ఇందిరమ్మ ఇంటికి శాటిలైట్ లింక్.!
ABN , Publish Date - Feb 12 , 2025 | 04:30 AM
ఇందిరమ్మ ఇంటి పథకంలో రాష్ట్ర ప్రభుత్వం సాంకేతికతను వినియోగించుకోనుంది. ఇంటి నిర్మాణం కోసం ముగ్గులు పోసే దగ్గరి నుంచి ఇల్లు పూర్తయ్యే వరకు దశలవారీగా టెక్నాలజీ ఆధారంగానే పర్యవేక్షించనుంది.

నిర్మాణం పూర్తయ్యే వరకు పర్యవేక్షణ
దశల వారీ నిర్మాణం తెలుసుకునే అవకాశం
అక్రమాలకు, అవకతవకలకు కృత్రిమ మేథతో చెక్
హైదరాబాద్, ఫిబ్రవరి 11 (ఆంధ్రజ్యోతి): ఇందిరమ్మ ఇంటి పథకంలో రాష్ట్ర ప్రభుత్వం సాంకేతికతను వినియోగించుకోనుంది. ఇంటి నిర్మాణం కోసం ముగ్గులు పోసే దగ్గరి నుంచి ఇల్లు పూర్తయ్యే వరకు దశలవారీగా టెక్నాలజీ ఆధారంగానే పర్యవేక్షించనుంది. దీని ప్రకారమే నాలుగు దశల్లో ఆర్ధిక సాయాన్ని అందించనుంది. గతంలో మాదిరిగా ఇండ్ల నిర్మాణాల్లో అవకతవకలు, అక్రమాలకు అవకాశం లేకుండా ఉండేందుకు గృహ నిర్మాణ సంస్థ సాంకేతికతను అందిపుచ్చుకుంటోంది. ఇందుకోసం కృత్రిమ మేథ(ఏఐ), శాటిలైట్ సేవలను వినియోగించనుంది. ఇప్పటికే ఇందిరమ్మ ఇంటి కోసం ప్రభుత్వానికి వచ్చిన దరఖాస్తుల పరిశీలనలోనూ కృత్రిమ మేథను వినియోగిస్తున్న అధికారులు, ఇకపై ఇళ్ల నిర్మాణాల్లోనూ దీనిని ఉపయోగించనున్నారు. దీని ద్వారా కచ్చితమైన ఫలితాలు వస్తుండడంతోనే అధికారులు ఈ నూతన సాంకేతికతపై దృష్టి సారించినట్టు తెలిసింది. ఇంటి మంజూరు నుంచి నిర్మాణం పూర్తై లబ్ధిదారులకు ఆర్ధికసాయం పూర్తిగా అందేవరకు ఎక్కడా అక్రమాలకు, అవినీతికి అవకాశం లేకుండా ఇది ఉపయుక్తంగా ఉంటుందని అధికారులు భావిస్తున్నారు.
శాటిలైట్, ఏఐ వినియోగం ఇలా
ఇల్లు మంజూరైన లబ్ధిదారులు నిర్మించబోయే ఇంటికి ముగ్గులు పోసిన తరువాత ఆ స్థలానికి అక్షాంక్ష, రేఖాంక్ష సంఖ్యలను ఖరారు చేస్తారు. అనంతరం వాటిని శాటిలైట్‌కు అనుసంధానం చేస్తారు. అలా అనుసంధానం అయిన నిర్మాణాల పర్యవేక్షణ మొత్తం ఆన్‌లైన్ విఽధానంలో ఎప్పటికప్పుడు పరిశీలించేందుకు అవకాశం ఉంది. ఇది ఆన్‌లైన్‌లో అందుబాటులో ఉండడంతో ఉన్నతాధికారులు కూడా ఎప్పటికప్పుడు పరిశీలించేందుకు అవకాశం ఉంటుంది. ఇంటి నిర్మాణానికి అందించే నాలుగు దఫాల ఆర్ధిక సాయాన్ని ఏయే దశల్లో ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించిందో ఆ దశలను ఆన్‌లైన్ పొందుపర్చుతారు. నిజమైన అర్హులు, వారు నిర్మించుకునే ఇంటికి సంబంధించిన ఫొటోలను ఆన్‌లైన్‌లో అప్‌లోడ్ చేసిన తరువాతే బిల్లులు అందనున్నాయి.