Tuition Fee: ప్రైవేటు పాఠశాలల్లో ట్యూషన్ ఫీజే ఉండాలి!
ABN , Publish Date - Jan 25 , 2025 | 03:58 AM
రాష్ట్రంలోని ప్రైవేటు పాఠశాలల్లో ట్యూషన్ ఫీజు మాత్రమే ఉండాలని, మరే ఇతర ఫీజులను వసూలు చేయకుండా నియంత్రించాలని తెలంగాణ విద్యా కమిషన్ రాష్ట్ర సర్కారుకు సిఫార్సు చేసింది.

మిగతా ఏ రుసుములు వసూలు చేయకూడదు
ఫీజుల ఖరారు, నియంత్రణకు ప్రత్యేక కమిటీ
పర్యవేక్షణకు జిల్లా స్థాయుల్లో కమిటీలు వేయాలి
ప్రతీ మూడేళ్లకోసారి ఫీజులను నిర్ధారించాలి
రాష్ట్ర ప్రభుత్వానికి విద్యా కమిషన్ సిఫార్సులు..
హైదరాబాద్, జనవరి 24 (ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలోని ప్రైవేటు పాఠశాలల్లో ట్యూషన్ ఫీజు మాత్రమే ఉండాలని, మరే ఇతర ఫీజులను వసూలు చేయకుండా నియంత్రించాలని తెలంగాణ విద్యా కమిషన్ రాష్ట్ర సర్కారుకు సిఫార్సు చేసింది. ఫీజుల ఖరారు, నియంత్రణకు రాష్ట్ర స్థాయిలో ప్రత్యేక కమిటీని ఏర్పాటు చేయాలని సూచించింది. ప్రైవేటు పాఠశాలల ఫీజుల నియంత్రణకు సంబంధించి గత కొంతకాలంగా విద్యా కమిషన్ వివిధ వర్గాలతో విస్తృత చర్చలు జరిపి నివేదికను రూపొందించింది. శుక్రవారం విద్యా కమిషన్ చైర్మన్, రిటైర్డ్ ఐఏఎస్ ఆకునూరి మురళి ఆధ్వర్యంలో సభ్యులు విశ్వేశ్వరరావు, చారకొండ వెంకటేశ్, జ్యోత్స్నలు ఈ నివేదికను విద్యాశాఖ కార్యదర్శి యోగితారాణాకు సమర్పించారు. ప్రస్తుతం ప్రైవేటు స్కూళ్ల ఫీజుల విషయంలో సర్కారుకు ఎటువంటి నియంత్రణ లేని నేపథ్యంలో విద్యా కమిషన్ నివేదికకు ప్రాధాన్యత నెలకొంది.
ఫీజుల ఖరారు, వాటి నియంత్రణ కోసం ఈ నివేదికలో స్పష్టత ఇచ్చినట్టు సమాచారం. స్కూళ్లలో పలురకాల ఫీజులను వసూలు చేయకుండా.. ట్యూషన్ ఫీజును మాత్రమే వసూలు చేయాలని విద్యా కమిషన్ పేర్కొంది. ఆయా స్కూళ్ల పరిస్థితులను బట్టి ఫీజులను వివిధ క్యాటగిరీలు (కనిష్ఠం నుంచి గరిష్ఠం)గా విభజించాలని సూచించింది. ఇందుకు అక్కడి సదుపాయాలను పరిగణనలోకి తీసుకోవాలంది. అలాగే పాఠ్య పుస్తకాలు, యూనిఫాం వంటి వాటితో ఆయా స్కూళ్లు వ్యాపారం చేయకూడని విధంగా వ్యవస్థ ఉండాలని స్పష్టం చేసింది. ఫీజుల ఖరారు, నియంత్రణ కోసం రాష్ట్ర స్థాయిలో ప్రత్యేక నియంత్రణ కమిటీని ఏర్పాటు చేయాలని విద్యా కమిషన్ సూచించింది.
ఈ కమిటీకి చైర్మన్‌గా రిటైర్డ్ జడ్జి లేదా రిటైర్డ్ ఐఏఎస్ అధికారిని.. సభ్యులుగా సంబంధిత రంగానికి చెందిన నలుగురు నిపుణులను నియమించాలని తెలిపింది. జిల్లా స్థాయుల్లోనూ ప్రతి జిల్లాకో కమిటీని ఏర్పాటు చేయాలని.. ఫీజులను ఖరారు చేసిన తర్వాత వాటి అమలులో నమోదయ్యే ఫిర్యాదులపై ఈ జిల్లా కమిటీలు చర్యల్ని తీసుకోవాల్సి ఉంటుందని స్పష్టం చేసింది. మూడేళ్లకోసారి ఫీజును ఖరారు చేయాల్సి ఉంటుందని వివరించింది. కాగా, విద్యా కమిషన్ చేసిన సిఫార్సులపై ప్రభుత్వం తుదినిర్ణయం తీసుకోనుంది. ఈ సిఫార్సులను అమలు చేయాలని భావిస్తే.. ముసాయిదా బిల్లుకు అసెంబ్లీ ఆమోదంతో చట్టబద్ధత కల్పించాలి. ఆ తర్వాతే ఫీజుల ఖరారు, నియంత్రణ కమిటీ ఏర్పాటుకు అవకాశముంటుందని అధికారులు చెప్పారు.
ఈ వార్తలు కూడా చదవండి:
Virender Sehwag: విడాకులు తీసుకోనున్న వీరేంద్ర సెహ్వాగ్..
Kaleshwaram Commission: నేటి కాళేశ్వరం విచారణ.. అత్యంత కీలకం