Share News

వివాదాల పరిష్కారంలో కమ్యూనిటీ మీడియేటర్ల పాత్ర కీలకం

ABN , Publish Date - Mar 09 , 2025 | 03:52 AM

సమాజంలో వ్యవస్థీకృతంగా ఉన్న పలు వివాదాలను పరిష్కరించడంలో కమ్యూనిటీ మీడియేటర్ల (మధ్యవర్తులు) పాత్ర కీలకమైనదని రాష్ట్ర హైకోర్టు తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ సుజోయ్‌ పాల్‌ అన్నారు.

వివాదాల పరిష్కారంలో కమ్యూనిటీ మీడియేటర్ల పాత్ర కీలకం

  • మధ్యప్రదేశ్‌, కేరళలో అద్భుత ఫలితాలు

  • నిజామాబాద్‌, కామారెడ్డిలో పైలెట్‌ ప్రాజెక్టుగా ప్రారంభం

  • హైకోర్టుతాత్కాలిక ప్రధానన్యాయమూర్తి జస్టిస్‌ సుజోయ్‌పాల్‌

వరంగల్‌ లీగల్‌, మార్చి 8 (ఆంధ్రజ్యోతి): సమాజంలో వ్యవస్థీకృతంగా ఉన్న పలు వివాదాలను పరిష్కరించడంలో కమ్యూనిటీ మీడియేటర్ల (మధ్యవర్తులు) పాత్ర కీలకమైనదని రాష్ట్ర హైకోర్టు తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ సుజోయ్‌ పాల్‌ అన్నారు. శనివారం హనుమకొండ బాలసముద్రంలోని కాళోజీ కళాక్షేత్రంలో ఏర్పాటు చేసిన కమ్యూనిటీ మీడియేటర్స్‌ వలంటీర్ల అవగాహన సదస్సులో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని ప్రసంగించారు. ముఖ్యంగా కుటుంబ తగాదాలు, వివాహ సంబంధిత వివాదాలకు సమాజ మూలాల్లో సమాధానం దొరుకుతుందన్నారు.


ఆయా సామాజిక వర్గాల ప్రతినిధులకు సమస్యలపై అవగాహన ఉండడం వల్ల పరిష్కారం సులభతరమవుతుందని పేర్కొన్నారు. మధ్యప్రదేశ్‌, కేరళలో కమ్యూనిటీ మీడియేటర్ల విధానాన్ని ప్రవేశపెట్టి అద్భుతమైన ఫలితాలు సాధిస్తున్నారని, ఆ రాష్ట్రాల ప్రేరణతో నిజామాబాద్‌, కామారెడ్డి జిల్లాల్లో పైలెట్‌ ప్రాజెక్టుగా ప్రారంభించామన్నారు. ఆరంభంలోనే ఆయా సామాజిక వర్గాల నుంచి అనూహ్య స్పందన లభించిందని పేర్కొన్నారు. కమ్యూనిటీ మీడియేటర్ల వల్ల సమయం, డబ్బు వృథాకాకుండా పోలీసుస్టేషన్లు, కోర్టుల చుట్టూ తిరగకుండా సులువుగా ఫలితాలను పొందవచ్చన్నారు. అలాగే ఎన్నో ఏళ్లుగా నలుగుతున్న సమస్యలకు పరిష్కారం దొరుకుతుందని ఆయన పేర్కొన్నారు.


ఈ వార్తలు కూడా చదవండి:

Hyderabad: మహిళలకు గుడ్ న్యూస్ చెప్పిన సీఎం రేవంత్ రెడ్డి.. వచ్చే ఎన్నికల్లో..

Car Accident: అంతా చూస్తుండగానే అదుపుతప్పిన కారు.. క్షణాల్లోనే..

Updated Date - Mar 09 , 2025 | 03:52 AM