Telangana: సర్పంచ్‌గా గెలుపు.. కోతులు పరార్..!
ABN , Publish Date - Dec 16 , 2025 | 08:22 PM
గ్రామ పంచాయితీ ఎన్నికలంటే ఎన్నో చిత్ర విచిత్రాలు ఉంటాయి. ప్రజలను తమవైపు తిప్పుకునేందుకు ఒక్కో అభ్యర్థి ఒక్కో రకమైన హామీ ఇస్తుంటారు. కొందరు ప్రజల అవసరాలను గుర్తించి హామీలిస్తే.. మరికొందరు డబ్బులు, మద్యంతో..
రాజన్న సిరిసిల్ల, డిసెంబర్ 16: గ్రామ పంచాయితీ ఎన్నికలంటే ఎన్నో చిత్ర విచిత్రాలు ఉంటాయి. ప్రజలను తమవైపు తిప్పుకునేందుకు ఒక్కో అభ్యర్థి ఒక్కో రకమైన హామీ ఇస్తుంటారు. కొందరు ప్రజల అవసరాలను గుర్తించి హామీలిస్తే.. మరికొందరు డబ్బులు, మద్యంతో ఆకర్షించే ప్రయత్నం చేస్తారు. ఏదేమైనా గెలుపే లక్ష్యంగా అభ్యర్థులు విశ్వ ప్రయత్నాలు చేస్తుంటారు. మరి, ఎన్నికల్లో గెలిచాక సదరు అభ్యర్థి తాము ఇచ్చిన హామీలను నెరవేరుస్తారా? అంటే చెప్పలేం. కొందరు నెరవేరుస్తారు. ఇంకొందరు దాటవేస్తారు. కానీ, ఇప్పుడు మనం చెప్పుకోబోయే వ్యక్తి మాత్రం పూర్తి విభిన్నమనే చెప్పాలి. ఎందుకంటే.. ఆ ఊర్లో సర్పంచ్ ఎన్నిక ముగియడం, ఆ ఎన్నికల్లో సదరు అభ్యర్థి గెలుపొందడమే ఆలస్యం.. మరుసటి రోజు నుంచే తాను ఇచ్చిన హామీని అమలు చేసేందుకు నడుం బిగించారు. అవును, ప్రజలకు ఎంతో ఉపయుక్తమైన ఆ పనని ఆలస్యం చేయొద్దని భావించిన నూతన సర్పంచ్.. వెంటనే వర్క్ స్టార్ట్ చేశారు. ఇంతకీ ఎన్నికల్లో వారు ఇచ్చిన హామీ ఏంటి.. గెలిచిన తరువాత ఏం పని మొదలు పెట్టారు. పూర్తి వివరాలు ఇప్పుడు చూద్దాం..
రాజన్న సిరిసిల్ల జిల్లా కందికట్కూర్ గ్రామానికి ఇటీవల సర్పంచ్ ఎన్నికలు జరిగాయి. ఈ ఎన్నికల్లో సర్పంచ్ అభ్యర్థిగా పోటీకి దిగిన చింతలపల్లి విజయమ్మ.. పలు హామీలు ఇచ్చారు. ముఖ్యంగా.. గ్రామంలో కోతుల బెడద ఎక్కువగా ఉండటంతో తాను గెలిస్తే తక్షణమే కోతుల నివారణకు చర్యలు తీసుకుంటానని హామీ ఇచ్చారు. గ్రామ ప్రజలు ఆమెకు భారీగా ఓట్లు వేయడంతో.. ఆమె సర్పంచ్‌గా ఎన్నికయ్యారు. అయితే, ఆమె ప్రమాణ స్వీకారం చేయకముందే సర్పంచ్‌గా చేయాల్సిన పనులను ప్రారంభించారు.
ముందుగా తాను హామీ ఇచ్చిన కోతుల అంశంపై కార్యాచరణ ప్రారంభించారు. గ్రామంలో కోతుల బెడద నివారణకు తక్షణ చర్యలు చేపట్టారు. నల్లగొండ జిల్లా సూర్యాపేట నుంచి కోతులు పట్టేవారిని రప్పించి ఒక్కరోజే 113 కోతులను బంధించారు. ఒక్కో కోతిని పట్టుకునేందుకు రూ. 500 చొప్పున చెల్లిస్తున్నారు సర్పంచ్ విజయమ్మ. గ్రామంలో ఉన్న కోతులన్నింటినీ బంధించి అడవికి తరలిస్తామని సర్పంచ్ వెల్లడించారు. ఎన్నికల్లో హామీ ఇవ్వడమే కాకుండా.. గెలిచిన వెంటనే ఆ హామీని నిలబెట్టుకోవడంతో గ్రామ ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
Also Read:
అంతర్జాతీయ వేదికపై తెన్నేటి సుధాదేవికి ఘన నివాళి..
కానిస్టేబుల్ పరీక్షల్లో అర్హత సాధించిన అభ్యర్థులపై సీఎం ప్రశంసలు