Hyderabad: సాహిత్యంతో సమాజ పురోభివృద్ధి
ABN , Publish Date - Jan 25 , 2025 | 03:45 AM
‘‘సాహిత్యం, కళలు సమాజ పురోభివృద్ధికి ప్రధానంగా తోడ్పడతాయి. అవి మనకు తెలియని ప్రపంచంతో పాటు మనల్ని మనకు కొత్తగా పరిచయం చేస్తాయి.

పుస్తకాలు బహుమతులుగా ఇచ్చే సంస్కృతి పెరగాలి.. వచ్చే ఏడాది రాజ్‌భవన్‌లో సాహితీ మహోత్సవం
తెలంగాణ గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ
హైదరాబాద్ సాహితీ మహోత్సవం షురూ
పాల్గొన్న ప్రఖ్యాత నటి షబానా ఆజ్మీ
హైదరాబాద్ సిటీ, జనవరి24 (ఆంధ్రజ్యోతి): ‘‘సాహిత్యం, కళలు సమాజ పురోభివృద్ధికి ప్రధానంగా తోడ్పడతాయి. అవి మనకు తెలియని ప్రపంచంతో పాటు మనల్ని మనకు కొత్తగా పరిచయం చేస్తాయి. అందుకే ప్రతి ఒక్కరికి సాహిత్యానుభూతి ఉండడం ముఖ్యం. సాహిత్యానుభవం లేని జీవితం అసంపూర్ణం’’ అని తెలంగాణ గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ వ్యాఖ్యానించారు. తనది సాహిత్యం, కళలను ఆరాధించే కుటుంబ నేపథ్యమని, ఆ వాతావరణంలోనే తాను పుట్టి, పెరిగినట్లు తెలిపారు. తన తాతయ్య, తల్లి కూడా చిత్రకారులని, తండ్రి రామేంద్ర కిషోర్‌దేవ్ వర్మ సైతం మంచి సాహిత్యాభిమాని అని పేర్కొన్నారు. హైటెక్ సిటీ, సత్వా నాలెడ్జ్ సిటీ వేదికగా 15వ హైదరాబాద్ సాహితీ మహోత్సవంను శుక్రవారం జిష్ణుదేవ్ వర్మ ప్రారంభించారు. అనంతరం ఆవరణలో నెలవైన ప్రత్యేక చిత్రప్రదర్శనను ఆయన వీక్షించారు.
అక్కడ కాన్వాస్‌పై కొలువుదీరిన ప్రకృతి రమణీయ చిత్రాలను కొనియాడారు. అనంతరం గవర్నర్ మాట్లాడుతూ.. వచ్చే ఏడాది హైదరాబాద్ సాహితీ మహోత్సవాన్ని రాజ్‌భవన్‌లో నిర్వహించేలా ప్రణాళిక తయారు చేయాలని ఫెస్టివల్ డైరెక్టర్లతో అన్నారు. అందుకు అవసరమైన అనుమతులు ఇప్పిస్తానని మాట ఇచ్చారు. పుస్తకాలను బహుమతులుగా ఇచ్చి పుచ్చుకొనే సంస్కృతి పెరగాలని ఆకాంక్షించారు. షబానా ఆజ్మీ సినిమాలంటే తనకు చాలా ఇష్టమని, మరీ ముఖ్యంగా ఆమె నటనకు పెద్ద అభిమానిని అని వెల్లడించారు. జిష్ణుదేవ్ వర్మ రాసిన పుస్తకాన్ని సాహితీ ఉత్సవంలో ప్రత్యేకంగా ప్రదర్శనకు ఉంచారు. హైదరాబాద్ సాహితీ మహోత్సవం చైర్మన్ జయేశ్ రంజన్ స్వాగతోపన్యాసం చేశారు. ముఖ్య అతిథులుగా పాల్గొన్న లిథువేనియా రాయబారి డయానా మికేవిసెన్, ప్రముఖ నటి షబానా ఆజ్మీలను నిర్వాహకులు ప్రొ. విజయకుమార్, అమితా దేశాయ్, కిన్నెర మూర్తి శాలువాతో సత్కరించారు.
భారతీయ భాషలంటే చాలా ఇష్టం
హైదరాబాద్ సాహిత్య మహోత్సవానికి ప్రత్యేక ఆహ్వానితురాలిగా లిథువేనియా రాయబారి డయానా మికేవిసెన్ హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. భారతీయ భాషలంటే తనకు చాలా ఇష్టమని, అందులోనూ హిందీ , సంస్కృతభాషలపై మరింత మమకారమని తెలిపారు. డయానాను ‘ఆంధ్రజ్యోతి’ ప్రత్యేకంగా పలకరించగా.. ‘సాగర సంగమం’ సినిమాకు తాను విరాభిమానిని అని చెప్పారు. ఆ చిత్రాన్ని రష్యన్ భాషలో లెక్కలేనన్నిసార్లు చూసినట్లు వెల్లడించారు. అంతేకాదు, వేటూరి సుందరరామమూర్తి రాసిన ‘మౌనమేలనోయి ఈ మరపురాని రేయి..’ పాట తెలుగులో ఆలపించి, ఆ సినిమాపై తనకున్న అభిమానాన్ని చాటారు.
ఈ వార్తలు కూడా చదవండి:
Virender Sehwag: విడాకులు తీసుకోనున్న వీరేంద్ర సెహ్వాగ్..
Kaleshwaram Commission: నేటి కాళేశ్వరం విచారణ.. అత్యంత కీలకం