CM Revanth Reddy : దమ్ముంటే అక్కడికి రా.. నువ్వో నేనో చూసుకుందాం..
ABN , Publish Date - Jan 31 , 2025 | 07:01 PM
CM Revanth Reddy : బీఆర్ఎస్ చీఫ్ కేసీఆర్‌పై సీఎం రేవంత్ రెడ్డి నిప్పులు చెరిగారు. తమ ప్రభుత్వంపై కేసీఆర్ చేసిన ఆరోపణలను ఆయన తిప్పికొట్టారు.

షాద్‌నగర్, జనవరి31: ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలు నెరవేర్చిన ప్రభుత్వం తమదని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. దమ్ముంటే అసెంబ్లీకి వచ్చి ఈ అంశంపై చర్చించాలని బీఆర్ఎస్ అధినేత, మాజీ సీఎం కేసీఆర్‌కి సీఎం రేవంత్ రెడ్డి సవాల్ విసిరారు. మాజీ సీఎం కేసీఆర్ చేసిన వ్యాఖ్యలపై శుక్రవారం షాద్‌నగర్‌లో సీఎం రేవంత్ రెడ్డి స్పందించారు. ఈ సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతూ.. ఫాంహౌస్‌లో ఉండి వచ్చిన వారికి.. సోది చెప్పడం కాదంటూ కేసీఆర్‌కు చురకలంటించారు. ధనిక రాష్ట్రమంటూ తెలంగాణను అప్పుల కుప్పగా మార్చావంటూ కేసీఆర్‌పై ఆయన నిప్పులు చెరిగారు. దమ్ముంటే అసెంబ్లీలో చర్చకు రా.. అంటూ కేసీఆర్‌కు సీఎం రేవంత్‌రెడ్డి బహిరంగ సవాల్ విసిరారు.
రుణమాఫీ చేయలేదంటున్న బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ తమ ప్రభుత్వంపై ఆరోపణలు గుప్పిస్తున్నారని.. ఆయన అసెంబ్లీకి వస్తే అందుకు సంబంధించిన లెక్కలు సైతం చెబుతానని సీఎం రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. కేసీఆర్ అప్పులు అప్పగించినా.. అధైర్య పడకుండా తాము పథకాలు అమలు చేస్తున్నామన్నారు. కేసీఆర్ పెట్టిన ఇబ్బందులకు గత సార్వత్రిక ఎన్నికల్లో ప్రజలు గుడ్డు సున్నా ఓట్లు ఇచ్చారంటూ ఎద్దేవా చేశారు.
హామీలు ఇచ్చి..
పాలమూరును సైతం కేసీఆర్ ఎండబెట్టారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రజలు బాధపడుతున్నారని కేసీఆర్ అంటున్నారని.. కానీ ఎవరూ బాధపడడం లేదని సీఎం రేవంత్‌రెడ్డి పేర్కొన్నారు. కేసీఆర్ మాదిరి హామీలను తాము ఎగ్గొట్టమన్నారు. గత ప్రభుత్వ హయాంలో పదేళ్లలో ఇవ్వలేని ఉద్యోగాలను ఏడాదిలో ఇచ్చామని గుర్తు చేశారు.
రుణ మాఫీ వడ్డిలకే సరిపోయింది..
గత ప్రభుత్వం విద్యా శాఖను సైతం నిర్వీర్యం చేసిందంటూ కేసీఆర్‌పై సీఎం రేవంత్‌రెడ్డి నిప్పులు చెరిగారు. రూ.16 వేల కోట్ల మిగులు బడ్జెట్ ఉన్న రాష్ట్రాన్ని అప్పగించామని వివరించారు. ఆ ధనిక రాష్ట్రం తెలంగాణను కాస్తా అప్పుల రాష్ట్రంగా మార్చారని విమర్శించారు. 2023లో తమకు రూ.7 లక్షల కోట్లు అప్పు చేసి అప్పగించారన్నారు. గత ప్రభుత్వం రూ.18 వేల కోట్లే రుణమాఫీ చేసిందని గుర్తు చేశారు. ఇది రుణమాఫీ వడ్డీలకే సరిపోయిందన్నారు. 60 రోజుల్లోనే రూ. 2లక్షల రుణమాఫీ చేశామని సీఎం రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు.
సోషల్ మీడియాలో లైక్‌లు చూసి సంబరం..
సోషల్ మీడియాలో తన కంటే ఎక్కువ లైక్‌లు.. వచ్చాయని కేసీఆర్ చెబుతున్నారని సీఎం రేవంత్‌రెడ్డి వ్యంగ్యంగా అన్నారు. కేంద్ర మంత్రి, సీఎంగా చేసిన వ్యక్తి.. లైక్‌లు ఎక్కువ వచ్చాయని సంబరపడుతున్నారంటూ ఎద్దేవా చేశారు. అసెంబ్లీకి వచ్చి చర్చలో పాల్గొను.. నువ్వో నేనో చూసుకుందామని కేసీఆర్‌కు స్పష్టం చేశారు. ఫాంహౌస్‌లో ఉన్న కేసీఆర్‌కు.. ప్రజలతో సంబంధాలు తెగిపోయినట్లున్నాయన్నారు.
Also Read : ‘ప్రజాస్వామ్యానికి వ్యతిరేకంగా వ్యవహరిస్తోంది’
బీఆర్ఎస్ మారలేదు...
ప్రజలు తిరస్కరించినా బీఆర్ఎస్ మాత్రం మారలేదని చెప్పారు. అంతకుముందు రంగారెడ్డి జిల్లాలో సీఎం రేవంత్‌రెడ్డి పర్యటించారు. ఆ క్రమంలో150 ఏళ్లు పూర్తి చేసుకొన్న మొగిలిగిద్ద జిల్లా పరిషత్ పాఠశాల వార్షికోత్సవ కార్యక్రమంలో సీఎం రేవంత్ రెడ్డి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. మొగిలిగిద్ద పాఠశాలకు అడ్వాన్స్ టెక్నాలజీ సెంటర్‌ను మంజూరు చేస్తున్నట్లు ఆయన ప్రకటించారు. ఎందరో ప్రముఖులు ఈ పాఠశాల్లో చదివారని గుర్తు చేశారు. అలాగే ఈ పాఠశాలను అద్భుతంగా తీర్చిదిద్దాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందన్నారు. గత ప్రభుత్వం ఈ పాఠశాలను పట్టించుకోలేదని మండిపడ్డారు. మొగిలిగిద్ద పాఠశాల అభివృద్ధికి.. నిధులు మంజూరు చేయాలని ఉన్నతాధికారులను ఆదేశించానని చెప్పారు. మొగిలిగిద్దకు సుమారు రూ.16 కోట్ల నిధులు మంజూరు చేయనున్నట్లు సీఎం రేవంత్‌రెడ్డి ప్రకటించారు.
Also Read : దేవాలయాల్లో వీఐపీ దర్శనాలు: సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు
55 రోజుల్లోనే..
గత ప్రభుత్వం హయాంలో టీచర్ నియామకాలు జరగలేదన్నారు. తమ ప్రభుత్వం రాగానే 11 వేల టీచర్ పోస్టులు భర్తీ చేశామని వివరించారు. గతంలో నోటిఫికేషన్లు ఇస్తే ఏళ్ల తరబడి నియామక ప్రక్రియ జరిగేదన్నారు. కానీ తమ ప్రభుత్వం 55 రోజుల్లోనే డీఎస్సీ నియామక ప్రక్రియ పూర్తి చేసిందని గుర్తు చేశారు. ఇక గత ప్రభుత్వం యూనివర్సిటీలను సైతం నిర్లక్ష్యం చేసిందన్నారు. గత సర్కార్.. వాటిని పునరావాస కేంద్రాలుగా మార్చారని విమర్శించారు. అయితే తమ ప్రభుత్వం రాగానే వీసీలను నియమించామని.. ప్రొఫెసర్ల రిటైర్మెంట్ వయస్సు 65 ఏళ్లకు పెంచామని సీఎం రేవంత్‌రెడ్డి ఈ సందర్భంగా గుర్తు చేశారు.
Also Read : రాష్ట్రపతి ప్రసంగంపై స్పందించిన సోనియా.. బీజేపీ మండిపాటు
ఖర్చు కాదు.. భవిష్యత్తుపై పెట్టుబడి..
విద్యపై చేసేది ఖర్చు కాదని.. భవిష్యత్తుపై పెట్టుబడి అని సీఎం రేవంత్‌రెడ్డి అభివర్ణించారు. విద్యా శాఖ తన వద్దే ఉందని.. నిత్యం పర్యవేక్షిస్తున్నానని తెలిపారు. గత ప్రభుత్వం డైట్, కాస్మోటిక్ ఛార్జీలను పెంచ లేదన్నారు. సాంకేతిక నైపుణ్యాలను పెంచాలని.. యంగ్ ఇండియా స్కిల్ వర్సిటీని ఏర్పాటు చేస్తున్నామని సీఎం రేవంత్‌రెడ్డి ప్రకటించారు.
Also Read : సుప్రీంకోర్టులో వైసీపీ నేతలకు చుక్కెదురు.. అసలు విషయం ఏమిటంటే..?
మట్టిలో మాణిక్యాలు..
దేశంలో 140 కోట్ల జనాభా ఉన్నా.. బంగారు పతకం సాధించలేదని.. కానీ దక్షిణకొరియాలో కోటి మంది ఉన్నా 32 బంగారు పతకాలు సాధించిందని గుర్తు చేశారు. మట్టిలో మాణిక్యాలను వెలికితీయడానికి.. యంగ్ ఇండియా స్పోర్ట్స్ వర్సిటీ ఏర్పాటు చేస్తున్నట్లు సీఎం రేవంత్‌రెడ్డి ప్రకటించారు. పతకాలు సాధించిన క్రీడాకారులకు ఉద్యోగాలతోపాటు నగదు ప్రోత్సహకాలు సైతం ఇస్తున్నామన్నారు.
గతంలో సమాజ సమస్యలను సైతం.. యూనివర్సిటీ విద్యార్థులు పరిష్కరించేవారని గుర్తు చేశారు. అయితే ప్రస్తుతం యూనివర్సిటీలు తమ ప్రాభవాన్ని కోల్పోతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వ విద్యాసంస్థలను సైతం బలోపేతం చేస్తున్నామని స్పష్టం చేశారు. తరగతి గదుల్లోనే దేశ భవిష్యత్తు ఉందని ఈ సందర్భంగా సీఎం రేవంత్‌రెడ్డి స్పష్టం చేశారు. ఏదైనా లోపాలుంటే సవరించుకుని తమ ప్రభుత్వం ముందుకెళ్తుందని సీఎం రేవంత్ రెడ్డి పేర్కొన్నారు.
For Telangana News And Telugu News