Share News

Hyderabad: అందమైన భామలూ.. మిస్‌ వరల్డ్‌కు సర్వం సిద్ధం

ABN , Publish Date - May 09 , 2025 | 02:34 AM

తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా నిర్వహించనున్న మిస్‌వరల్డ్‌ పోటీలు శనివారం నుంచి ప్రారంభం కానున్నాయి. ఈ పోటీలకు అవసరమైన అన్ని ఏర్పాట్లు దాదాపుగా పూర్తయినట్లు పర్యాటక, సాంస్కృతిక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు తెలిపారు.

Hyderabad: అందమైన భామలూ.. మిస్‌ వరల్డ్‌కు సర్వం సిద్ధం

  • గచ్చిబౌలి స్టేడియంలో అన్ని ఏర్పాట్లు పూర్తి

  • రేపటి నుంచి పోటీలు ప్రారంభం

  • ఇప్పటిదాకా 109 మంది అందగత్తెల రాక

  • సామాన్యులకూ పోటీలు చూసే అవకాశం

హైదరాబాద్‌/ గచ్చిబౌలి, మే 8 (ఆంధ్రజ్యోతి): తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా నిర్వహించనున్న మిస్‌వరల్డ్‌ పోటీలు శనివారం నుంచి ప్రారంభం కానున్నాయి. ఈ పోటీలకు అవసరమైన అన్ని ఏర్పాట్లు దాదాపుగా పూర్తయినట్లు పర్యాటక, సాంస్కృతిక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు తెలిపారు. పోటీల్లో పాల్గొనేందుకు ప్రపంచ నలుమూలల నుంచి ఇప్పటికే 109 దేశాలకు చెందిన పోటీదారులు, ప్రతినిధులు, ఆహ్వానితులు హైదరాబాద్‌కు చేరుకున్నారు. మరికొంత మంది మరో రెండు రోజుల్లో వస్తారని మిస్‌ వరల్డ్‌ నిర్వాహకులు తెలిపారు. వీరికి తోడు మిస్‌ వరల్డ్‌ సంస్థ నుంచి 28 మంది నిర్వహణా ప్రతినిధులు, 17 మంది సహాయకులు వచ్చారు. కాగా, మిస్‌వరల్డ్‌ పోటీదారులు సుమారు 80 మంది గురువారం గచ్చిబౌలి స్టేడియానికి చేరుకొని రిహార్సల్స్‌ చేశారు. అందాల భామలు స్టేజ్‌పై తమ నడకలతో, నవ్వులతో, ఆకర్షణీయ కాస్ట్యూమ్స్‌తో రిహార్సల్స్‌తో అలరించారు.


ఓల్డ్‌ సిటీలో హెరిటేజ్‌ వాక్‌...

హైదరాబాద్‌ నగర సాంస్కృతిక వైభవాన్ని, వైవిధ్యాన్ని చారిత్రక ప్రాముఖ్యతను ప్రపంచానికి తెలియజేసే లక్ష్యంతో మిస్‌ వరల్డ్‌ పోటీదారులతో మే 13న చార్మినార్‌ వద్ద హెరిటేజ్‌ వాక్‌ను నిర్వహించనున్నారు. చార్మినార్‌కు పశ్చిమభాగంలో విస్తరించిన లాడ్‌బజార్‌లో సంప్రదాయ లక్కగాజులు ఇతర కళాత్మక వస్తు సామగ్రిని ఉత్పత్తి చేసి విక్రయించే స్థానిక కళాకారులతో మిస్‌ వరల్డ్‌ పోటీదారులు సంభాషించనున్నారు. ఈ హెరిటేజ్‌ వాక్‌ కార్యక్రమం నుమారు 150కి పైగా దేశాల్లో ప్రత్యక్ష ప్రసారం కానుంది. ఈ సందర్భంగా చారిత్రక చార్మినార్‌ కట్టడం, లాడ్‌ బజార్‌ ప్రత్యేకతలను వివరించి వరల్డ్‌ టూరిస్ట్‌ డెస్టినేషన్‌ స్పాట్‌గా ప్రమోట్‌ చేయనున్నారు. కాగా, ప్రకృతి, పర్యావరణ పరంగా అన్ని హంగులు ఉన్న తెలంగాణను పర్యాటక రంగంలో ముందు వరుసలో నిలిపే లక్ష్యంతో ‘తెలంగాణ- జరూర్‌ ఆనా..’ నినాదాన్ని విసృత స్థాయిలో ప్రపంచవ్యాప్తం చేయాలని ప్రభుత్వం భావిస్తోంది. దీంతో పర్యాటకరంగం పెరగటం, పెట్టుబడుల సాధన, ఉద్యోగ ఉపాధి అవకాశాలు మెరుగుపడతాయని ఆశిస్తోంది. మే 31 వరకు కొనసాగే మిస్‌వరల్డ్‌ కార్యక్రమాల్లో సాధారణ ప్రజలను కూడా పరిమిత సంఖ్యలో భాగస్వామ్యం చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తోంది. టూరిజం వెబ్‌సైట్‌లో రిజిస్టర్‌ (https://tourism.telangana.gov.in/event ssingle/missworldevent) చేసుకున్న వారికి ఐదు కేంద్రాల్లో వేయి మంది చొప్పున మొత్తం ఐదువేల మందికి మిస్‌ వరల్డ్‌ పోటీలను వీక్షించే అవకాశం కల్పించాలని ప్రభుత్వం భావిస్తోంది.


కట్టుదిట్టమైన భద్రత

మిస్‌ వరల్డ్‌ పోటీలకు కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేసినట్లు సైబరాబాద్‌ జాయింట్‌ సీపీ గజరావ్‌ భూపాల్‌ తెలిపారు. గురువారం ఆయన ‘ఏబీఎన్‌ ఆంధ్రజ్యోతి’తో మాట్లాడుతూ, హైదరాబాద్‌లో మిస్‌ వరల్డ్‌ పోటీదారులు బస చేస్తున్న హోటళ్ల వద్ద పటిష్ఠ బందోబస్తు ఏర్పాటు చేసినట్లు వెల్లడించారు. ముఖ్యంగా ఎక్కువ మంది బస చేస్తున్న ట్రిడెంట్‌ హోటల్‌ వద్ద నాలుగంచెల భద్రత ఏర్పాటు చేసినట్లు తెలిపారు. వీవీఐపీ కేటగిరీని బట్టి వారు బస చేస్తున్న పరిసరాలను గ్రీన్‌జోన్‌, రెడ్‌ జోన్‌గా విభజించామని చెప్పారు. మిస్‌ వరల్డ్‌ పోటీలకు వివిధ దేశాలకు చెంది న అతిథులతో పాటు, దేశంలో సినీ ఇండస్ట్రీకి చెందిన పలువురు సెలబ్రెటీలు అధిక సంఖ్యలో హాజరయ్యే అవకాశం ఉందన్నారు. సైబరాబాద్‌ కమిషనరేట్‌ పరిఽధిలో ఎలాంటి ట్రాఫిక్‌ మళ్లింపులు ఉండవని ప్రజలకు ఇబ్బందులు కలగకుండా జాగ్రత్తలు తీసుకున్నట్లు తెలిపారు.


ఈ వార్తలు కూడా చదవండి..

నూతన మేయర్‌గా కోవెలమూడి రవీంద్ర ఎన్నిక

హరి‌రామ్‌ బ్యాంక్ లాకర్లను ఓపెన్ చేయనున్న ఏసీబీ అధికారులు...

విద్యుత్ అధికారుల నిర్లక్ష్యంతో నిండు ప్రాణం బలి

For More AP News and Telugu News

Updated Date - May 09 , 2025 | 02:34 AM