TG PGECET: టీజీపీజీఈసెట్‌లో 21,290 మంది ఉత్తీర్ణత
ABN , Publish Date - Jun 27 , 2025 | 03:17 AM
పోస్ట్ గ్రాడ్యుయేటెడ్ ఇంజనీరింగ్, ఫార్మసీ కోర్సుల్లో ప్రవేశాలకు నిర్వహించిన టీజీ పీజీఈసెట్-2025 ఫలితాలను గురువారం జేఎన్‌టీయూలో ఉన్నత విద్యామండలి చైర్మన్ ప్రొఫెసర్ వి.బాలకిష్టారెడ్డి విడుదల చేశారు.
ఫలితాలు విడుదల చేసిన ఉన్నత విద్యామండలి చైర్మన్ బాలకిష్టారెడ్డి
హైదరాబాద్ సిటీ, జూన్ 26 (ఆంధ్రజ్యోతి): పోస్ట్ గ్రాడ్యుయేటెడ్ ఇంజనీరింగ్, ఫార్మసీ కోర్సుల్లో ప్రవేశాలకు నిర్వహించిన టీజీ పీజీఈసెట్-2025 ఫలితాలను గురువారం జేఎన్‌టీయూలో ఉన్నత విద్యామండలి చైర్మన్ ప్రొఫెసర్ వి.బాలకిష్టారెడ్డి విడుదల చేశారు. పీజీఈసెట్‌కు ఈసారి 25,335 మంది రిజిస్ట్రేషన్ చేసుకోగా 22,983మంది పరీక్షలకు హాజరయ్యారు. వీరిలో 21,290 మంది (90.72శాతం) ఉత్తీర్ణులయ్యారు. మొత్తం 19 సబ్జెక్టులకు ప్రవేశ పరీక్షలు నిర్వహించగా అత్యధికంగా ఫార్మసీ అభ్యర్థులు 7,266 మంది, కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్‌కు 6,434 మంది అర్హత సాధించారు. టెక్స్‌టైల్ టెక్నాలజీ, నానో టెక్నాలజీ, మైనింగ్, మెటలర్జికల్ ఇంజనీరింగ్, ఇన్‌స్ట్రుమెంటేషన్, జియో ఇన్ఫర్మాటిక్స్, ఫుడ్‌టెక్నాలజీ, ఏరోస్పేస్, బయోమెడికల్ ఇంజనీరింగ్ సబ్జెక్టుల్లో అర్హులైన వారి సంఖ్య 100కు లోపే ఉంది.
గతేడాది ఎంటెక్‌లో అడ్మిషన్లు 60శాతం లోపే: బాలకిష్టారెడ్డి
బయోటెక్నాలజీ, ఫార్మసీ కోర్సుల్లో ఏపీకి చెందిన అభ్యర్థులు టాపర్లుగా నిలిచారు. మిగతా సబ్జెక్టుల్లో టాపర్లుగా తెలంగాణ అభ్యర్థులున్నారు. ఎంటెక్, ఎంఫార్మసీ కోర్సుల్లో అందుబాటులో ఉన్న సీట్లలో గతేడాది 60శాతం లోపే అడ్మిషన్లు జరిగాయని ఉన్నత విద్యామండలి చైర్మన్ బాలకిష్టారెడ్డి అన్నారు. రాష్ట్రంలోని 106 ఇంజనీరింగ్ కాలేజీల్లో 7,912 ఎంటెక్ సీట్లుండగా గతేడాది 4,732 సీట్లే భర్తీ అయినట్టు చెప్పారు. ఎం.ఫార్మసీలో 5,371సీట్లకు 4,050 మంది, ఫార్మ్‌డీ కోర్సులో 390 సీట్లకు 252 మంది అభ్యర్థులే ఆయా కోర్సుల్లో ప్రవేశాలు పొందారని పేర్కొన్నారు. పీజీ కోర్సుల్లో ప్రవేశాలను మరింత పెంచేందుకు చర్యలు చేపట్టామన్నారు. ఎంటెక్ కోర్సుల్లో గేట్ ర్యాంకర్లకు, ఎం.ఫార్మసీ కోర్సుల్లో జి.పాట్ ర్యాంకర్లకు సీట్ల కేటాయింపులో తొలి ప్రాధాన్యత ఉంటుందని జేఎన్‌టీయూ రెక్టార్ విజయకుమార్ రెడ్డి తెలిపారు. మిగిలిన సీట్లను పీజీఈసెట్ ర్యాంకర్లకు కేటాయిస్తారన్నారు. జర్మనీతో జేఎన్‌టీయూ ఎంవోయూ చేసుకున్న మాస్టర్స్ ఇన్ ఎనర్జీ సిస్టమ్స్ కోర్సు ప్రవేశాలకు పీజీఈసెట్ ర్యాంకర్లు అర్హులేనని చెప్పారు.
ఇవి కూడా చదవండి:
ఐటీ ఉద్యోగి ఆత్మహత్య కేసులో కీలక విషయాలు..
అఖండ గోదావరి ప్రాజెక్టుకు శంకుస్థాపన..
జలహారతి కార్పొరేషన్ లిమిటెడ్ ఏర్పాటు చేసిన ప్రభుత్వం..
For More AP News and Telugu News