Tallapalli Srija: సంగారెడ్డి జిల్లా తాళ్లపాల్లిలో 'శ్రీజ' హాట్ టాపిక్.. ఒకే రోజు వింత సంఘటనలు
ABN , Publish Date - Nov 30 , 2025 | 04:28 PM
సర్పంచి పదవికి శ్రీజ అనే ఒక యువతి నామినేషన్ వేయడం, తల్లిదండ్రులు వద్దంటూ ఒత్తిడి చేయడం, ఆ వెంటనే శ్రీజ ప్రేమ పెళ్లి చేసుకోవడం, పోలీసుల ముందు హాజరై తననెవరూ కిడ్నాప్ చేయలేదని చెప్పడం.. రాజకీయ మద్దతు. ఇలా.. సంగారెడ్డి జిల్లా తాళ్లపల్లిలో ఒక్క రోజులో సంచలనాలు
తాళ్లపల్లి, నవంబర్ 30: సంగారెడ్డి జిల్లా, హత్నూర మండలం, తాళ్లపల్లి గ్రామంలో ఒక వింత సంఘటన చోటుచేసుకుంది. ఆ గ్రామ సర్పంచ్ పదవి ఎస్సీ మహిళా రిజర్వేషన్‌లో ఉంది. నిన్న (శనివారం) మధ్యాహ్నం ఆ పదవికి అభ్యర్థిగా శ్రీజ అనే యువతి నామినేషన్ వేశారు. అయితే, కథ ఇక్కడ రకరకాల మలుపులు తీసుకుంది. నామినేషన్ వేసిన కొద్ది గంటల్లోనే శ్రీజ తల్లిదండ్రులు ఆమెను పోటీ నుంచి తప్పుకోవాలంటూ ఒత్తిడి తెచ్చారు.

దాంతో శ్రీజ సంచలన నిర్ణయం తీసుకుంది. అదే రాత్రి యాదగిరిగుట్టలో తాను కొన్నేళ్లుగా ప్రేమిస్తున్న చంద్రశేఖర్ గౌడ్‌ను వివాహం చేసుకుంది. తల్లిదండ్రులు మాత్రం మా అమ్మాయిని కిడ్నాప్ చేశారంటూ సంగారెడ్డి రూరల్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. కానీ శ్రీజ స్వయంగా పోలీసుల ముందు హాజరై తనను ఎవరూ కిడ్నాప్ చేయలేదని, ఇష్టపూర్వకంగానే ప్రేమ వివాహం చేసుకున్నానని స్పష్టం చేసింది.
ఈ విషయం తెలిసి సంగారెడ్డి ఎమ్మెల్యే, బీఆర్ఎస్ నాయకుడు చింతా ప్రభాకర్, పార్టీ ఇతర నేతలు శ్రీజకు మద్దతుగా పోలీస్ స్టేషన్‌కు చేరుకున్నారు. ఇప్పుడు మరింత ధీమాగా ఉన్న శ్రీజ.. తన భర్త చంద్రశేఖర్ గౌడ్ పూర్తి మద్దతుతో సర్పంచ్ ఎన్నికల్లో గెలిచి చూపిస్తానని చెబుతున్నారు.
ఇవి కూడా చదవండి..
బీఎల్ఓల పరిహారం రెట్టింపు.. ఈసీ నిర్ణయం
రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ అధ్యక్షతన అఖిల పక్షం భేటీ..
మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి