Share News

T Fiber Project: పల్లె బడిలో ‘ఏఐ’ పాఠాలు

ABN , Publish Date - Jul 07 , 2025 | 02:36 AM

రాష్ట్రంలోని మారుమూల అటవీ ప్రాంత ప్రజలకూ కృత్రిమమేధ అందుబాటులోకి వచ్చింది. ప్రభుత్వ పాఠశాల విద్యార్థులు పర్‌ప్లెక్సిటీ ఏఐ టూల్స్‌ ఉపయోగిస్తున్నారు..

T Fiber Project: పల్లె బడిలో ‘ఏఐ’ పాఠాలు

  • పెద్దపల్లి జిల్లా అడవి శ్రీరాంపూర్‌ పాఠశాలలో పర్‌ఫ్లెక్సిటీ ఏఐ టూల్‌ వాడుతున్న విద్యార్థులు

  • టి-ఫైబర్‌తో గ్రామంలో ఇంటింటికీ ఇంటర్‌ నెట్‌

పెద్దపల్లి, జూలై 7 (ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలోని మారుమూల అటవీ ప్రాంత ప్రజలకూ కృత్రిమమేధ అందుబాటులోకి వచ్చింది. ప్రభుత్వ పాఠశాల విద్యార్థులు పర్‌ప్లెక్సిటీ ఏఐ టూల్స్‌ ఉపయోగిస్తున్నారు!! రాష్ట్రంలో కోటి ఇళ్లకు అధిక వేగం గల ఇంటర్‌నెట్‌ సేవలను అందించేందుకు రాష్ట్ర సర్కారు చేపట్టిన ‘టి ఫైబర్‌’ ప్రాజెక్టు ద్వారా ఇది సాధ్యమైంది. రాష్ట్ర ఐటి, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు ప్రాతినిధ్యం వహిస్తున్న పెద్దపల్లి జిల్లా మంథని నియోజకవర్గం పరిఽధిలోని ముత్తారం మండలం అడవి శ్రీరాంపూర్‌, సంగారెడ్డి జిల్లా అందోల్‌, నారాయణపేట మద్దూర్‌ గ్రామాల్లో ప్రయోగాత్మకంగా ఈ ప్రాజెక్టు అమలవుతోంది. హైదరాబాద్‌కు 200 కిలోమీటర్ల దూరంలో ఉన్న అడవి శ్రీరాంపూర్‌ గ్రామంలో దాదాపు 1200 ఇళ్లు ఉండగా, 900 ఇళ్లకు టి-ఫైబర్‌ సేవలను గత ఏడాది డిసెంబరు 8న మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు వర్చువల్‌గా ప్రారంభించారు. అప్పటి నుంచి ఆ గ్రామంలో నిరంతరంగా ఇంటర్‌ నెట్‌ సేవలు అందుతున్నాయి. గ్రామంలోని జిల్లా పరిషత్‌ ఉన్నత పాఠశాలలో 8, 9, 10 తరగతుల విద్యార్థులకు టి-ఫైబర్‌ ద్వారా ఇంటర్‌ నెట్‌ పాఠాలు బోధించేందుకు గాను మూడు డిజిటల్‌ బోర్డులను, రెండు మానిటర్లను ఏర్పాటు చేశారు. వీటి ద్వారానే ఉపాధ్యాయులు పాఠాలు బోధిస్తున్నారు. అనంతరం విద్యార్థులు డిజిటల్‌ బోర్డు ద్వారా గూగుల్‌ సెర్చ్‌ చేయడంతో పాటు.. అధీకృత సమాచారం కోసం పర్‌ఫ్లెక్సిటీ ఏఐ టూల్‌ను సైతం ఉపయోగిస్తున్నారు. వాయిస్‌ మోడ్‌ ద్వారా ప్రశ్నలు అడిగి సందేహాలను నివృత్తి చేసుకుంటున్నారు. తెలంగాణ స్కూల్‌ యాప్‌ను ఉపయోగించుకుని.. పాఠాలకు సంబంధించిన ఇంటరాక్ట్‌ వీడియోలు చూస్తున్నారు.


గ్రామంలో గతంలో ఇంటర్‌నెట్‌ సిగ్నల్స్‌ తక్కువగా ఉండేవని.. టి-ఫైబర్‌ వచ్చిన తర్వాత హై స్పీడ్‌ ఇంటర్‌ నెట్‌ అందుబాటులోకి వచ్చిందని గ్రామస్థులు తెలిపారు. ఈ పాజ్రెక్టు చేపట్టాక.. చాలా మంది కేబుల్‌, డిష్‌ కనెక్షన్లను తీసివేశారు. సాఫ్ట్‌వేర్‌, ఇతరత్రా ఉద్యోగాలు చేసే వాళ్లు ఇంటికి వచ్చినప్పుడు టి-ఫైబర్‌ కనెక్షన్‌ ఉండడంతో ఇంటి నుంచే పని చేస్తున్నారు. మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు చొరవ తీసుకుని తమ గ్రామాలకు టి-ఫైబర్‌ ద్వారా సేవలను అందించడం ఎంతో ఉపయోగకరంగా ఉందని గ్రామస్థులు తెలిపారు. కాగా.. ఈ ప్రాజెక్టు కింద ఆరు నెలలుగా ఇంటర్‌ నెట్‌ సేవలను ఉచితంగానే అందిస్తున్నారు. మున్ముందు నెల నెలా బిల్లు చెల్లించే విధానాన్ని అమలు చేయనున్నారు.


ఆనందంగా ఉంది: పర్‌ప్లెక్సిటీ ఏఐ సీఈవో

మారుమూల అటవీ ప్రాంతంలో ప్రభుత్వ పాఠశాల విద్యార్థులు.. పర్‌ప్లెక్సిటీ ఏఐని వినియోగిస్తున్న వీడియోలు చూసి ఆ సంస్థ సీఈవో, సహ వ్యవస్థాపకుడు అరవింద్‌ శ్రీనివాస్‌ ఎక్స్‌ ద్వారా స్పందించారు. ‘‘భారత దేశంలో స్కూల్‌ విద్యార్థులు పర్‌ప్లెక్సిటీ.ఏఐను ట్యూటర్‌లా వాడుతూ చదువుకోవడం ఆనందంగా ఉంది. ప్రపంచ విజ్ఞానాన్ని అందరికీ చేరేలా చేయడమే మా లక్ష్యం. అది సాకారం అవుతుండడం చూసి సంతోషంగా ఉంది.’’ అన్నారు. దీనిపై మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు స్పందించారు. ‘‘గత ఆగస్టులో అరవింద్‌ శ్రీనివా్‌సను కలిశాను. రాష్ట్రంలో ఏఐ వ్యవస్థను, ఏఐ సిటీ ప్రాజెక్టును చూడమని ఆహ్వానించాను. మా ప్రభుత్వం టి-ఫైబర్‌ ద్వారా కోటికి పైగా ఇళ్లకు కనెక్టివిటీ ఇస్తోంది. హైదరాబాద్‌ సిటీకి 200 కిలోమీటర్ల దూరంలో ఉన్న అడవి శ్రీరాంపూర్‌ విద్యార్థులు సిలికాన్‌ వ్యాలీ స్థాయి టెక్నాలజీని వాడడం గొప్ప విషయం. ఇది మా విజన్‌పై నమ్మకానికి నిదర్శనం’ అని ఎక్స్‌లో పోస్టు చేశారు.


Also Read:

కేటీఆర్‌కు సామ రామ్మోహన్ రెడ్డి సవాల్..

మోదీ ప్రభుత్వం విద్వేషాలని రెచ్చగొడుతోంది.. మంత్రి పొన్నం ప్రభాకర్ ఫైర్

వందేభారత్‌కు తృటిలో తప్పిన ప్రమాదం..

For More Telangana News And Telugu News

Updated Date - Jul 07 , 2025 | 02:36 AM