CM Revanth Reddy: మూడు కార్పొరేషన్లకు రంగం సిద్ధం
ABN , Publish Date - Dec 31 , 2025 | 05:30 AM
హైదరాబాద్ మహానగర పాలక సంస్థ జీహెచ్‌ఎంసీ విభజన ఖాయమైంది. ఔటర్ రింగ్ రోడ్డు ఆవలి వరకు 2071 చదరపు కిలోమీటర్ల మేర విస్తరించిన గ్రేటర్ హైదరాబాద్ మునిసిపల్ కార్పొరేషన్‌ను మూడు కార్పొరేషన్లుగా విభజించేందుకు రంగం సిద్ధమైంది.....
హైదరాబాద్‌తోపాటు సైబరాబాద్, మల్కాజిగిరి
150 డివిజన్లతో గ్రేటర్ హైదరాబాద్ కార్పొరేషన్
76 డివిజన్లతో సైబరాబాద్, 74 డివిజన్లతో మల్కాజిగిరి మునిసిపల్ కార్పొరేషన్ల ఏర్పాటు
2న శాసనసభలో ప్రకటించనున్న ప్రభుత్వం?
విభజన ప్రక్రియ పూర్తి.. సర్కారు వద్ద నివేదిక
ఫిబ్రవరి చివరి నాటికి తుది నోటిఫికేషన్
కొత్త కార్పొరేషన్లకు ప్రత్యేక భవనాలు
10 ఎకరాల చొప్పున కేటాయించాలని నిర్ణయం
తాజాగా బదిలీ అయిన అడిషనల్ కమిషనర్లే కొత్త కార్పొరేషన్లకు భవిష్యత్తు కమిషనర్లు!
హైదరాబాద్/హైదరాబాద్ సిటీ, డిసెంబరు 30 (ఆంధ్ర జ్యోతి): హైదరాబాద్ మహానగర పాలక సంస్థ (జీహెచ్‌ఎంసీ) విభజన ఖాయమైంది. ఔటర్ రింగ్ రోడ్డు ఆవలి వరకు 2071 చదరపు కిలోమీటర్ల మేర విస్తరించిన గ్రేటర్ హైదరాబాద్ మునిసిపల్ కార్పొరేషన్‌ను మూడు కార్పొరేషన్లుగా విభజించేందుకు రంగం సిద్ధమైంది. ఇందుకు సంబంధించిన కసరత్తు పూర్తయి.. ప్రభుత్వం వద్ద నివేదిక సిద్ధంగా ఉంది. దీని ప్రకారం.. హైదరాబాద్ మునిసిపల్ కార్పొరేషన్‌తోపాటు కొత్తగా సైబరాబాద్, మల్కాజిగిరి కార్పొరేషన్లు ఏర్పాటు కానున్నట్లు సమాచారం. అయితే జనవరి 2న అసెంబ్లీ సమావేశాల్లో దీనిపై స్పష్టత వస్తుందని బల్దియాలోని ఉన్నతస్థాయి వర్గాలు పేర్కొన్నాయి. సికింద్రాబాద్‌లోని రాంగోపాల్‌పేట మొదలుకొని శంషాబాద్ వరకు హైదరాబాద్ మునిసిపల్ కార్పొరేషన్‌ను ఏర్పాటు చేయనున్నట్టు విశ్వసనీయ సమాచారం. విస్తరిత జీహెచ్‌ఎంసీలో 12 జోన్లు, 300 డివిజన్లు ఉండగా.. ఆరు జోన్లు, 150 డివిజన్లతో హైదరాబాద్ మునిసిపల్ కార్పొరేషన్ ఏర్పాటు కానుంది. నార్సింగి నుంచి శామీర్‌పేట సమీపంలోని జీనోమ్ వ్యాలీ వరకు సైబరాబాద్ మునిసిపల్ కార్పొరేషన్‌గా, కీసర నుంచి పెద్ద అంబర్‌పేట వరకు మల్కాజిగిరి కార్పొరేషన్‌గా ఏర్పాటు చేయనున్నారు. సైబరాబాద్ కార్పొరేషన్ పరిధిలో 76 డివిజన్లు, మల్కాజిగిరి కార్పొరేషన్‌లో 74 డివిజన్లు ఉంటాయని తెలుస్తోంది.
సుదీర్ఘ కసరత్తు తరువాత..
వాస్తవానికి రాష్ట్ర ప్రభుత్వం తెలంగాణ రైజింగ్ విజన్-2047లో పేర్కొన్నట్లు కోర్ అర్బన్ రీజియన్ (క్యూర్)లో ఔటర్ రింగ్ రోడ్డు పరిధి వరకు ఉన్న ప్రాంతాలన్నింటినీ తొలుత గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోకి తెచ్చి.. ఆ తర్వాత దానిని మూడు కార్పొరేషన్లుగా విభజించాలని నిర్ణయించింది. ఈ మేరకు ఔటర్ రింగ్ రోడ్డు లోపల, ఆవల ఉన్న 20 మునిసిపాలిటీలను, ఏడు కార్పొరేషన్లను విలీనం చేస్తు జీహెచ్‌ఎంసీని ఇటీవల విస్తరింపజేసింది. దీంతో.. అంతకుముందు 650 చదరపు కిలోమీటర్లుగా ఉన్న జీహెచ్‌ఎంసీ.. 2,071 చదరపు కిలోమీటర్ల మేర కోర్ అర్బన్ రీజియన్ (టీసీయూఆర్) వరకు విస్తరించింది. అనంతరం మెరుగైన పౌరసేవలు, ప్రణాళికా బద్ధమైన అభివృద్ధి కోసం ప్రభుత్వం అధికార వికేంద్రీకరణ చేపట్టింది. ఈ మేరకే జీహెచ్‌ఎంసీని మూడు కార్పొరేషన్లుగా విభజించాలనే నిర్ణయం తీసుకుంది. ఇందుకోసం ముందుగా డివిజన్ల సరిహద్దులు నిర్ణయించి.. పునర్విభజన ముసాయిదాను జీహెచ్‌ఎంసీ కమిషనర్ ఆర్‌వీ కర్ణన్ ప్రకటించారు. ఆపై.. అభ్యంతరాలు, సూచనల స్వీకరణ అనంతరం సర్కిళ్లు, జోన్లతో తుది నోటిఫికేషన్ వెలువడింది. బల్దియాలోని పట్టణ ప్రణాళికా విభాగం, సెంటర్ ఫర్ గుడ్ గవర్నెన్స్ ప్రతినిధులు దీనిపై మూడు వారాలకుపైగా జూబ్లీహిల్స్‌లోని మర్రి చెన్నారెడ్డి మానవ వనరుల కేంద్రంలో సుదీర్ఘ కసరత్తు చేశారు. అనంతరం మూడు కార్పొరేషన్ల ఏర్పాటుకు సంబంధించి ప్రభుత్వానికి నివేదిక అందజేశారని ప్రభుత్వ అధికారి ఒకరు తెలిపారు.
కీలక ప్రాంతాలతో హైదరాబాద్ కార్పొరేషన్..
జీహెచ్‌ఎంసీని మూడు స్వతంత్ర కార్పొరేషన్లుగా విభజించాలని నిర్ణయించిన ప్రభుత్వం.. అందుకు అనుగుణంగా ఇప్పటికే పోలీసు కమిషనరేట్లను ఏర్పాటు చేసింది. నాలుగు పోలీస్ కమిషనరేట్లకు సంబంధించిన జీవోలను సోమవారమే ఇచ్చింది. అంతేకాకుండా టౌన్‌ప్లానింగ్ విభాగాన్ని కూడా సర్కిళ్లు, జోన్లు, డివిజన్లుగా వర్గీకరించింది. త్వరలోనే వాటర్ వర్క్స్, విద్యుత్, ట్రాఫిక్ తదితర విభాగాలను కూడా మూడు కార్పొరేషన్ల ఏర్పాటు ప్రణాళిక పరిధికి తగినట్లు పునర్విభజన చేయాలని నిర్ణయించింది. హైదరాబాద్ కార్పొరేషన్ పరిధిలో ప్రధానంగా పాతనగరం, సెంట్రల్ హైదరాబాద్ ప్రాంతాలు ఉంటాయి. చార్మినార్, బహుదూర్‌పుర, ఫలక్‌నుమా, సంతో్‌షనగర్, సైదాబాద్, మలక్‌పేట, కోఠి, అబిడ్స్, నాంపల్లి, ఖైరతాబాద్, సోమాజిగూడ, గోల్కొండ, శంషాబాద్, రాజేంద్రనగర్ ప్రాంతాలు, వాటిలోని 150 డివిజన్లు ఈ కార్పొరేషన్ పరిధిలో ఉంటాయి. సికింద్రాబాద్ నుంచి మొదలై.. తార్నాక, ముషీరాబాద్, అంబర్‌పేట, మరోవైపు బోరబండ, జూబ్లీహిల్స్, బంజారాహిల్స్, ఖైరతాబాద్, రెడ్‌హిల్స్, జియాగూడ, టప్పాచబుత్ర, అత్తాపూర్, రాజేంద్రనగర్, కొత్వాల్‌గూడ, జల్‌పల్లి, బడంగ్‌పేట, ఆదిభట్ల మీదుగా శంషాబాద్ వరకు హైదరాబాద్ మునిసిపల్ కార్పొరేషన్ ఉంటుంది.
ఐటీ కారిడార్‌గా సైబరాబాద్ కార్పొరేషన్..
సైబరాబాద్ కార్పొరేషన్ పూర్తిగా ఐటీ కారిడార్‌లా మారనుంది. ఈ కార్పొరేషన్ పరిధిలో నగరంలో వేగంగా అభివృద్ధి చెందుతున్న పశ్చిమ భాగం ఉండనుంది. మియాపూర్, చందానగర్, పటాన్‌చెరు, ఆర్‌సీ పురం, గచ్చిబౌలి, మాదాపూర్, హైటెక్ సిటీ, కొండాపూర్, నానక్‌రామ్ గూడ, మణికొండ, నార్సింగి, శేరిలింగంపల్లి, కూకట్‌పల్లి, బాలానగర్, కుత్బుల్లాపూర్, మేడ్చల్, దుండిగల్, జీనోమ్ వ్యాలీ ప్రాంతాల్లోని 74 డివిజన్లు ఈ కార్పొరేషన్‌లో ఉండనున్నాయి. ఇక మూడో కార్పొరేషన్‌గా ఉత్తర-తూర్పు హైదరాబాద్ కేంద్రంగా మల్కాజిగిరి ఏర్పాటు కానుంది. ఈ కార్పొరేషన్ కీసర నుంచి మొదలై పెద్ద అంబర్‌పేట వరకు ఉంటుంది. దీని పరిధిలో మల్కాజిగిరి, అల్వాల్, బోయిన్‌పల్లి, తిరుమలగిరి, ఖార్కానా, కాప్రా, ఈసీఐఎల్, సైనిక్‌పురి, ఉప్పల్, నాగోల్, నాచారం, మేడిపల్లి, ఘట్‌కేసర్, కీసర, వనస్థలిపురం, హయత్‌నగర్, అబ్దుల్లాపూర్‌మెట్ ఉన్నాయి. డిఫెన్స్, రైల్వే, పారిశ్రామిక ప్రాంతాల్లోని 76 డివిజన్లు కలిసి ఉంటాయి. అయితే ఈ కార్పొరేషన్ల పరిఽఽధుల విషయంలో స్పష్టతకు వచ్చినా.. పేర్ల విషయంలో మాత్రం తుది నిర్ణయానికి రావాల్సి ఉంది. కాగా, హైదరాబాద్ కార్పొరేషన్‌కు ప్రస్తుతం ఉన్న జీహెచ్‌ఎంసీ కార్యాలయాన్నే కొనసాగిస్తుండగా.. కొత్తగా ఏర్పాటు చేయనున్న సైబరాబాద్, మల్కాజిగిరి కార్పొరేషన్లకు సరికొత్త భవనాలు నిర్మించాలని కూడా ప్రభుత్వం యోచిస్తోంది. దీనికోసం కొత్తగా ఏర్పడే ఈ రెండు కార్పొరేషన్లకు 10 ఎకరాల చొప్పున కేటాయించనుందని తెలిసింది. మొత్తంగా మూడు కార్పొరేషన్ల ఏర్పాటుకు కావాల్సిన ప్రక్రియలన్నింటినీ ముందుగానే పూర్తిచేసి...దానికి చట్టపరంగా చేయాల్సిన కార్యాచరణ పూర్తిచేసి ఫిబ్రవరి నెలాఖరుకుగానీ, మార్చిలో గానీ తుది నోటిఫికేషన్ ఇవ్వనున్నట్లు విశ్వసనీయ సమాచారం.
ఇప్పటి అదనపు కమిషనర్లే.. రేపటి కమిషనర్లు!
పురపాలనతో అనుసంధానమైన అన్ని విభాగాలను నూతన కార్పొరేషన్ల పాలనా సౌలభ్యం మేరకు వర్గీకరణ చేసేందుకు విభాగాల వారీగా ప్రభుత్వం బదిలీల ప్రక్రియను కూడా చేపట్టింది. అందులో భాగంగానే మంగళవారం సైబరాబాద్ పరిధిలోని కూకట్‌పల్లి, శేరిలింగంపల్లి, కుత్బుల్లాపూర్ జోన్లకు, మల్కాజిగిరి పరిధిలోని మల్కాజ్‌గిరి, ఎల్‌బీ నగర్, ఉప్పల్ జోన్లకు ప్రభుత్వం అదనపు కమిషనర్లను నియమిస్తూ ఉత్తర్వులిచ్చింది. పంచాయతీరాజ్ సంచాలకులుగా ఉన్న జి.సృజనను సైబరాబాద్ ప్రాంతంలోని మూడు జోన్లకు, నిజామాబాద్ కలెక్టర్‌గా ఉన్న టి.వినయ్ కృష్ణారెడ్డిని మల్కాజిగిరి పరిధిలోని మూడు జోన్లకు అదనపు కమిషనర్లుగా బదిలీ చేసింది. ప్రస్తుతానికి మూడు కార్పొరేషన్లు చట్టరూపం దాల్చనందున వీరిని అదనపు కమిషనర్లుగా పేర్కొన్నారు. మూడు కార్పొరేషన్లు అధికారికంగా ఏర్పాటయ్యాక.. ఈ ఇద్దరే ఆయా కార్పొరేషన్లకు కమిషనర్లుగా నియామకమవుతారని సమాచారం. ఇప్పటికే ఉన్న హైదరాబాద్ కార్పొరేషన్‌కు ప్రస్తుత కమిషనర్ కర్ణన్‌నే కొనసాగించనున్నారు.
ఫ్యూచర్ సిటీ కమిషనరేట్‌కు 30 ఎకరాలు
కోర్ అర్బన్ ప్రాంతంలో ఏర్పాటు చేసిన నాలుగో కమిషనరేట్ అయిన ఫ్యూచర్‌సిటీ కమిషనరేట్ నిర్మాణం కోసం 30 ఎకరాల స్థలం కేటాయించాలని ప్రభుత్వం నిర్ణయించింది. మంగళవారం సీఎం రేవంత్‌రెడ్డి ఆధ్వర్యంలో జరిగిన సమీక్ష సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నారు.