తాత్కాలిక ఎస్జీటీలుగా డీఎస్సీ-2008 అభ్యర్థులు
ABN , Publish Date - Feb 15 , 2025 | 03:49 AM
డీఎస్సీ-2008 అభ్యర్థులకు ఊరటనిచ్చేలా రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. డీఎస్సీలో ఎంపిక విధానాన్ని మార్చడంతో తమకు అన్యాయం జరిగిందని, ఎస్జీటీలుగా రావాల్సిన ఉద్యోగాలు రాలేదంటూ డీఎస్సీ-2008 అభ్యర్థులు గతంలో సుప్రీంకోర్టును ఆశ్రయించారు.

1,382 మంది భర్తీకి జిల్లా కలెక్టర్లకు ఆదేశాలు
డీఎస్సీ-2008 అభ్యర్థులకు ఊరటనిచ్చేలా రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. డీఎస్సీలో ఎంపిక విధానాన్ని మార్చడంతో తమకు అన్యాయం జరిగిందని, ఎస్జీటీలుగా రావాల్సిన ఉద్యోగాలు రాలేదంటూ డీఎస్సీ-2008 అభ్యర్థులు గతంలో సుప్రీంకోర్టును ఆశ్రయించారు. సుదీర్ఘ కాలం తర్వాత తీర్పు వచ్చింది. వారిని తాత్కాలిక ఉద్యోగులుగా నియమించాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని సుప్రీంకోర్టు ఆదేశించింది. ఈ నేపథ్యంలో తాత్కాలిక ఉద్యోగులుగా పనిచేసేందుకు ఆసక్తి చూపిన 1,382 మందికి ఉద్యోగాలు ఇవ్వాలని పాఠశాల విద్యాశాఖ సంచాలకుడు ఈవీ నర్సింహారెడ్డి శుక్రవారం ఉత్తర్వులు జారీ చేశారు.
హైదరాబాద్ జిల్లా మినహా ప్రస్తుతం జిల్లాల్లో ఖాళీగా ఉన్న ఎస్జీటీ పోస్టుల్లో వీరిని నియమించనున్నారు. ఇప్పుడున్న ఎస్జీటీలకు అందించే ప్రారంభ కనీస వేతనం రూ.31,040 వీరికి ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించింది. వీరికి ఇతర కాంట్రాక్టు ఉద్యోగుల మాదిరిగానే సెలవులు ఉంటాయి. 2018 రాష్ట్రపతి ఉత్తర్వు స్థానిక రిజర్వేషన్ ఆధారంగా జిల్లా స్థాయి భర్తీ జాబితా ప్రకారం వీరిని శనివారం నియమించుకోవాలని జిల్లా కలెక్టర్లను ఆదేశించారు. అయితే వీరిని ప్రతి విద్యా సంవత్సరంలో మొదటి రోజు నియమించి చివరిరోజు తొలగిస్తారు. ఏటా ఇదే విధానంలో కొనసాగిస్తారు.