Share News

అమరుల స్థూపం అంబేడ్కర్‌ విగ్రహంలో అవినీతి జరిగిందా?

ABN , Publish Date - Feb 01 , 2025 | 04:07 AM

గత ప్రభుత్వ హయాంలో చేపట్టిన అమరుల స్థూపం, అంబేడ్కర్‌ విగ్రహా నిర్మాణాల్లో అవినీతి, అవకతవకలు జరిగాయని రాష్ట్ర ప్రభుత్వం అనుమానిస్తోంది. అంచనాలను భారీగా పెంచడమే కాకుండా నిర్మాణ నాణ్యతలోనూ రాజీ పడ్డారని గమనించింది.

అమరుల స్థూపం అంబేడ్కర్‌ విగ్రహంలో  అవినీతి జరిగిందా?

  • వంద శాతానికి మించి అంచనాలు పెంపు

  • నిర్మాణాలపై విజిలెన్స్‌ విచారణకు ఆదేశం

హైదరాబాద్‌, జనవరి 31 (ఆంధ్రజ్యోతి): గత ప్రభుత్వ హయాంలో చేపట్టిన అమరుల స్థూపం, అంబేడ్కర్‌ విగ్రహా నిర్మాణాల్లో అవినీతి, అవకతవకలు జరిగాయని రాష్ట్ర ప్రభుత్వం అనుమానిస్తోంది. అంచనాలను భారీగా పెంచడమే కాకుండా నిర్మాణ నాణ్యతలోనూ రాజీ పడ్డారని గమనించింది. ఈ రెండింటిపైనా విజిలెన్స్‌ విచారణ జరిపించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు సంబంధిత అధికారులకు ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి పలు ఆదేశాలు ఇచ్చినట్టు సమాచారం. బీఆర్‌ఎస్‌ ప్రభుత్వ హయాంలో సచివాలయంతో పాటు, నెక్లెస్‌ రోడ్‌లో 125 అడుగుల ఎత్తులో అంబేడ్కర్‌ విగ్రహం, సచివాలయం ఎదురుగా అమరుల స్థూపాన్ని నిర్మించింది. సచివాలయ నిర్మాణం విషయంలోనూ అంచనాలకు మించి భారీగా ఖర్చు పెట్టారని తేలడంతో ఇప్పటికే దానిపై కాంగ్రెస్‌ ప్రభుత్వం విజిలెన్స్‌ విచారణకు ఆదేశించింది. తాజాగా అంబేడ్కర్‌ విగ్రహం, అమరుల స్థూపం నిర్మాణాల విషయాల్లోనూ వాస్తవ లెక్కలు తేల్చాలని విజిలెన్స్‌ను ఆదేశించారు. అంబేద్కర్‌ విగ్రహం, అమరుల చిహ్నం రెండింటి నిర్మాణాన్నీ ఒకే సంస్థ చేపట్టింది. 2016 ఏప్రిల్‌ 14న అంబేడ్కర్‌ జయంతి నాడు అప్పటి సీఎం కేసీఆర్‌ ఎన్టీఆర్‌ గార్డెన్‌ పక్కన స్థలంలో అంబేద్కర్‌ విగ్రహం ఏర్పాటుకు శంకుస్థాపన చేశారు.


ఆరేండ్ల తరువాత 2023 ఏప్రిల్‌ 14న విగహ్రాన్ని ఆవిష్కరించారు. మొదట నిర్మాణానికి రూ.104 కోట్లు అవసరం అవుతాయని అంచనా వేశారు. తర్వాత దరలు పెరిగాయని మరో రూ.60 కోట్లు చేర్చారు. నిర్మాణం పూర్తయ్యే నాటికి రూ.164 కోట్లుగా ఖరారు చేశారు. ఆ తర్వాత మరికొంత మొత్తాన్ని అదనంగా కర్చు చేశారని కాంగ్రెస్‌ ప్రభుత్వం గుర్తించింది. విగ్రహాన్ని 11.80 ఎకరాల విస్తీర్ణంలో ఏర్పాటు చేశారు. విగ్రహమే 2 ఎకరాల్లో ఉంది. విగ్రహాం, పీఠం కలిపి 125 అడుగుల ఎత్తులో ఉన్నాయి. నిర్మాణానికి 360 టన్నుల స్టీలును, 114 టన్నుల ఇత్తడిని ఉపయోగించారు. 2017లో లుంబిణి పార్కు సమీపంలో అమరుల స్థూపం నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. మొదట రూ.80 కోట్లరుతే సరిపోతుందని చెప్పారు. పూర్తయ్యే దశకు రూ.160 కోట్లన్నారు. ప్రారంభోత్సవం నాటికి ఖర్చు 180 కోట్లుగా తేల్చారు. అంటే, అంచనాలు రెండుసార్లు మారాయి. ప్రస్తుత కాంగ్రెస్‌ ప్రభుత్వం ఈ స్థూపానికి సంబంధించి దేనికెంత ఖర్చు చేశారో సమగ్ర నివేదిక ఇవ్వాలని విజిలెన్స్‌ విభాగాన్ని ఆదేశించింది. స్థూపం నిర్మాణానికి 1,700 టన్నుల స్టీల్‌ను వినియోగించారు. అమర జ్యోతి కోసం వినియోగించిన రెండు రకాల స్టీల్‌ను జర్మనీ నుంచి తెప్పించారు. దుబాయ్‌ కంపెనీ దీన్ని అమర్చింది.

Updated Date - Feb 01 , 2025 | 04:07 AM