Share News

Fertility Scam: సగానికి పైగా సంతాన సాఫల్య కేంద్రాల్లో లోపాలు

ABN , Publish Date - Aug 07 , 2025 | 05:10 AM

మోసం.. మోసం.. మోసం..! ‘‘సంతానం లేని దంపతులకు శుభవార్త..!’’ అంటూ తాటికాయలంత అక్షరాలతో సంతనా సాఫల్య కేంద్రాల్లో ధరల పట్టిక ప్రదర్శన మొదలు.. స్కానింగ్‌ల నమోదు..

Fertility Scam: సగానికి పైగా సంతాన సాఫల్య కేంద్రాల్లో లోపాలు

  • గ్రేటర్‌ హైదరాబాద్‌లోని ఫర్టిలిటీ కేంద్రాల్లో ముగిసిన తనిఖీలు

  • నోటీసులకు రంగం సిద్ధం.. ఇక రాష్ట్రవ్యాప్తంగా తనిఖీలు

హైదరాబాద్‌, ఆగస్టు 6 (ఆంధ్రజ్యోతి): మోసం.. మోసం.. మోసం..! ‘‘సంతానం లేని దంపతులకు శుభవార్త..!’’ అంటూ తాటికాయలంత అక్షరాలతో సంతనా సాఫల్య కేంద్రాల్లో ధరల పట్టిక ప్రదర్శన మొదలు.. స్కానింగ్‌ల నమోదు.. ఫర్టిలిటీ వరకు మోసాలే జరుగుతున్నాయని వైద్య ఆరోగ్య శాఖ తనిఖీల్లో తేలింది. గ్రేటర్‌ హైదరాబాద్‌ పరిధిలో నాలుగు రోజులుగా తనిఖీలు నిర్వహించగా.. సగానికి పైగా సంతాన సాఫల్య కేంద్రాల్లో లోపాలు ఉన్నట్లు అధికారులు గుర్తించారు. దాంతో.. 50ు కేంద్రాలకు నోటీసులు ఇచ్చేందుకు సిద్ధమవుతున్నారు. రాష్ట్రంలోని ఇతర జిల్లాల్లోని కేంద్రాలోనూ తనిఖీలు ప్రారంభం కానున్నాయి. సృష్టి ఫర్టిలిటీ కేంద్రంలో సరోగసి పేరుతో చేసిన మోసం, చైల్డ్‌ ట్రాఫికింగ్‌ వ్యవహారాలు ఇటీవల వెలుగులోకి రావడంతో గ్రేటర్‌ హైదరాబాద్‌ పరిధిలోని సంతాన సాఫల్య కేంద్రాలను తనిఖీలు చేయాలని ప్రభుత్వం ఆదేశించిన సంగతి తెలిసిందే. సర్కారు ఆదేశాలతో 35 బృందాలు ఈ తనిఖీలను చేపట్టాయి. తెలంగాణ వ్యాప్తంగా మొత్తం 381 సంతాన సాఫల్య కేంద్రాలున్నాయి. ఇందులో గ్రేటర్‌ హైదరాబాద్‌(హైదరాబాద్‌, రంగారెడ్డి, మేడ్చల్‌-మల్కాజిగిరి జిల్లాలు) పరిఽధిలో ఉన్న 271 కేంద్రాల్లో అధికారుల తనిఖీలు బుధవారంతో పూర్తయ్యాయి. ఈ తనిఖీలకు సంబంధించిన నివేదికలు ఒకట్రెండ్రోజుల్లో ప్రభుత్వానికి చేరుతాయి.


ఆన్‌లైన్‌లో నమోదవ్వని స్కానింగ్‌లు

సింహభాగం సంతాన సాఫల్య కేంద్రాలు అలా్ట్రసౌండ్‌ స్కానింగ్‌ వివరాలను ఆన్‌లైన్‌లో నమోదు చేయడం లేదని తనిఖీ బృందాలు గుర్తించాయి. దాంతోపాటు.. చాలా కేంద్రాలు నిబంధనలను ఉల్లంఘిస్తున్నాయని, రిజిస్ట్రేషన్‌ సమయంలో మానవ వనరులకు సంబంధించిన పేర్కొన్న సంఖ్యకు.. అక్కడ పనిచేసే సిబ్బంది సంఖ్యకు సంబంధమే లేదని తేల్చాయి. ఇక రేడియాలజిస్టు, ఎంబ్రియాలజిస్టులు లేకుండానే కొన్ని కేంద్రాలు నడుస్తున్నట్లు నిర్ధారణ అయ్యింది. పనిజేసే డాక్టర్ల పేర్లకు, రికార్డుల్లో ఉన్న వైద్యుల పేర్లకు ఏమాత్రం సంబంధం లేదని తేలింది. రికార్డుల్లో చూపిన అలా్ట్రసౌండ్‌ స్కానింగ్‌ యంత్రాలకు, అక్కడున్న యంత్రాల సంఖ్యకు పొంతనే లేదని గుర్తించినట్లు సమాచారం. ఉదాహరణకు.. రిజిస్ట్రేషన్‌ సమయంలో ఓ ఫర్టిలిటీ కేంద్రం రెండు అలా్ట్రసౌండ్‌ యంత్రాలున్నట్లు చూపించింది. తాజాగా తనిఖీలు చేసిన అధికారులు అక్కడ నాలుగు యంత్రాలను గుర్తించారు. ప్రభుత్వ అనుమతి లేకుండా ఇలా యంత్రాలను వినియోగించడం పీసీపీఎన్‌డీటీ చట్టం ప్రకారం నేరం. ఇలాంటి ఉల్లంఘనలకు భారీగా జరిమానాలను విధించవచ్చు. స్కానింగ్‌లు చేసిన ప్రతిసారి.. ఆన్‌లైన్‌లో నమోదు చేయాలని పీసీపీఎన్‌డీటీ చట్టం స్పష్టం చేస్తోంది. సింహభాగం కేంద్రాలు ఆన్‌లైన్‌ నమోదు జోలికి వెళ్లడం లేదని తేలింది. దీన్ని బట్టి.. గర్భవిచ్ఛిత్తి కేసులు కూడా పెరిగాయనే అనుమానాలను తనిఖీ బృందాలు వ్యక్తం చేస్తున్నాయి. 80ు కేంద్రాల్లో అసలు ధరల పట్టికను, అందుబాటులో ఉన్న వైద్యుల వివరాలను ప్రదర్శించడం లేదని అధికారులు గుర్తించారు.


అప్రమత్తమైన సరగసీ కేంద్రాలు..!

వైద్య ఆరోగ్యశాఖ బృందాలు తనిఖీలకు వస్తున్నాయని ముందుగానే తెలిసిపోవడంతో పలు సంతాన సాఫల్య కేంద్రాలు జాగ్రత్త పడ్డాయి. అధికారులు రాక ముందే.. లొసుగులను సరిచేసుకున్నాయి. ముఖ్యంగా రికార్డుల నిర్వహణ, స్కానింగ్స్‌ నమోదు వంటివి పక్కాగా ఉండేట్లు జాగ్రత్త తీసుకున్నట్లు సమాచారం.

మిగతా జిల్లాలపై నజర్‌

గ్రేటర్‌ హైదరాబాద్‌తోపాటు.. రంగారెడ్డి, మేడ్చల్‌-మల్కాజిగిరి జిల్లాల్లో తనిఖీలు ముగియడంతో మిగిలిన జిల్లాల్లో ఉన్న మరో 110 కేంద్రాలపై వైద్య ఆరోగ్య శాఖ దృష్టిసారించింది. వాటిల్లోనూ తనిఖీలు చేపట్టేందుకు రంగం సిద్ధమైంది. ఒకట్రెండు రోజుల్లో తనిఖీలు మొదలవుతాయని వైద్యవర్గాలు వెల్లడించాయి. గ్రేటర్‌ హైదరాబాద్‌ పరిధిలో జరిపిన తనిఖీ బృందాల్లో ఒక డాక్టర్‌, ఒక డ్రగ్‌ ఇన్‌స్పెక్టర్‌ ఉండేలా జాగ్రత్తపడ్డారు. జిల్లాల్లోని సంతాన సాఫల్య కేంద్రాల్లో తనిఖీలకు మాత్రం జాయింట్‌ డైరెక్టర్‌ స్థాయి అధికారులను నియమించనున్నట్లు సమాచారం. జాతీయ ఆరోగ్య మిషన్‌లో ప్రొగ్రామ్‌ ఆఫీసర్లుగా పనిచేస్తున్న వారిని కూడా తనిఖీల బాధ్యతలను అప్పగించనున్నట్లు తెలిసింది. తనిఖీ బృందాల్లో ఎవరెవరుంటారు? ఏయే బృందాలను ఏయే జిల్లాలకు పంపాలనే ప్రణాళిక ఇప్పటికే సిద్ధమైనట్లు తెలుస్తోంది.


ఈ వార్తలు కూడా చదవండి..

ఏపీ కేబినెట్ భేటీ.. పలు కీలక నిర్ణయాలు

ఈడీ విచారణ అనంతరం విజయ్ దేవరకొండ కీలక వ్యాఖ్యలు

Updated Date - Aug 07 , 2025 | 05:10 AM