Share News

మహిళా పవర్‌!

ABN , Publish Date - Jan 14 , 2025 | 04:26 AM

మహిళలు ఆర్థికంగా, సామాజికంగా ముందడుగు వేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక చర్యలు చేపట్టింది. వారిని సోలార్‌ పవర్‌ రంగంలోకి ప్రవేశింప చేసి.. మహిళాశక్తిని చాటి చెప్పేందుకు ప్రత్యేక దృష్టి సారించింది.

మహిళా పవర్‌!

  • మహిళా సంఘాలకు సోలార్‌ ప్లాంట్లు

  • ప్రతి గ్రామ సమాఖ్యకు ఓ మెగావాట్‌ యూనిట్‌

  • నాలుగు ఎకరాల భూమిలో రూ.3 కోట్లతో ఏర్పాటు

  • మహిళల ఆర్థిక బలోపేతానికి రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయం

హైదరాబాద్‌, జనవరి 13 (ఆంధ్రజ్యోతి) : మహిళలు ఆర్థికంగా, సామాజికంగా ముందడుగు వేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక చర్యలు చేపట్టింది. వారిని సోలార్‌ పవర్‌ రంగంలోకి ప్రవేశింప చేసి.. మహిళాశక్తిని చాటి చెప్పేందుకు ప్రత్యేక దృష్టి సారించింది. బ్యాంకుల ద్వారా తీసుకున్న రుణాలను పెండింగ్‌ లేకుండా చెల్లించడం, ప్రభుత్వపరంగా అందించే ప్రోత్సాహంతో, పరిశ్రమలు, వ్యాపార రంగాల్లో స్థిరంగా ఎదుగుతున్న కారణంగా ఎస్‌హెచ్‌జీ గ్రూపులకు రుణాలిచ్చేందుకు బ్యాంకులు ఆసక్తి కనబరుస్తున్నాయి. దీన్ని దృష్టిలో ఉంచుకొని గ్రామీణ పేదరిక నిర్మూలనా సంస్థ(ఎస్‌ఈఆర్‌పీ) ద్వారా రాష్ట్రంలోని మహిళా స్వయం సహాయక సంఘాలు ఆర్థిక స్వావలంబన సాధించేందుకు వారికి సౌర విద్యుత్‌ ఉత్పత్తి ప్లాంట్లను కేటాయించాలని ప్రభుత్వం నిర్ణయించింది. గ్రామంలోని 40 స్వయం సహాయక సంఘాల సమన్వయంతో పనిచేసే గ్రామ సమాఖ్యకు ఒక మెగావాట్‌ సామర్థ్యం ఉన్న సోలార్‌ విద్యుత్‌ ఉత్పత్తిప్లాంటును అప్పగించనున్నారు.


ఇలా రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం 4 వేల ప్లాంట్లను కేటాయించనున్నారు. ఒక మెగావాట్‌ యూనిట్‌ ప్లాంటును రూ.3 కోట్ల వ్యయంతో నాలుగు ఎకరాల భూమిలో ఏర్పాటు చేసే విధంగా ప్రణాళికలు రూపొందించారు. ఈ మొత్తం యూనిట్‌ వ్యయంలో గ్రామ సమాఖ్యలు 10 శాతం వెచ్చించాల్సి ఉంటుంది. మిగిలిన 90 శాతం బ్యాంకుల ద్వారా రుణం అందిస్తారు. ఒక్కో యూనిట్‌ను రూ.3 కోట్ల వ్యయంతో ఏర్పాటు చేయాల్సి ఉండటం.. అందులో 10 శాతం అంటే.. రూ.30 లక్షల వరకు ఎస్‌హెచ్‌జీలు భరించాల్సి ఉండటంతో.. గ్రామంలోని ఒకటి రెండు సంఘాలు అంతమొత్తం భరించలేని పరిస్థితి. అంతేకాకుండా మిగిలిన రూ.2.70 కోట్లు బ్యాంకుల ద్వారా రుణం పొందాల్సి ఉంటుంది. దీన్ని దృష్టిలో ఉంచుకొని గ్రామ సమాఖ్యల ద్వారా యూనిట్‌లు ఏర్పాటు చేయాలని నిర్ణయించినట్లు సెర్ప్‌ విభాగాలు వెల్లడించాయి.


ఎస్‌హెచ్‌జీల ద్వారా నిర్వహించే సోలార్‌ విద్యుత్‌ ప్లాంట్ల ఏర్పాటుకు అటవీ, దేవాదాయ, పోరంబోకు భూములను ఎంపిక చేయాలని ప్రభుత్వం సంబంధిత శాఖలను ఇప్పటికే ఆదేశించింది. ఇందుకు మెదక్‌, యాదాద్రి భువనగిరి, నాగర్‌ కర్నూల్‌ జిల్లాలపై రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించింది. ఇప్పటివరకు 180 ఎకరాలు అనువైన భూమిని గుర్తించారు. జూలై నాటికి మొత్తం 4 వేల యూనిట్లకు అవసరమైన భూమిని గుర్తించే విధంగా ఆయా విభాగాలు దృష్టి పెట్టాయి. సాగుకు అనువుగా లేని భూములను రాష్ట్ర ప్రభుత్వమే సమకూర్చి అందులో సోలార్‌ యూనిట్ల ఏర్పాటుకు సదుపాయాలు కల్పించనుంది. ఎకరాకు రూ.20 వేల చొప్పున భూములు కేటాయించే శాఖలతో సెర్ప్‌ ద్వారా గ్రామ సమాఖ్యలు లీజు ఒప్పందం కుదుర్చుకునేలా విధి విధానాలు రూపొందించారు. ఉత్పత్తి అయ్యే విద్యుత్‌ను సంబంధిత విభాగాల ద్వారా కొనుగోలు చేసే విధంగా సెర్ప్‌ సంస్థ మధ్యవర్తిత్వంతో ఒప్పందం కుదుర్చుకుంటారు. ఒక యూనిట్‌కు రూ.3.32 పైసలకు కొనుగోలు చేసేలా ఈ ఒప్పందం ఉంటుందని తెలుస్తోంది.

Updated Date - Jan 14 , 2025 | 04:26 AM