Share News

Kaleshwaram Project: ఒకటి, రెండు రోజుల్లో సీబీఐకి లేఖ

ABN , Publish Date - Sep 02 , 2025 | 02:31 AM

కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణంపై లోతైన విచారణ జరపాలని కోరుతూ ఒకటి, రెండు రోజుల్లో సీబీఐకి లేఖ రాస్తామని సీఎం రేవంత్‌రెడ్డి వెల్లడించారు..

Kaleshwaram Project: ఒకటి, రెండు రోజుల్లో సీబీఐకి లేఖ

  • మీడియతో చిట్‌ చాట్‌లో సీఎం రేవంత్‌ వెల్లడి

  • సీబీఐకి అప్పగించే చర్యలకు ఉపక్రమించాలి

  • ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి నివేదించిన నీటిపారుదల శాఖ

హైదరాబాద్‌, సెప్టెంబరు 1(ఆంధ్రజ్యోతి): కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణంపై లోతైన విచారణ జరపాలని కోరుతూ ఒకటి, రెండు రోజుల్లో సీబీఐకి లేఖ రాస్తామని సీఎం రేవంత్‌రెడ్డి వెల్లడించారు. ఆ పని అధికారులు చేస్తారని, విచారణకు సీబీఐ ముందుకు రాగానే కేసును అప్పగిస్తామన్నారు. ఈ నిర్ణయంలో రాజకీయాలకు సంబంధం లేదని, ప్రాజెక్టు నిర్మాణంలో అంతర్‌ రాష్ట్ర ప్రభుత్వాలు, కేంద్ర ప్రభుత్వ సంస్థలూ భాగస్వామ్యం కావడం వల్లే సీబీఐకి అప్పగించాలని నిర్ణయించామన్నారు. భారత ప్రభుత్వానికి కేసును అప్పగిస్తున్నామని చెప్పారు. కేసు ఎఫ్‌ఐఆర్‌ అయ్యాక అందులో మనీ లాండరింగ్‌ జరిగిందని తేలినప్పుడు ఈడీ ఎంటరవుతుందన్నారు.

ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి సమాచారం

కాళేశ్వరంపై ఘోష్‌ నివేదిక ప్రకారం తదుపరి విచారణ బాధ్యతలను సీబీఐకి అప్పగించేలా చర్యలకు ఉపక్రమించాలని నీటిపారుదలశాఖ ప్రభుత్వాన్ని కోరింది. శాసనసభలో తీసుకున్న నిర్ణయంపై ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి నీటిపారుదలశాఖ సమాచారం ఇచ్చింది. శాసనసభలో తీసుకున్న నిర్ణయానికి అనుగుణంగా కేంద్ర హోంశాఖ కార్యదర్శికి తెలంగాణ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి తరపున విజ్ఞప్తి వెళ్లాల్సి ఉంటుంది. దీనికన్నా ముందు ఫైలు ముఖ్యమంత్రి కార్యాలయానికి చేరి, సీఎం సంతకం తర్వాత రాష్ట్ర హోంశాఖ ముఖ్యకార్యదర్శికి వెళ్లనుంది. ఆ తర్వాత సీఎస్‌ కార్యాలయానికి చేరనుంది. అనంతరం కేంద్ర హోంశాఖకు చేరాల్సి ఉంటుంది. ఆ తర్వాత కేంద్ర హోంశాఖ నిర్ణయం తీసుకుంటే సీబీఐ విచారణలో ముందుకు కదలనుంది.


ఈ వార్తలు కూడా చదవండి..

కేసీఆర్, హరీష్ రావు మధ్యంతర పిటిషన్లపై కొన్ని ఘడియల్లో విచారణ

తెలంగాణ ఎడ్యుకేషన్ పాలసీపై కమిటీ ఏర్పాటు

For More TG News And Telugu News

Updated Date - Sep 02 , 2025 | 02:31 AM