42 శాతం రిజర్వేషన్ల జీవో
బీసీ స్థానాలు తేల్చేందుకు వారం గడువు అడిగిన ఈసీ
10 నాటికి ఎంపీటీసీ, జడ్పీటీసీల తుది ఓటర్ల జాబితా
హైదరాబాద్, ఆగస్టు 30 (ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికలకు సెప్టెంబరు రెండో వారంలో నోటిఫికేషన్ రానుంది. మొదట ఎంపీటీసీ, జడ్పీటీ సీ స్థానాలకే ఎన్నికలు నిర్వహిస్తారు. గ్రామ పంచాయతీలకు ఆ తర్వాత నిర్వహించాలని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తోంది. స్థానిక సంస్థల్లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్ల కోసం అసెంబ్లీలో బిల్లులను ఆమోదించి, తరువాత దానికి సంబంధించిన జీవోను ప్రభుత్వం విడుదల చేయనుంది. ఆదివారం రెండు బిల్లులు ఆమోదం పొందితే సోమ లేదా మంగళవారాల్లో జీవో ఇస్తారని తెలుస్తోంది. రాష్ట్ర ప్రభుత్వం రిజర్వేషన్లు తేల్చితే బీసీల స్థానాల కేటాయింపునకు మరో వారం రోజుల గడువు కావాలని ఎన్నికల సంఘం చెప్పినట్లు తెలిసింది. ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికలకు సంబంధించిన ఓటర్ల తుది జాబితాను సెప్టెంబరు 10 నాటికి ప్రకటించాలని ఎన్నికల సంఘం శనివారం నోటిఫికేషన్ ఇచ్చింది. ఇవన్నీ చూస్తే సెప్టెంబరు రెండో వారంలో స్థానిక ఎన్నికల నోటిఫికేషన్ వచ్చే అవకాశం ఉంది. జూలై 25 వరకు రాష్ట్రంలో రిజర్వేషన్లను ఖరారు చేసి, సెప్టెంబరు 30 లోపు స్థానిక ఎన్నికల ప్రక్రియను పూర్తి చేయాలని ఇప్పటికే హైకోర్టు రాష్ట్ర ప్రభుత్వానికి చెపింది.
కోర్టు సూచన నేపథ్యంలో రిజర్వేషన్ల ఖరారుకు ప్రత్యేక కమిషన్ ఇచ్చిన అంశాలను పరిగణనలోకి తీసుకుని దాని ప్రకారం ప్రభుత్వం ప్రత్యేక ఉత్తర్వులను విడుదల చేయనుంది. అనంతరం స్థానిక ఎన్నికల నిర్వహణకు చర్యలు తీసుకోవాలని కోరుతూ రాష్ట్ర ఎన్నికల కమిషన్‌కు సమాచారం ఇస్తుంది. అడ్వొకేట్ జనరల్‌తో చర్చించిన తరువాతే 2018 పంచాయతీరాజ్ చట్టానికి సవరణ చేసి, ఎన్నికలను నిర్వహించాలని నిర్ణయించినట్టు శనివారం మీడియా ముందు మంత్రులు చెప్పారు. ఎవరైనా కోర్టుకు వెళితే ఎన్నికల నిర్వహణ, రిజర్వేషన్ల ఖరారుపై కోర్టు తీర్పుకు లోబడి వ్యవహరించాల్సి ఉంటుంది. ఎన్నికలే ఆగే పరిస్థితి వస్తే పార్టీ పరంగా బీసీలకు 42 శాతం రిజర్వేషన్లను ఇచ్చి ఎన్నికలకు వెళ్లే అవకాశాలున్నాయి. మొదట ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికలు నిర్వహించాలని, తర్వాత సర్పంచి ఎన్నికలకు వెళ్లాలని ప్రభుత్వం భావిస్తోంది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో కాంగ్రెస్ అనుసరించిన ఆనవాయితీ ఇదేనని గుర్తు చేస్తున్నారు. రాష్ట్రంలో ఏడాదిన్నరగా పంచాయతీలకు పాలక మండళ్లు లేకపోవడంతో కేంద్రం నుంచి రావాల్సిన 15వ ఆర్ధిక సంఘం నిధులు నిలిచిపోయాయి.
తుది ఓటర్ల జాబితాకు నోటిఫికేషన్
గ్రామ పంచాయతీల ఓటరు జాబితాల ప్రకటనకు ఎన్నికల కమిషన్ ఇప్పటికే నోటిఫికేషన్ ఇచ్చింది. తాజాగా ఎంపీటీసీ, జడ్పీటీసీల పరిధిలోని ఓటరు జాబితాల సవరణ, తుది ఓటరు జాబితా ఖరారు, పోలింగ్ కేంద్రాల వివరాల ప్రకటనకు శనివారం రాష్ట్ర ఎన్నికల కమిషనర్ రాణి కుముదిని నోటిఫికేషన్ విడుదల చేశారు. సెప్టెంబరు 6న మండల, జిల్లా పరిషత్ కార్యాలయాల్లో ముసాయిదా ఓటరు జాబితా, పోలింగ్ కేంద్రాల సమాచారాన్ని ప్రదర్శిస్తారు. 8న రాజకీయ పార్టీల ప్రతినిధులు, జిల్లా, మండల స్థాయి ఎన్నికల అధికారులతో సమావేశాలుంటాయి. వాటిలో తెలిపే అభ్యంతరాలను పరిశీలించి 10న తుది ఓటర్ల జాబితాను ఖరారు చేస్తారు.
ఇవి కూడా చదవండి:
కాళేశ్వరం పీపీటీ ప్రజెంటేషన్‌పై మాటల యుద్ధం..
15 రోజుల పాటు అసెంబ్లీ సమావేశాలు నిర్వహించాలి.. కేటీఆర్ డిమాండ్
మరిన్ని తెలంగాణ వార్తలు కోసం క్లిక్ చేయండి..