Share News

SC Sub-Categorization: ఎస్సీ వర్గీకరణ నేటి నుంచే..

ABN , Publish Date - Apr 14 , 2025 | 03:33 AM

షెడ్యూల్డ్‌ కులాల్లో (ఎస్సీ) బాగా వెనుకబడి, రిజర్వేషన్ల ఫలాలను సరిగా పొందలేకపోయిన కులాల కల నెరవేరుతోంది. రాష్ట్రంలో ఎస్సీలకు ఇప్పటివరకు గంపగుత్తగా అమలైన 15శాతం రిజర్వేషన్లు.. ఇక నుంచి వర్గీకరణ ప్రకారం అందనున్నాయి.

SC Sub-Categorization: ఎస్సీ వర్గీకరణ నేటి నుంచే..

  • మూడు గ్రూపులు.. 59 ఉప కులాలు.. మొత్తం 15 శాతం రిజర్వేషన్లు

  • గ్రూపు-1కు 1 శాతం, గ్రూపు-2కు 9, గ్రూపు-3కు 5 శాతం వర్తింపు

  • ప్రాధాన్య క్రమంలో ఉద్యోగ ఖాళీల భర్తీ

  • నేడు ఉదయం 11 గంటలకు జీవో 9 విడుదల చేయనున్న రేవంత్‌ సర్కారు

హైదరాబాద్‌, ఏప్రిల్‌ 13 (ఆంధ్రజ్యోతి): షెడ్యూల్డ్‌ కులాల్లో (ఎస్సీ) బాగా వెనుకబడి, రిజర్వేషన్ల ఫలాలను సరిగా పొందలేకపోయిన కులాల కల నెరవేరుతోంది. రాష్ట్రంలో ఎస్సీలకు ఇప్పటివరకు గంపగుత్తగా అమలైన 15శాతం రిజర్వేషన్లు.. ఇక నుంచి వర్గీకరణ ప్రకారం అందనున్నాయి. అందులోనూ గ్రూపులు, కులాల ప్రాధాన్యతా క్రమంలో ప్రభుత్వ ఉద్యోగాల ఖాళీలను భర్తీ చేయనున్నారు. రాష్ట్ర ప్రభుత్వం అంబేడ్కర్‌ జయంతి సందర్భంగా సోమవారం ఉదయం 11 గంటలకు ఎస్సీ గ్రూపులు, కులాల వారీగా అందే రిజర్వేషన్ల వివరాలతో జీవో 9ని విడుదల చేయనుంది. అంతకంటే ముందు ఎస్సీ వర్గీకరణపై ఏర్పాటైన మంత్రివర్గ ఉప సంఘం సచివాలయంలో భేటీ అవుతుంది. ఉత్తర్వులను విడుదల చేసిన అనంతరం మంత్రులు జూబ్లీహిల్స్‌లోని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి నివాసానికి వెళ్లి.. ఎస్సీ రిజర్వేషన్ల అమలు జీవో తొలి కాపీని అందిస్తారు. జీవో అమల్లోకి వచ్చినప్పటి నుంచి వెలువడే అన్ని ప్రభుత్వ ఉద్యోగ నియామక ప్రకటనలు, విద్యా సంస్థల ప్రవేశాలకు వర్గీకరణ వరిస్తుంది. సుప్రీంకోర్టు తీర్పు తర్వాత దేశంలో ఎస్సీ వర్గీకరణను పూర్తి చేసిన తొలి రాష్ట్రంగా తెలంగాణ నిలవడం గమనార్హం.


సుప్రీం తీర్పు వచ్చిన రోజే ప్రకటన

ఎస్సీ వర్గీకరణ విషయంలో రాష్ట్రాలే నిర్ణయం తీసుకోవచ్చంటూ సుప్రీంకోర్టు గతేడాది ఆగస్టు 1న తీర్పు ఇచ్చింది. తెలంగాణలో ఎస్సీ వర్గీకరణ అమలు చేస్తామని అదే రోజున ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి శాసనసభలో ప్రకటించారు. సెప్టెంబర్‌ 12న ఉత్తమ్‌కుమార్‌రెడ్డి అధ్యక్షతన దామోదర రాజనర్సింహ, శ్రీధర్‌బాబు, పొన్నం ప్రభాకర్‌, సీతక్క, ఎంపీ మల్లు రవి సభ్యులుగా మంత్రివర్గ ఉప సంఘాన్ని ప్రభుత్వం ఏర్పాటు చేసింది. ఉప సంఘం సూచన మేరకు 2024 అక్టోబర్‌ 11న విశ్రాంత న్యాయమూర్తి జస్టిస్‌ షమీమ్‌ అక్తర్‌తో ఏక సభ్య కమిషన్‌ను ఏర్పాటు చేసింది. 60 రోజులో కమిషన్‌ నివేదిక ఇవ్వాలని కోరింది. తర్వాత గడువును ఈ ఏడాది ఫిబ్రవరి 10 వరకు పొడిగించింది. కమిషన్‌ 2011 జనాభా లెక్కల ఆధారంగా పరిశీలన జరిపి.. ఫిబ్రవరి 3న మంత్రివర్గ ఉప సంఘానికి నివేదిక అందజేసింది. కమిషన్‌ సిఫార్సులకు అనుగుణంగా రాష్ట్రంలో ఎస్సీలను 3 గ్రూపులుగా వర్గీకరించి, రిజర్వేషన్‌ను విభజిస్తున్నట్టు ఫిబ్రవరి 4న అసెంబ్లీలో ప్రభుత్వం ప్రకటించింది.


మూడు అంశాల ఆధారంగా వర్గీకరణ..

జస్టిస్‌ షమీమ్‌ అక్తర్‌ కమిషన్‌ రాష్ట్రంలోని 59 ఎస్సీ కులాలను మూడు గ్రూపులుగా వర్గీకరించి, జనాభా శాతం ఆధారంగా 15 శాతం రిజర్వేషన్‌ను పంచింది. గ్రూప్‌-1లో సామాజికంగా, ఆర్థికంగా, విద్యాపరంగా, అత్యంత వెనుకబడిన 15 కులాలను చేర్చి 1శాతం, గ్రూప్‌-2లో మాదిగ, దాని ఉప కులాలను కలిపి 18 కులాలకు 9శాతం, గ్రూప్‌-3లో మాల, దాని ఉపకులాలను కలిపి 26 కులాలకు 5శాతం రిజర్వేషన్‌ను కేటాయించింది. గ్రూప్‌-1లో 1,71,625 మంది (3.288శాతం), గ్రూప్‌-2లో 32,74,377 మంది (62.748శాతం), గ్రూప్‌-3లో 17,71,1682 మంది (33.963శాతం) జనాభా ఉన్నారని పేర్కొంది. ప్రభుత్వ ఉద్యోగాల భర్తీ ప్రక్రియలో ఎస్సీ రిజర్వేషన్ల అమలుకు గ్రూపుల వారీగా ప్రాధాన్యత క్రమం అనుసరించాలని కమిషన్‌ ప్రతిపాదించింది. గ్రూప్‌-1లోని కులాల వారితో ఖాళీలు భర్తీ కాకపోతే.. గ్రూప్‌-2లోని వారితో, గ్రూప్‌-2లో భర్తీకాని ఖాళీలను గ్రూప్‌-3లోని కులాల వారితో భర్తీ చేయాలని సూచించింది. ఒకవేళ ఈ మూడు గ్రూపుల్లో తగిన అభ్యర్థులు లేకపోతే ఖాళీలను తర్వాతి నోటిఫికేషన్‌కు కొనసాగించాలని (క్యారీ ఫార్వర్డ్‌) పేర్కొంది. సాధారణంగా ప్రభుత్వ ఉద్యోగాల భర్తీలో రోస్టర్‌ పాయింట్లు కీలకంగా ఉంటాయి. ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఈడబ్ల్యూఎస్‌, దివ్యాంగులకు వారి రిజర్వేషన్ల ప్రకారం రోస్టర్‌ పాయింట్లు ఉంటాయి. ఎస్సీ వర్గీకరణ నేపథ్యంలో గ్రూపుల వారీగా ఈ రోస్టర్‌ పాయింట్లను కూడా కమిషన్‌ విభజించింది. ఎస్సీ గ్రూప్‌-1కు 7వ రోస్టర్‌ పాయింట్‌, గ్రూప్‌-2లోని వారికి 2, 16, 27, 47, 52, 66, 72, 87, 97 పాయింట్లను, గ్రూప్‌-3లోని వారికి 22, 41, 62, 77, 91 రోస్టర్‌ పాయింట్లను ప్రతిపాదించింది. సోమవారం విడుదల చేసే ఉత్తర్వుల్లో ఈ వివరాలను పొందుపర్చనున్నారు.

వర్గాలు, కులాల సంఖ్య వారీగా ఎస్సీ రిజర్వేషన్‌ వివరాలు

కేటగిరి గ్రూప్‌ పేరు కులాల సంఖ్య జనాభా సిఫారసు చేసిన రిజర్వేషన్‌

గ్రూప్‌-1 అత్యంత వెనుకబడిన, 15 3.288 1

పట్టించుకోని షెడ్యూలు కులాలు

గ్రూప్‌-2 మధ్యస్థంగా లబ్ధిపొందిన 18 62.748 9

షెడ్యూలు కులాలు

గ్రూప్‌-3 మెరుగైన ప్రయోజనం 26 33.963 5

పొందిన షెడ్యూలు కులాలు

మొత్తం 59 100 15


మూడు దశాబ్దాల పోరాటం

ఎస్సీలను వర్గీకరించి రిజర్వేషన్లను అమలుచేయాలనే డిమాండ్‌తో ఎస్సీల్లోని వెనుకబడిన కులాలు మూడు దశాబ్దాలుగా పోరాటం చేస్తున్నాయి. వారి కలకు ఇన్నేళ్లకు నెరవేరుతోంది. వాస్తవానికి 1997లోనే అప్పటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం ఎస్సీ వర్గీకరణ కోసం జస్టిస్‌ రామచంద్రరాజు కమిషన్‌ను నియమించింది. ఆ కమిషన్‌ ప్రతిపాదనల మేరకు ప్రభుత్వం ఎస్సీ కులాలను ఏ, బీ, సీ, డీ కేటగిరీలుగా వర్గీకరిస్తూ 1997 జూన్‌ 6న ఉత్తర్వులు జారీ చేసింది. కానీ హైకోర్టులో పిటిషన్లు దాఖలవడంతో ఉత్తర్వుల అమలు నిలిచిపోయింది. వర్గీకరణపై 1998లో ప్రభుత్వం ఆర్డినెన్స్‌ను జారీ చేసినా హైకోర్టులో సవాల్‌ చేయడంతో ఆగిపోయింది. తర్వాత ఆ కేసు సుప్రీంకోర్టుకు చేరగా.. ఎస్సీ వర్గీకరణను పార్లమెంట్‌ మాత్రమే చేయగలదంటూ రాష్ట్ర ఆర్డినెన్స్‌ను కొట్టివేసింది. ఇక 2008లో అప్పటి సీఎం వైఎస్సార్‌ విజ్ఞప్తి మేరకు కేంద్రం ఉషా మెహ్రా కమిషన్‌ ఏర్పాటు చేసినా.. ఆ సిఫార్సులు అమలుకాలేదు. తాజాగా 2024 ఆగస్టులో రాష్ట్రాలే ఎస్సీ వర్గీకరణ చేసుకోవచ్చని సుప్రీంకోర్టు తీర్పు ఇవ్వడంతో తెలంగాణ ప్రభుత్వం వెంటనే చర్యలు చేపట్టింది. కమిషన్‌ ఏర్పాటు, వర్గీకరణ ఖరారు, అసెంబ్లీలో బిల్లు ఆమోదం, చట్టబద్ధత దాకా చకచకా పూర్తి చేసింది.


ఈ వార్తలు కూడా చదవండి..

పులివెందుల అభివృద్ధి పేరుతో జగన్ మోసం

ఏపీలో ఢిల్లీకి మించిన లిక్కర్ స్కామ్..

టీడీపీ కార్యకర్తపై కేసు.. మరికాసేపట్లో అరెస్టు..

For More AP News and Telugu News

Updated Date - Apr 14 , 2025 | 08:12 AM