Thummala Nagashwara Rao: కేంద్రం మెడలు వంచైనా తీసుకొస్తాం
ABN , Publish Date - Aug 22 , 2025 | 05:32 AM
రాష్ట్రంలో సాగుకు సరిపడా యూరియా కేటాయించాలని వానాకాలం సీజన్ మొదలైనప్పటి నుంచి లేఖలు రాస్తున్నా, ఢిల్లీ వెళ్లి విజ్ఞప్తులు చేస్తున్నా కేంద్ర ప్రభుత్వం రాష్ట్రానికి అరకొరగానే యూరియాను సరఫరా చేస్తోందని రాష్ట్ర వ్యవసాయశాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఆందోళన వ్యక్తం చేశారు.
చైనా నుంచి యూరియాను తెప్పించడంలో కేంద్రం పూర్తిగా విఫలం
అంతర్జాతీయ పరిస్థితుల గురించి చెప్పకుండా గందరగోళం సృష్టిస్తోంది
దేశవ్యాప్తంగా యూరియా సమస్యలు
రాష్ట్ర ప్రభుత్వాన్ని బీజేపీ బద్నాం చేస్తోంది
ఆందోళనల వెనక రాజకీయ పార్టీలు
రాష్ట్ర వ్యవసాయశాఖ మంత్రి తుమ్మల
హైదరాబాద్, ఆగస్టు 21 (ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలో సాగుకు సరిపడా యూరియా కేటాయించాలని వానాకాలం సీజన్ మొదలైనప్పటి నుంచి లేఖలు రాస్తున్నా, ఢిల్లీ వెళ్లి విజ్ఞప్తులు చేస్తున్నా కేంద్ర ప్రభుత్వం రాష్ట్రానికి అరకొరగానే యూరియాను సరఫరా చేస్తోందని రాష్ట్ర వ్యవసాయశాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఆందోళన వ్యక్తం చేశారు. అయితే కేంద్రం మెడలు వంచైనా సరే... రాష్ట్రానికి యూరియా తీసుకొస్తామన్నారు. హైదరాబాద్‌లో గురువారం ఆయన మీడియాతో మాట్లాడుతూ... చైనా నుంచి దిగుమతి కావాల్సిన యూరియాను తెప్పించడంలో కేంద్రప్రభుత్వం పూర్తి గా విఫలమైందన్నారు. జియో పాలిటిక్స్ పరిస్థితులు వివరించకుండా కేంద్రం గందరగోళ పరిస్థితులను సృష్టిస్తోందన్నారు. పార్లమెంటు ఆవరణలో కాంగ్రెస్ ఎంపీల ఆందోళనతో రాష్ట్రానికి ఈ వారంలో 50 వేల టన్నుల యూరియా సరఫరా చేయడానికి అంగీకరించిందని తెలిపారు. అదేవిధంగా గత 5నెలల లోటును కూడా భర్తీచేయాలని డిమాండ్ చేశారు. కేంద్ర మంత్రులు జేపీ నడ్డా, కిషన్‌రెడ్డి ఈ విషయంలో చొరవ తీసుకోవాలని కోరారు. దేశవ్యాప్తంగా యూరి యా సరఫరాలో సమస్యలుంటే... ఒక్క తెలంగాణలోనే ఉన్నట్లుగా రాష్ట్ర ప్రభుత్వాన్ని బదనాం చేస్తున్నారని తుమ్మల అన్నారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రాంచందర్‌రావు రైతుల సమస్యను రాజకీయానికి వాడుకుంటున్నారని విమర్శించారు. విదేశాల నుంచి ఇంపోర్టెడ్ యూరి యా రాలేదని, దేశీయ ఉత్పత్తి కూడా సక్రమంగా లేదని బీజేపీ శ్రేణులు నిజాలు ఒప్పుకోవాలని సూచించారు.
యూరి యా కొరతపై జరుగుతున్న ఆందోళనల వెనక కొన్ని రాజకీయ పార్టీలు ఉన్నాయని తుమ్మల ఆరోపించారు. అధికారం కోల్పోయిన బీఆర్‌ఎస్ పార్టీ నేతలు... ప్రాజెక్టుల గేట్లుఎత్తుతాం! బటన్లు నొక్కుతాం! అని సొల్లు మాటలు మాట్లాడుతున్నారని ధ్వజమెత్తారు. వ్యవసాయ యంత్రాలు, పనిముట్లపై 12 శాతం జీఎస్టీ విధించడం రైతులకు ఆర్థికభారంగా మారిందని, చిన్న, సన్నకారు రైతులు వ్యవసాయ పనిముట్లు కొనలేకపోతున్నారని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అన్నారు. వ్యవసాయ పరికరాలను జీఎస్టీ నుంచి మినహాయించాలని విజ్ఞప్తి చేస్తూ గురువారం ప్రధానమంత్రి మోదీకి లేఖ రాశారు. లేఖ ప్రతులను కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్, వ్యవసాయ మంత్రి శివరాజ్‌సింగ్ చౌహాన్‌లకు పంపించారు. తెలంగాణతో పాటు దేశవ్యాప్తంగా ఉన్న రైతులకు మేలు కలిగేలా కేంద్రం నిర్ణయం తీసుకోవాలని కోరారు. అదేవిధంగా వ్యవసాయ అధికారులతో మంత్రి తుమ్మల గురువారం వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. యూరియా నిల్వలను ఎప్పటికప్పుడు పర్యవేక్షించాలని, రవాణా సమస్యలుంటే కలెక్టర్లతో సమన్వయం చేసుకుని పరిష్కరించాలని ఆదేశించారు. ప్రైవేటు డీలర్లు యూరియాను బ్లాక్ చేయకుండా చర్యలు తీసుకోవాలన్నారు. డీలర్లు ఎక్కువ ధరకు యూరియా అమ్మితే కేసులు నమోదుచేస్తామని హెచ్చరించారు. నానో యూరియాను వినియోగించేలా రైతులను ప్రోత్సహించాలని, పట్టాదారు పాసుపుస్తకాల ప్రకారం యూరియా అమ్మే అవకాశాలను పరిశీలించాలని అధికారులకు సూచించారు. రాష్ట్ర వ్యవసాయశాఖ డైరెక్టర్ డాక్టర్ బి.గోపి వీడియో కాన్ఫరెన్స్‌లో పాల్గొన్నారు.
ఈ వార్తలు కూడా చదవండి..
ఎమ్మెల్యేలు ఇలా చేస్తే ఎలా.. సీఎం చంద్రబాబు ఫైర్
టీటీడీపై వైసీపీ బురద జల్లుతోంది.. జ్యోతుల నెహ్రూ ధ్వజం
Read Latest AP News and National News