Local Elections: స్థానిక ఎన్నికలు మరింత ఆలస్యం?
ABN , Publish Date - Sep 06 , 2025 | 04:18 AM
స్థానిక సంస్థల్లో బీసీలకు చట్టబద్ధంగా 42 శాతం రిజర్వేషన్ కల్పించాకే ఎన్నికలకు వెళ్లాలని రాష్ట్ర ప్రభుత్వం పట్టుదలతో ఉన్న నేపథ్యంలో.. పంచాయతీ, పరిషత్ ఎన్నికలు మరి కొంత ఆలస్యమయ్యే సూచనలు కనిపిస్తున్నాయి.
గవర్నర్ వద్ద పెండింగ్‌లో 2 బీసీ బిల్లులు
రాష్ట్రపతి దగ్గర కూడా మరో రెండు..
కేంద్రం వద్ద అపరిష్కృతంగా 2 ఆర్డినెన్స్‌లు
బీసీలకు చట్టబద్ధంగా 42% ఇచ్చాకే ఎన్నికలకు వెళ్లాలన్న యోచనలో సర్కారు
30కల్లా ఎన్నికలు నిర్వహించాలన్న హైకోర్టు
గవర్నర్ సానుకూల నిర్ణయంతోనేసాధ్యం
లేని పక్షంలో కోర్టును మరింత గడువు కోరనున్న రాష్ట్ర ప్రభుత్వం
హైదరాబాద్, సెప్టెంబరు 5 (ఆంధ్రజ్యోతి): స్థానిక సంస్థల్లో బీసీలకు చట్టబద్ధంగా 42 శాతం రిజర్వేషన్ కల్పించాకే ఎన్నికలకు వెళ్లాలని రాష్ట్ర ప్రభుత్వం పట్టుదలతో ఉన్న నేపథ్యంలో.. పంచాయతీ, పరిషత్ ఎన్నికలు మరి కొంత ఆలస్యమయ్యే సూచనలు కనిపిస్తున్నాయి. దీనికి సంబంధించి రాష్ట్రపతి, గవర్నర్‌ల వద్ద పెండింగ్‌లో ఉన్న బిల్లులపై ఈ నెల 30లోపు ఏమీ తేల్చకుంటే.. హైకోర్టుకు ఇదే కారణం చూపి ఎన్నికల నిర్వహణకు మరి కొంత గడువు కోరే యోచనలో ప్రభుత్వం ఉన్నట్లు తెలుస్తోంది. విద్య, ఉద్యోగాలు, స్థానిక ఎన్నికల్లో బీసీలకు 42ు రిజర్వేషన్ కల్పిస్తూ రాష్ట్ర శాసనసభ ఆమోదించిన రెండు బిల్లులూ.. గత 5 నెలలుగా రాష్ట్రపతి వద్ద పెండింగ్‌లో ఉన్నాయి. ఆ బిల్లులపై రాష్ట్రపతి ఏమీ తేల్చక పోవడంతో.. స్థానిక ఎన్నికల్లో బీసీలకు 42% రిజర్వేషన్ కల్పించేందుకు వీలుగా రిజర్వేషన్‌లపై 50 శాతం పరిమితిని ఎత్తివేస్తూ పంచాయతీరాజ్, మున్సిపల్ చట్టాల సవరణ ఆర్డినెన్సులను ప్రభుత్వం తీసుకువచ్చింది. ఈ రెండు ఆర్డినెన్సులూ జూలై 15న ఆమోదం కోసం గవర్నర్ కార్యాలయానికి చేరాయి. అయితే వాటిని పరిశీలన కోసం గవర్నర్ కేంద్ర హోం శాఖకు పంపారు. అటు రాష్ట్రపతి వద్ద పెండింగ్‌లో ఉన్న బిల్లులు, గవర్నర్ వద్ద పెండింగ్‌లో ఉన్న ఆర్డినెన్సులపై నిర్ణయం వెలువడక పోవడం, ఎన్నికల నిర్వహణకు హైకోర్టు పెట్టిన సెప్టెంబరు 30 గడువూ ముంచుకువస్తుండడంతో.. పంచాయతీరాజ్, మున్సిపల్ చట్టాల సవరణ బిల్లులను ఆది, సోమవారాలు జరిగిన అసెంబ్లీ వర్షాకాల సమావేశాల్లో ఆమోదించారు.
మూడ్ ఆఫ్ ది హౌస్‌ను పరిగణనలోకి తీసుకుని రెండు బిల్లులనూ ఆమోదించాలంటూ వాటిని ప్రభుత్వం గవర్నర్‌కు పంపింది. ఆ రెండు బిల్లులనూ గవర్నర్ న్యాయ సలహా కోసం పంపినట్లు చెబుతున్నారు. హైకోర్టు పెట్టిన గడువులోగా స్థానిక ఎన్నికలను నిర్వహించాలంటే ఇప్పటికే గవర్నర్ ఈ రెండు బిల్లులపైనా నిర్ణయం తీసుకుని ఉండాలి. కనీసం ఎన్నికల ప్రక్రియ ప్రారంభమైందని హైకోర్టుకు విన్నవించాలన్నా.. గవర్నర్ తన సానుకూల నిర్ణయాన్ని ఈ నెల 20లోపు వెల్లడించాల్సి ఉంటుంది. ఎందుకంటే.. సవరణ చట్టాల ఆధారంగా ఉత్తర్వుల జారీ, రిజర్వేషన్ల ఖరారు, సిబ్బందికి శిక్షణ, ఎన్నికల షెడ్యూల్ విడుదలకు కనీసం పదిరోజుల సమయం పడుతుందని ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి. అయితే పంచాయతీరాజ్, మున్సిపల్ చట్టాల సవరణ ఆర్డినెన్సులో సవరించిన అంశాలతోనే రాష్ట్ర అసెంబ్లీ.. రెండు సవరణ బిల్లులనూ ఆమోదించింది. రెండు ఆర్డినెన్సులనే పరిశీలనకు కేంద్రానికి పంపిన గవర్నర్.. ఇప్పుడు అవే సవరణలతో తెచ్చిన రెండు బిల్లులను కూడా కేంద్ర ప్రభుత్వ పరిశీలనకే పంపే అవకాశం ఎక్కువగా ఉందని న్యాయ పరిశీలకులు చెబుతున్నారు. ఈ నేపథ్యంలో రేవంత్ సర్కారు.. దీనిపై న్యాయపోరాటం చేయాలన్న ఆలోచనా చేస్తోంది. రాష్ట్రపతి/గవర్నర్‌ల వద్దకు రాష్ట్రాలు పంపిన బిల్లులను మూడు నెలల్లోగా ఆమోదించాలంటూ సుప్రీం కోర్టు రూలింగ్ ఇచ్చిన సంగతి తెలిసిందే. దీనికి సంబంధించి రాష్ట్రాల అభిప్రాయాలను సుప్రీం కోర్టు ప్రస్తుతం నమోదు చేస్తోంది. రాష్ట్ర ప్రభుత్వ వాదనను ప్రముఖ న్యాయవాది, కాంగ్రెస్ ఎంపీ అభిషేక్ సింఘ్వి, నిరంజన్‌రెడ్డి కోర్టు ముందుంచనున్నారు. ఆ సందర్భంగా.. గత 5 నెలలుగా రాష్ట్రపతి వద్ద పెండింగ్‌లో ఉన్న రెండు బీసీ బిల్లుల గురించి ప్రస్తావించనున్నారు. అలాగే గవర్నర్ ఆమోదం కోసం పంపిన రెండు ఆర్డినెన్సులూ 40 రోజులుగా పెండింగ్‌లో ఉన్నాయి. తాజాగా పంపిన రెండు సవరణ బిల్లులపైనా గవర్నర్ నిర్ణయం తీసుకోకుండా పెండింగ్‌లో పెడితే.. ఎన్నికల నిర్వహణకు మరి కొంత గడువు ఇవ్వాలంటూ హైకోర్టును ప్రభుత్వం కోరే అవకాశం ఉన్నట్లు చెబుతున్నారు
ఈ వార్తలు కూడా చదవండి..
ఫలించిన ప్రభుత్వ ప్రయత్నం.. తెలంగాణకు యూరియా రాక..
మద్యం కుంభకోణం కేసులో కీలక పురోగతి
Read Latest TG News and National News