Bhatti Vikramarka: ఉద్యోగాలిస్తుంటే ఓర్వలేకపోతున్నారు
ABN , Publish Date - Aug 23 , 2025 | 04:10 AM
తెలంగాణ ప్రజలతో కాంగ్రెస్ ప్రభుత్వానిది కుటుంబ బంధమని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టివిక్రమార్క అన్నారు. ప్రపంచంతో పోటీ పడేలా తెలంగాణను ముందుకు తీసువెళ్లే పనులు చేస్తున్నామని తెలిపారు.
ప్రజలతో కాంగ్రెస్ ప్రభుత్వానిది కుటుంబ బంధం.. యాదాద్రి పవర్ ప్లాంట్‌ను దేవాలయంలా చూడాలి
భూములు కోల్పోయిన వారందరికీ ఉద్యోగాలిస్తాం
జనవరి 15 లోపు పవర్‌ప్లాంట్ పూర్తి: భట్టి
బీఆర్‌ఎస్ ఉద్యోగాలిస్తుంటే వద్దన్నామా?: మంత్రి కోమటిరెడ్డి
జెన్‌కోలో ఉద్యోగాలకు ఎంపికైన వారికి నియామక పత్రాలు
హైదరాబాద్, ఆగస్టు 22 (ఆంధ్రజ్యోతి): తెలంగాణ ప్రజలతో కాంగ్రెస్ ప్రభుత్వానిది కుటుంబ బంధమని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టివిక్రమార్క అన్నారు. ప్రపంచంతో పోటీ పడేలా తెలంగాణను ముందుకు తీసువెళ్లే పనులు చేస్తున్నామని తెలిపారు. పాలనలో అత్యంత ప్రాధాన్యం విద్యకు ఇస్తున్నామని పేర్కొన్నారు. పదేళ్లపాటు నిరుద్యోగులకు ఉద్యోగాలివ్వకుండా నిర్లక్ష్యం చేసి.. ప్రస్తుతం తాము ఇస్తుంటే ఓర్వలేకపోతున్నారని ఆక్షేపించారు. శుక్రవారం తెలంగాణ జెన్‌కోలో జూనియర్ అసిస్టెంట్, జూనియర్ ప్లాంట్ అటెండెంట్, ఆఫీస్ సబార్డినేట్, హౌస్ కీపర్ ఉద్యోగులుగా నియమితులైనవారికి ప్రజాభవన్‌లో మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డితో కలిసి నియామక పత్రాలు అందించిన సందర్భంగా ఉపముఖ్యమంత్రి మాట్లాడారు. కాంగ్రెస్ వస్తే కరెంట్ ఉండదంటూ ప్రచారం చేశారని, ఉన్నది లేనట్లుగా భ్రమలు కల్పించారని మండిపడ్డారు. కాంగ్రెస్ అంటేనే కరెంట్ అని, రాష్ట్రంలో తొలి జలవిద్యుత్తు కేంద్రాన్ని ఏర్పాటుచేసింది కాంగ్రెస్ పార్టీయేనని తెలిపారు. 1978లో నాగార్జునసాగర్‌లో జలవిద్యుత్ ప్రాజెక్టు కట్టామని, జపాన్‌తో కలిసి సాగర్‌లోనే పంప్డ్ స్టోరేజీ ప్లాంట్‌ను కట్టామని అన్నారు. బీఆర్‌ఎస్ పదేళ్ల పాలనలో కాలం చెల్లిన భద్రాద్రి పవర్ ప్లాంట్ తప్ప.. కట్టిందేమీ లేదని విమర్శించారు. తాము అధికారంలోకి రాగానే కొత్త ఎనర్జీ పాలసీని అందుబాటులోకి తెచ్చామన్నారు. ఏ రాష్ట్రంలోనూ లేని విధంగా తెలంగాణలో 29 లక్షల వ్యవసాయ పంపుసెట్లు ఉన్నాయని, వీరందరికీ ఉచిత విద్యుత్ అందిస్తున్నామని చెప్పారు. గృహజ్యోతి పథకం కింద 51 లక్షల కుటుంబాలకు 200 యూనిట్ల దాకా ఉచిత విద్యుత్ ఇస్తున్నామని పేర్కొన్నారు. డిమాండ్ ఏయేటికాయేడు పెరుగుతున్నా.. నాణ్యమైన విద్యుత్‌ను రెప్పపాటు అంతరాయం లేకుండా సరఫరా చేస్తున్నామని చెప్పారు. ఏటా వ్యవసాయ పంపుసెట్లు, గృహజ్యోతి కింద రూ.17 వేల కోట్లను విద్యుత్ శాఖకు అందిస్తున్నామని వెల్లడించారు.
పవర్‌ప్లాంట్ ఒక దేవాలయం..
యాదాద్రి థర్మల్ ప్లాంట్ ఒక దేవాలయం అని, ఆ దేవాలయంలో ఉద్యోగాలు పొందిన వారు మనసు పెట్టి పనిచేయాలని డిప్యూటీ సీఎం భట్టివిక్రమార్క సూచించారు. కార్పొరేట్ సామాజిక బాధ్యత(సీఎ్‌సఆర్) కింద యంగ్ ఇండియా గురుకుల విద్యాలయం కట్టిస్తామన్నారు. భూములు కోల్పోయిన నిర్వాసితులందరికీ ఉద్యోగాలివ్వాలని నిర్ణయించినట్లు తెలిపారు. యాదాద్రి పవర్ ప్లాంట్‌కు ఇచ్చిన పర్యావరణ అనుమతిని 2022 అక్టోబరులో జాతీయ హరిత ట్రైబ్యునల్ రద్దు చేసిందని, కానీ.. దీనిని గత ప్రభుత్వం రెండేళ్లపాటు పట్టించుకోలేదని ఆరోపించారు. దీంతో నిర్మాణ వ్యయం మరింత భారంగా మారిందన్నారు. తాము అధికారంలోకి వచ్చాక పర్యావరణ అనుమతిని తెచ్చుకున్నామని చెప్పారు. యాదాద్రిలో మొత్తం 5 యూనిట్లు, రానున్న జనవరి 15 లోపు పూర్తయి.. ప్లాంటు పూర్తిస్థాయిలో జాతికి అంకితం అవుతుందన్నారు. సీఎ్‌సఆర్ కింద గ్రామాల్లో సీసీ రోడ్లు పూర్తి చేస్తామని, ప్రతి మండలంలో ఒక అంబులెన్స్‌ను ఏర్పాటు చేస్తామని చెప్పారు. మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి మాట్లాడుతూ... కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చాక 60 వేల మందికి ఉద్యోగాలు ఇచ్చామని తెలిపారు. ‘‘నియామకాల కోసం తాము అంతా రెడీ చేశామని కొందరంటున్నారు. అయితే అధికార ంలో ఉండగా అపాయింట్‌మెంట్ ఆర్డర్లు ఇస్తుంటే మేం ఆపామా? న్యాయస్థానంలో ఎన్నో సమస్యలు ఉంటే.. వాటన్నింటినీ పరిష్కరించి, నియామక పత్రాలు అందించాం’’ అని అన్నారు. ఈ కార్యక్రమంలో ఇంధన శాఖ ముఖ్యకార్యదర్శి నవీన్ మిత్తల్, ఎమ్మెల్యే బత్తుల లక్ష్మారెడ్డి, ఎంపీ చామల కిరణ్‌కుమార్‌రెడ్డి, ఎమ్మెల్సీ శంకర్ నాయక్, జెన్‌కో సీఎండీ ఎస్.హరీష్, నల్గొండ జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి తదితరులు పాల్గొన్నారు.
ఈ వార్తలు కూడా చదవండి
లైసెన్సు తీసుకున్న కేబుల్ తప్ప ఏవీ ఉంచొద్దు... హైకోర్టు కీలక ఆదేశాలు
Read Latest Telangana News and National News