Share News

Telangana Rising Global Summit: దావోస్‌ తరహాలో..దద్దరిల్లేలా!

ABN , Publish Date - Dec 08 , 2025 | 04:44 AM

తెలంగాణలో ఉన్న అపార అవకాశాలను ప్రపంచానికి పరిచయం చేసి.. పెట్టుబడులను ఆకర్షించడం, యువతకు ఉపాధి కల్పించడమే లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్ఠాత్మకంగా నిర్వహిస్తున్న తెలంగాణ గ్లోబల్‌ సమ్మిట్‌కు సర్వం సిద్ధమైంది.......

Telangana Rising Global Summit: దావోస్‌ తరహాలో..దద్దరిల్లేలా!

ప్రపంచ ఆర్థిక సదస్సుగా తెలంగాణ రైజింగ్‌ గ్లోబల్‌ సమ్మిట్‌

అంతర్జాతీయ సదస్సుకు సిద్ధమైన ఫ్యూచర్‌ సిటీ

పూర్తయిన ఏర్పాట్లు.. విజయవంతంగా ‘డ్రై రన్‌’

సమ్మిట్‌కు హాజరుకానున్న 44 దేశాల ప్రతినిధులు

నేటి మధ్యాహ్నం ప్రారంభించనున్న గవర్నర్‌

సర్వాంగసుందరంగా సమ్మిట్‌ ప్రాంగణం ముస్తాబు

ప్రాంగణంలో తెలంగాణ తల్లి విగ్రహం ఏర్పాటు

ఆకట్టుకోనున్న డ్రోన్‌షో, సాంస్కృతిక కార్యక్రమాలు

కట్టుదిట్టమైన భద్రత నడుమ సదస్సు

హైదరాబాద్‌/ రంగారెడ్డి జిల్లా ప్రతినిధి, డిసెంబరు 7 (ఆంధ్రజ్యోతి): తెలంగాణలో ఉన్న అపార అవకాశాలను ప్రపంచానికి పరిచయం చేసి.. పెట్టుబడులను ఆకర్షించడం, యువతకు ఉపాధి కల్పించడమే లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్ఠాత్మకంగా నిర్వహిస్తున్న తెలంగాణ గ్లోబల్‌ సమ్మిట్‌కు సర్వం సిద్ధమైంది. స్విట్జర్లాండ్‌లోని చిన్న పట్టణమైన దావోస్‌.. ఐదు దశాబ్దాలుగా ప్రపంచ ఆర్థిక సదస్సు నిర్వహిస్తూ ప్రపంచ ఖ్యాతి పొందినట్లుగానే తెలంగాణలోనూ ఆ స్థాయి సదస్సును నిర్వహించాలన్న ప్రభుత్వ సంకల్పం సోమవారం కార్యరూపం దాల్చనుంది. ఫ్యూచర్‌ సిటీలో రెండు రోజులపాటు జరిగే తెలంగాణ రైజింగ్‌ సమ్మిట్‌లో 44 దేశాల నుంచి పారిశ్రామిక దిగ్గజాలు పాల్గొంటున్నారు. ఇందుకోసం భారత్‌ ఫ్యూచర్‌ సిటీలో ఏర్పాట్లను ప్రభుత్వం అత్యంత అద్భుతంగా చేసింది. ఆదివారం మధ్యాహ్నం డ్రై రన్‌ను విజయవంతంగా నిర్వహించారు. ఈ సదస్సుకు 154 మంది అంతర్జాతీయ ప్రతినిధులు హాజరవుతున్నారు. విశ్వవ్యాప్తంగా పేరున్న కంపెనీల నుంచి యాజమాన్య ప్రతినిధుల బృందాలు ఈ సమ్మిట్‌లో పాల్గొంటున్నాయి. ఒక్క అమెరికా నుంచే 46 మంది వివిధ కంపెనీల ప్రతినిధులు తరలివస్తున్నారు.

ప్రారంభించనున్న గవర్నర్‌

రాష్ట్ర గవర్నర్‌ జిష్ణుదేవ్‌ వర్మ సోమవారం మధ్నాహ్నం 1.30 గంటలకు లాంఛనంగా సమ్మిట్‌ను ప్రారంభిస్తారు. సుమారు 2వేల మంది దేశ విదేశీ అతిథులు ప్రారంభ వేడుకకు హాజరవుతున్నారు. ఇందులో వివిధ అంశాలపై నోబెల్‌ బహుమతి గ్రహీత అభిజిత్‌ బెనర్జీ, ట్రంప్‌ మీడియా-టెక్నాలజీ గ్రూప్‌ సీఈవో ఎరిక్‌ స్వైడర్‌, వరల్డ్‌ ఎకనామిక్‌ ఫోరమ్‌ సీఈవో జెరెమీ జుర్గెన్స్‌, నోబెల్‌ శాంతి బహుమతి గ్రహీత కైలాష్‌ సత్యార్థి, బయోకాన్‌ లిమిటెడ్‌ ఎగ్జిక్యూటివ్‌ చైర్‌పర్సన్‌ కిరణ్‌ మజుందార్‌ షా తదితరులు ప్రసంగించనున్నారు. మధ్యాహ్నం 2.30 గంటలకు సీఎం రేవంత్‌ రెడ్డి ప్రసంగిస్తారు. తెలంగాణలో ప్రజాపాలన, పెట్టుబడుల అవకాశాలు, ప్రభుత్వ సహకారం, విజన్‌2047 డాక్యుమెంట్‌ లక్ష్యాలు, ఫ్యూచర్‌ సిటీపై ముఖ్యమంత్రి ఆహూతులకు వివరిస్తారు. రెండు రోజుల్లో మొత్తం 27అంశాలపై సెషన్లు జరుగుతాయి.


సుందరంగా ముస్తాబు

గ్లోబల్‌ సమ్మిట్‌ వేదికను అత్యంత ఆకర్షణీయంగా, ఇతర ప్రాంగణాలను అన్ని వసతులతో ఆకట్టుకునేలా ఏర్పాటు చేశారు. ప్రాంగణం బయట ప్రాంతమంతా పచ్చదనంతో కళకళలాడుతోంది. ప్రాంగణం మధ్య భాగంలో రకరకాల పూలమొక్కలు, ఆలంకరణ మొక్కలు ఆకట్టుకుంటున్నాయి. ఈ సమ్మిట్‌ ప్రాంగణం ఎక్కడి నుంచి చూసినా విద్యుత్‌ కాంతుల మద్య దేదీప్యమానంగా వెలిగిపోతోంది. సమ్మిట్‌కు వచ్చే అన్ని ప్రధాన రహదారుల వెంట స్వాగత తోరణాలు ఏర్పాటు చేశారు. ఇందులో చాలా వరకు డిజిటల్‌ తెరలే ఉన్నాయి. దాదాపు సమ్మిట్‌ జరిగే ప్రాంతాన్నంతా డిజిటల్‌ మయంగా మార్చేశారు. సమ్మిట్‌ జరిగే ప్రాంగణంతోపాటు బయట భారీ డిజిటల్‌ స్ర్కీన్లు ఏర్పాటు చేశారు. మూడు వైపులా డిజిటల్‌ తెరల్లో రాష్ట్ర ప్రభుత్వ ప్రగతి చిత్రాలు ప్రదర్శిస్తూ.. డిజిటల్‌ టన్నెల్‌ను ఏర్పాటు చేశారు.

విమానాశ్రయం నుంచే ప్రచారం..

సమ్మిట్‌కు హాజరయ్యే దేశ విదేశీ పారిశ్రామికవేత్తలకు హైదరాబాద్‌తోపాటు తెలంగాణ ప్రత్యేకతలు తెలిసేలా, పెట్టుబడుల అవకాశాలు వివరించేలా ప్రచార సామగ్రిని సిద్ధం చేశారు. ఎయిర్‌ పోర్టు నుంచి ఫ్యూచర్‌ సిటీలో వేదిక వరకు వివిధ రూపాల్లో వీటి ప్రదర్శన ఉంటుంది. అలాగే హైదరాబాద్‌ వ్యాప్తంగా అత్యాధునిక టెక్నాలజీతో ప్రత్యేకంగా ప్రచార ఏర్పాట్లు జరిగాయి. లైటింగ్‌ ప్రొజెక్షన్‌, 3డీ ప్రొజెక్షన్‌ మ్యాపింగ్‌, ఎయిర్‌ పోర్టు అప్రోచ్‌ రోడ్‌ లో ఎల్‌ఈడీ స్ర్కీన్లతో ఈ విభిన్న ప్రదర్శనలు ఉంటాయి. సోమవారం మద్యాహ్నం చర్చల తర్వాత ప్రముఖ సంగీత దర్శకుడు కీరవాణి సంగీత కచేరి అతిథులను అలరించనుంది. అలాగే తెలంగాణ ప్రత్యేక నృత్య రూపాలైన కొమ్ము కోయ, బంజారా, కోలాటం, గుస్సాడీ, ఒగ్గు డోలు, పేరిణి నాట్యం, బోనాల ప్రదర్శనతో సాంస్కృతిక కార్యక్రమాల ప్రదర్శన ఉంటుంది.


అతిథులందరికీ బహుమతులు..

నాగార్జునసాగర్‌లోని ప్రపంచంలోనే అతిపెద్ద వారసత్వ బౌద్థ థీమ్‌ పార్కు అయిన బుద్దవనం పర్యటనకు దౌత్య బృందం వెళ్లేలా పర్యాటక శాఖ ప్రత్యేక ఏర్పాట్లు చేసింది. ఇక అతిథులకు తెలంగాణ పర్యటన ఎప్పటికీ గుర్తుండిపోయేలా గ్లోబల్‌ సమ్మిట్‌ డెలిగేట్లకు ప్రత్యేక సావనీర్లతో కూడిన బహుమతిని ప్రభుత్వం తరఫున అందించనున్నారు. తెలంగాణ రైజింగ్‌ గ్లోబల్‌ సమ్మిట్‌ లోగోతోపాటు పోచంపల్లి ఇక్కత్‌ శాలువా, చేర్యాల కళాకృతులు, హైదరాబాదీ అత్తర్‌, ముత్యాలతో కూడిన నగలను ఈ సావనీర్‌లో పొందుపరుస్తారు.

తరలిరానున్న సినీ క్రీడా ప్రముఖులు..

గ్లోబల్‌ సమ్మిట్‌లో రెండు రోజులపాటు మొత్తం 27 ప్రత్యేక ప్యానల్‌ చర్చలు జరుగుతాయి. విద్యుత్తు, కాలుష్య రహిత రవాణా (గ్రీన్‌ మొబిలిటీ), ఐటీ, సెమీ కండక్టర్లు, విద్య, ఆరోగ్యం, పర్యాటకం, పట్టణ మౌలిక వసతుల కల్పన, వ్యవసాయం, పరిశ్రమలు, మహిళా వ్యాపారవేత్తల ప్రోత్సాహం, గిగ్‌ ఎకానమీ, సామాజిక సంక్షేమం, స్టార్ట్‌పలు వంటి విభిన్న రంగాలపై చర్చలు ఉంటాయి. ప్రపంచ ఆరోగ్య సంస్థ, ప్రపంచ బ్యాంకు, ఏషియన్‌ డెవల్‌పమెంట్‌ బ్యాంక్‌, యూనిసెఫ్‌ ప్రతినిధులతో అనేక అంతర్జాతీయ, జాతీయ దిగ్గజ పారిశ్రామికవేత్తలు పాల్గొంటున్నారు. పీవీ సింధు, అనిల్‌ కుంబ్లే, పుల్లెల గోపీచంద్‌, గగన్‌ నారంగ్‌, జ్వాలా గుత్తా వంటి క్రీడా ప్రముఖులు ‘ఒలింపిక్‌ గోల్డ్‌ క్వెస్ట్‌’ సెషన్‌లో పాల్గొంటారు. ఆస్కార్‌ విజేత గుణీత్‌ మోంగా, ప్రముఖ సినీ దర్శకులు రాజమౌళి, సుకుమార్‌, బాలీవుడ్‌ నటుడు రితేష్‌ దేశ్‌ముఖ్‌, సినీ విమర్శకురాలు అనుపమా చోప్రా వంటివారు చర్చలో పాల్గొంటారు. దావో్‌సలో ప్రతి ఏటా జరిగే ప్రపంచ ఆర్థిక సదస్సు తరహాలో ఈ సదస్సు జరగాలని ముఖ్యమంత్రి భావిస్తున్నారు. ఈ మేరకు ఏర్పాట్లను నిరంతరం స్వయంగా సమీక్షిస్తున్నారు.


తెలంగాణ తల్లి విగ్రహం ఏర్పాటు..

సమ్మిట్‌ ప్రధాన ప్రాంగణంలో తెల్లంగాణ తల్లి విగ్రహాన్ని ఏర్పాటు చేశారు. ప్రాంగణం మధ్యలో త్రీడీలో తెలంగాణ తల్లి చిత్రం కనిపించేలా డిజిటల్‌ తెర ఏర్పాటు చేశారు. సమ్మిట్‌లో ఆహుతులను ఆకర్షించేందుకు పలు సాంస్కృతిక కార్యక్రమాల ఏర్పాటు చేస్తున్నారు, వీటికి సంబంధించిన రిహార్సల్స్‌ ఆదివారం రాత్రి జరిగాయి. అతిథులకు స్వాగతం పలికేందుకు ఏర్పాటు చేసిన రోబోలతో కూడా రిహార్సల్‌ నిర్వహించారు. అతిథులను ఆకర్షించేందుకు రికార్డు స్థాయిలో 3వేల డ్రోన్లతో డ్రోన్‌షో నిర్వహించేందుకు ఏర్పాట్లు చేశారు. మరోవైపు సమ్మిట్‌లో ఏర్పాటు చేసిన ఎగ్జిబిషన్‌ స్టాళ్లు ఆకట్టుకుంటున్నాయి. గ్రీనరీతో ఏర్పాటు చేసిన నెట్‌ జీరో కేంద్రం అందరినీ ఆకర్షిస్తోంది. ఇందిరా మహిళాశక్తి, స్పోర్ట్స్‌ అథారిటీ ఆఫ్‌ తెలంగాణ, తెలంగాణ పర్యాటక శాఖ తదితర శాఖలకు చెందిన స్టాళ్లు అలరిస్తున్నాయి. ఇక సమ్మిట్‌కు ప్రభుత్వం కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేసింది. దాదాపు 10 వేల మందితో మూడంచెల భద్రత కల్పిస్తోంది. ఆదివారం సాయంత్రం పోలీసు బలగాలు సమ్మిట్‌ ప్రాంగణాన్ని అధీనంలోకి తీసుకున్నాయి. బ్లాక్‌ క్యాట్‌ కమాండోలు, ఆక్టోపస్‌, గ్రేహౌండ్స్‌ బలగాలు సమ్మిట్‌ లోపల, బయట పహారా కాస్తున్నాయి. డాగ్‌ స్క్వాడ్‌ బృందాలు అణువణువునా తనిఖీలు చేస్తున్నాయి. పోలీసులు ఆదివారం ట్రయల్‌ రన్‌ నిర్వహించారు.

4.jpg2.jpg6.jpg3.jpg5.jpg

Updated Date - Dec 08 , 2025 | 06:08 AM