Share News

Tetra Pack: టెట్రా ప్యాకెట్లలో మద్యం!

ABN , Publish Date - Apr 13 , 2025 | 04:12 AM

కర్ణాటక తరహాలో రాష్ట్రంలో టెట్రా ప్యాకెట్లలో మద్యం అందుబాటులోకి రానుంది. ఫ్రూట్‌ జ్యూస్‌ తరహాలో మద్యం ప్యాకెట్లను జేబులో పెట్టుకుని తీసుకెళ్లేలా 60 ఎంఎల్‌, 90 ఎంఎల్‌, 180 ఎంఎల్‌ల ప్యాకెట్లను అమ్మడానికి సిద్ధం చేస్తున్నారు.

Tetra Pack: టెట్రా ప్యాకెట్లలో మద్యం!

  • ఫ్రూట్‌ జ్యూస్‌ తరహాలో 60, 90, 180 ఎంఎల్‌ ప్యాకెట్లు

  • మద్యం సీసా కంటే వీటి ధర తక్కువే

హైదరాబాద్‌, ఏప్రిల్‌ 12 (ఆంద్రజ్యోతి): కర్ణాటక తరహాలో రాష్ట్రంలో టెట్రా ప్యాకెట్లలో మద్యం అందుబాటులోకి రానుంది. ఫ్రూట్‌ జ్యూస్‌ తరహాలో మద్యం ప్యాకెట్లను జేబులో పెట్టుకుని తీసుకెళ్లేలా 60 ఎంఎల్‌, 90 ఎంఎల్‌, 180 ఎంఎల్‌ల ప్యాకెట్లను అమ్మడానికి సిద్ధం చేస్తున్నారు. సీసాలో దొరుకుతున్న మద్యం కంటే.. టెట్రా ప్యాకెట్లలో తక్కువ ధరకు లభించనుంది. రాష్ట్రంలో ఇప్పుడు క్వార్టర్‌ చీఫ్‌ లిక్కర్‌ ధర రూ.120గా ఉంది. అదే మద్యం టెట్రా ప్యాకెట్లలోకి మారితే రూ.100లకు లభించే అవకాశం ఉందని ఎక్సైజ్‌ శాఖ అధికారులు చె బుతున్నారు. ఇప్పటికే సంబంధిత ప్రతిపాదనలను ఎక్సైజ్‌ శాఖ అధికారులు ప్రభుత్వానికి పంపారు. ప్రభుత్వ ఆమోదం తర్వాత రాష్ట్రంలో టెట్రా ప్యాకెట్లలో మద్యం విక్రయాలు జరగనున్నాయి. రాష్ట్రంలో 2620 వైన్‌ షాపులు, 1117 వరకు బార్లున్నాయి.


వీటికి దేశ విదేశాలకు చెందిన 55 కంపెనీల ద్వారా మద్యం సరఫరా అవుతుంది. కర్ణాటకలో మెక్‌డొవెల్స్‌ నంబర్‌ వన్‌ అనే కంపెనీ 90శాతం టెట్రా ప్యాకెట్లలో విక్రయాలు జరుపుతోంది. అదే విధానాన్ని రాష్ట్రంలో విక్రయించడానికి ముందుకొచ్చింది. క్వార్టర్‌ సీసాల్లో విక్రయాలు తగ్గడం, ప్యాకెట్ల విధానం కొత్తగా తీసుకరావడం వల్ల అమ్మకాలు పెంచుకోవచ్చుననే ఉద్దేశంతో ఇప్పటికే ఆ కంపెనీ ప్రతినిధులు రెండుసార్లు ప్రొహిబిషన్‌ అండ్‌ ఎక్సైజ్‌ శాఖ ఉన్నతాధికారులను సంప్రదించారు. ప్రస్తుతం సరఫరా చేస్తున్న క్వార్టర్‌ బాటిల్స్‌ స్థానంలో టెట్రా ప్యాకెట్లను అందుబాటులోకి తీసుకొస్తామని చెప్పారు. దీని వల్ల ఖర్చు తగ్గడంతో పాటు ప్రభుత్వానికి, వినియోగదారుడు, కంపెనీకు కలిగే ప్రయోజనాల గురించి ఆ శాఖ అధికారులతో చర్చించారు. ఈ అమ్మకాలపై ప్రజల్లో స్పందన ఎలా ఉంటుందో తెలుసుకోవడానికి అవసరమైతే.. కర్ణాటక సరిహద్దులోని మహబూబ్‌నగర్‌ జిల్లాలో ప్రయోగాత్మకంగా విక్రయించుకోవడానికి అవకాశం ఇవ్వండనే విషయం కూడా చర్చకు వచ్చింది.


కల్తీకి అవకాశం?

సీసాల్లో మాదిరిగా మూతలు తీసి కల్తీ చేసే అవకాశం టెట్రా ప్యాకెట్లలో ఉండదని, జేబులో పెట్టుకుని తీసుకెళ్లే విధంగా ఉంటుందని మద్యం కంపెనీ ప్రతినిధులు చెబుతున్నారు. అయితే ప్యాకెట్లలో లభించే మద్యం కల్తీ అయ్యే అవకాశం ఎక్కువగా ఉంటుందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. టెట్రా ప్యాకెట్‌కు వేసే సీల్‌ మద్యం కల్తీ కాకుండా ఆపగలుగుతుందా? ప్యాకెట్‌ మందం ఎంత? వంటి విషయాలపై స్పష్టం చేయాల్సిన అవసరం ఉంది. గతంలో మహారాష్ట్ర తరహాలో ప్లాస్టిక్‌ సీసాల్లో మద్యం విక్రయాలు చేయగా.. వాటికి సులువుగా సిరంజీల ద్వారా కల్తీ చేసేవాళ్లు. ప్యాకెట్లలో మద్యం వస్తే.. అదే విధంగా కల్తీకి అవకాశం ఉంటుందని అంటున్నారు.


ఇవి కూడా చదవండి...

Harassment Of Women: కోరిక తీర్చాలంటూ మహిళను ఎంతలా వేధించారంటే

Case On KTR: కేటీఆర్‌ ట్వీట్‌పై పోలీసుల రియాక్షన్

Read Latest Telangana News And Telugu News

Updated Date - Apr 13 , 2025 | 04:12 AM