High Court: యుద్ధానికి వెళ్తున్నట్లు ఆ రంగులేంటి?
ABN , Publish Date - Aug 14 , 2025 | 04:10 AM
హైడ్రా వాహనాలకు ఆర్మీ రంగులు వేయడంపై హైకోర్టు అసహనం వ్యక్తం చేసింది. సరిహద్దుల్లో యుద్ధానికి వెళుతున్నట్టు వాహనాలకు ఆ రంగులు ఏంటని ప్రశ్నించింది.
హైడ్రా వాహనాల రంగులపై హైకోర్టు అసహనం
హైదరాబాద్, ఆగస్టు 13 (ఆంధ్రజ్యోతి): హైడ్రా వాహనాలకు ఆర్మీ రంగులు వేయడంపై హైకోర్టు అసహనం వ్యక్తం చేసింది. సరిహద్దుల్లో యుద్ధానికి వెళుతున్నట్టు వాహనాలకు ఆ రంగులు ఏంటని ప్రశ్నించింది. చెరువుల ఎఫ్‌టీఎల్ నిర్ధారించి ఫైనల్ నోటిఫికేషన్ ఇవ్వకుండా కూల్చివేతలు ఎందుకు చేపడుతున్నారని నిలదీసింది. ప్రభుత్వ భూముల పరిరక్షణ పేరిట హైడ్రా ఎందుకు అంత హడావుడి చేస్తోందని అడిగింది. బాధ్యతాయుతంగా విధులు నిర్వర్తించాల్సిన అధికారులు హడావుడి నిర్ణయాలతో ప్రజలను ఇబ్బందులకు గురిచేస్తే ఊరుకోమని స్పష్టం చేసింది. ప్రైవేటు భూముల పైకి హైడ్రా ఎందుకు వెళుతోందని? ఎలాంటి స్టే ఉత్తర్వులు లేని చెరువుల విషయంలో ఏం చేస్తున్నారని? ప్రశ్నించింది. రంగారెడ్డి జిల్లా ఖానామెట్ సర్వే నంబర్ 37, 38/1లో తనకు చెందిన 1.07 ఎకరాల భూమిలో హైడ్రా చట్టవిరుద్ధంగా జోక్యం చేసుకుంటోందంటూ వెంకటేశ్వర్‌రావు హైకోర్టును ఆశ్రయించారు. అదే ప్రాంతంలోని 6 ఎకరాలకు సంబంధించి దాఖలైన మూడు పిటిషన్లను విచారించిన హైకోర్టు ఏప్రిల్ 23న యథాతథ స్థితి ఆదేశాలు జారీ చేసింది.
అయితే, హైడ్రా ఈ ఉత్తర్వులను అతిక్రమించిందంటూ పిటిషనర్లు దాఖలు చేసిన కోర్టు ధిక్కరణ పిటిషన్లను జస్టిస్ బీ విజయ్‌సేన్‌రెడ్డి ధర్మాసనం విచారించింది. పిటిషనర్ల తరఫున న్యాయవాది తరుణ్ జీ రెడ్డి వాదనలు వినిపిస్తూ.. స్టేట్‌సకో ఆదేశాలు ఇచ్చినా హైడ్రా కమిషనర్ రంగనాథ్ వ్యక్తిగతంగా పిటిషనర్ భూమిలో జోక్యం చేసుకుంటున్నారన్నారు. హైడ్రా తరఫు న్యాయవాది వాదనలు వినిపిస్తూ.. పిటిషనర్ అభ్యంతరం వ్యక్తం చేస్తున్న భూమి మినహాయించి ఇతర భూముల్లో పనులు చేసుకునేందుకు అనుమతి ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు. వాదనలు విన్న ధర్మాసనం.. హైడ్రా ఎందుకంత దూకుడుగా వెళ్తోందని కమిషనర్ రంగనాథ్‌ను ప్రశ్నించింది. స్టేట్‌సకో పాటించాలని చెప్పినా వినకపోవడం కోర్టు ధిక్కరణ కిందకే వస్తుందని ఆగ్రహం వ్యక్తం చేసింది. చెరువులు, ప్రభుత్వ భూముల రక్షణ పేరుతో ప్రజలను ఇబ్బందులకు గురిచేయడం, హడావుడి చేయడం ఎందుకని ప్రశ్నించింది. సరిహద్దుల్లో యుద్ధానికి వెళ్తున్నట్లు వాహనాలకు ఆ రంగులేంటని అభ్యంతరం వ్యక్తం చేసింది. కోర్టు ఆదేశాలను ఉల్లంఘిస్తే కఠిన శిక్ష విధించడానికి వెనకాడబోమని తేల్చిచెప్పింది. తాము ఎలాంటి స్టే ఇవ్వని చెరువులున్న ప్రాంతాల్లో వరద ముప్పు, ముంపు నివారణపై ఏం చర్యలు తీసుకుంటున్నారని అడిగింది. స్టే ఉత్తర్వులు ఇస్తే వర్షాకాలం, వరద నివారణ పనులు చేస్తున్నామని చెబుతున్నారని అభ్యంతరం వ్యక్తం చేసింది. హైడ్రా కమిషనర్‌కు హైకోర్టు అంటే ఏంటో తెలిసినా ఇలా వ్యవహరించడం సరికాదని వ్యాఖ్యానిస్తూ కోర్టు ధిక్కరణ పిటిషన్లపై విచారణను సోమవారానికి వాయిదా వేసింది.
ఈ వార్తలు కూడా చదవండి..
సోనియా గాంధీ లక్ష్యంగా సంచలన ఆరోపణలు..
రిమాండ్ పొడిగింపు.. కోర్టు వద్ద చెవిరెడ్డి హల్‌చల్
Read latest Telangana News And Telugu News