Share News

Eye Tests: జాతీయ రహదారిపై డ్రైవర్లకు కంటి పరీక్షలు

ABN , Publish Date - Jan 06 , 2025 | 04:30 AM

‘‘వాహనాలు నడిపే డ్రైవర్లకు కంటి సమస్యలు లేకుండా చూడాలి. ప్రమాదాలు జరగకుండా ప్రత్యేక చర్యలు తీసుకోవాలి.

Eye Tests: జాతీయ రహదారిపై డ్రైవర్లకు కంటి పరీక్షలు

  • ప్రమాదాల నివారణకు ప్రత్యేక చర్యలు: మంత్రి కోమటిరెడ్డి

చిట్యాల రూరల్‌, జనవరి 5 (ఆంధ్రజ్యోతి): ‘‘వాహనాలు నడిపే డ్రైవర్లకు కంటి సమస్యలు లేకుండా చూడాలి. ప్రమాదాలు జరగకుండా ప్రత్యేక చర్యలు తీసుకోవాలి. ఇందుకోసం జాతీయ రహదారిపై తిరిగే వాహన డ్రైవర్లకు దేశంలోనే తొలిసారిగా తెలంగాణలో కంటిపరీక్షలు నిర్వహిస్తున్నాం’’ అని కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి తెలిపారు. రహదారి భద్రతా మాసోత్సవాల సందర్భంగా ఆదివారం నల్లగొండ జిల్లా చిట్యాల మండలం వట్టిమర్తి శివారులో జాతీయ రహదారి పక్కన గల డూన్‌ పంజాబీ దాబాలో ‘నల్లగొండ దృష్టి - ట్రక్కు డ్రైవర్లకు ఉచిత కంటి పరీక్షల’ కేంద్రాన్ని మంత్రి ప్రారంభించారు.


వాహన డ్రైవర్లకు కంటి పరీక్షలు నిర్వహించి అవసరమైన వారికి కళ్ల అద్దాలు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మంత్రి కోమటిరెడ్డి మాట్లాడుతూ.. జాతీయ రహదారిపై ప్రమాదాలను నివారించేందుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక చర్యలు తీసుకుంటోందని చెప్పారు. కంటి చూపు సమస్యలు ఉన్నా, కళ్లు మసకగా ఉన్నా డ్రైవర్లు ప్రమాదాలకు గురవుతున్నారన్నారు. ట్రక్కు డ్రైవర్లు, లారీ డ్రైవర్లకు కళ్ల పరీక్షలు చేసి కళ్లద్దాలు అందిస్తే ప్రమాదాలు తగ్గే అవకాశముందని పేర్కొన్నారు. నల్లగొండ జిల్లా కలెక్టర్‌ ఇలా త్రిపాఠి ప్రత్యేక దృష్టిని సారించి కంటి పరీక్ష కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం అభినందనీయమన్నారు.

Updated Date - Jan 06 , 2025 | 04:30 AM