Share News

TIMS: 2నెలల్లో అందుబాటులోకి సనత్‌నగర్‌ టిమ్స్‌!

ABN , Publish Date - Aug 04 , 2025 | 04:13 AM

ఎర్రగడ్డ రాష్ట్ర ఛాతీ వ్యాధుల ఆస్పత్రి ఖాళీ స్థలంలో తెలంగాణ ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ మెడికల్‌ సైన్సెస్‌ (సనత్‌నగర్‌ టిమ్స్‌) ఆస్పత్రి సిద్ధమవుతోంది. మరో రెండు నెలల్లో ఆస్పత్రిని అందుబాటులోకి తెచ్చి.. వైద్యసేవలు ప్రారంభించడంపై ప్రభుత్వం దృష్టిసారించింది.

TIMS: 2నెలల్లో అందుబాటులోకి సనత్‌నగర్‌ టిమ్స్‌!

  • వచ్చే నెల చివరికి నిర్మాణం పూర్తి

  • సెప్టెంబరు నుంచి వైద్యసేవలు

  • గుండె జబ్బులకు పెద్దాస్పత్రి ఇదే

  • వివిధ అవయవమార్పిడి చికిత్సలు కూడా

  • జీ+5 అంతస్తులతో నిర్మాణం.. 24 లిఫ్ట్‌లు

హైదరాబాద్‌ సిటీ/ఎర్రగడ్డ, ఆగస్టు 3 (ఆంధ్రజ్యోతి): ఎర్రగడ్డ రాష్ట్ర ఛాతీ వ్యాధుల ఆస్పత్రి ఖాళీ స్థలంలో తెలంగాణ ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ మెడికల్‌ సైన్సెస్‌ (సనత్‌నగర్‌ టిమ్స్‌) ఆస్పత్రి సిద్ధమవుతోంది. మరో రెండు నెలల్లో ఆస్పత్రిని అందుబాటులోకి తెచ్చి.. వైద్యసేవలు ప్రారంభించడంపై ప్రభుత్వం దృష్టిసారించింది. ఈ ఆస్పత్రిని హార్ట్‌ స్పెషాలిటీ ఆస్పత్రిగా తీర్చిదిద్దుతున్నారు. వెయ్యి పడకలతో కూడిన ఈ ఆస్పత్రిలో ఐదు వందల పడకలను కేవలం గుండె జబ్బుల చికిత్సల కోసమే కేటాయించనున్నారు. ప్రస్తుతం గుండె జబ్బులకు గాంధీ, ఉస్మానియా ఆస్పత్రుల్లోనే చికిత్స అందిస్తున్నారు. నిమ్స్‌లో ఆరోగ్యశ్రీ, సీఎం రిలీఫ్‌ ఫండ్‌తో గుండె చికిత్సలు, అవయవ మార్పిడి శస్త్రచికత్సలు చేస్తున్నారు. అయితే గుండె చికిత్సలకు సంబంధించి ఇప్పటిదాకా ప్రత్యేకంగా ప్రభుత్వ ఆస్పత్రి అంటూ ఏదీ లేకపోవడంతో సనత్‌నగర్‌ టిమ్స్‌ హార్ట్‌ హాస్పిటల్‌గా నిలవనుంది.


ఆస్పత్రి నిర్మాణ పనులు ఆగస్టు నెలాఖరుకు పూర్తి చేసి వైద్యశాఖకు అప్పగించేందుకు సన్నాహాలు జరుగుతున్నాయి. సెప్టెంబరులో వార్డులు సిద్ధం చేసి.. పడకలు, వైద్యవిభాగాలు, ఆపరేషన్‌ థియేటర్లు, ఆధునిక పరికరాలు ఏర్పాటు చేసి.. అదేనెలలో వైద్యసేవలు అందుబాటులోకి తేనున్నారు. పదకొండు లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంలో ఆస్పత్రి నిర్మాణం జరుగుతోంది. జీ ప్లస్‌ 5 అంతస్తులతో ఆస్పత్రిని నిర్మిస్తున్నారు. భవనంలో మూడు బ్లాకులు రోగులకు చికిత్స కోసమే ఉంటాయి. ఒక బ్లాక్‌ను ప్రత్యేకంగా రోగుల సహాయకులకు కేటాయిస్తారు. ఇంకో బ్లాకును అడ్మినిస్ట్రేటివ్‌ బ్లాక్‌గా సిద్ధం చేస్తున్నారు. భవనంలో మొత్తంగా 24 లిఫ్ట్‌లు ఉంటాయి. రోగి వెంట వచ్చే సహాయకుల కోసం 230 పడకలు ఉంటాయి. టిమ్స్‌కు అనుబంధంగా మెడికల్‌, నర్సింగ్‌ కాలేజీల నిర్మాణం కూడా జరుగుతోంది. కాగా ఆస్పత్రిలో వైద్యులు, నర్సులు, ఇతర సిబ్బంది నియామకంపై ఇప్పటికే వైద్యవిద్య శాఖ దృష్టి సారించింంది.


శరవేగంగా పనులు

ఎర్రగడ్డ టిమ్స్‌ ఆస్పత్రి పనులు చివరి దశలో ఉన్నాయి. ఆగస్టు నెలాఖారుకు నిర్మాణ పనులు పూర్తి చేసే లక్ష్యంతో పనులు శరవేగంగా సాగుతున్నాయి. సెప్టెంబరులో నియామకాలు పూర్తి చేసి ఆ వెంటనే వైద్య సేవలను అందించడానికి ప్రభుత్వం సిద్ధమవుతోంది. రాష్ట్రంలో గుండె జబ్బులు, అవయవ మార్పిడి కోసం పెద్ద ఆస్పత్రి ఇదేకానుంది.

- డాక్టర్‌ మహబూబ్‌ఖాన్‌, నోడల్‌ అధికారి


ఈ వార్తలు కూడా చదవండి..

టాలీవుడ్‌లో షూటింగ్స్ బంద్..

కాళేశ్వరం కమిషన్ నివేదికపై కీలక భేటీ.. ఎందుకంటే..

ధర్మస్థలలో మరో షాకింగ్ ఘటన.. దేశవ్యాప్తంగా ఆందోళన

Read latest Telangana News And Telugu News

Updated Date - Aug 04 , 2025 | 04:13 AM