Share News

Registration: రిజిస్ట్రేషన్ల ఆదాయం కుదేలు!

ABN , Publish Date - Feb 04 , 2025 | 04:12 AM

రాష్ట్రంలో రిజిస్ట్రేషన్ల ఆదాయం కుదేలైంది. ఈ ఆర్థిక సంవత్సర లక్ష్యానికి ఆమడదూరంలో ఉంది. గత ఏడాది రాబడిని అందుకోవడమూ కష్టంగానే కనిపిస్తోంది. పది నెలల కాలాన్ని పరిశీలిస్తే ఇది స్పష్టమవుతోంది.

Registration: రిజిస్ట్రేషన్ల ఆదాయం కుదేలు!

18,229 కోట్లు

ఈ ఆర్థిక సంవత్సర లక్ష్యం

11,600 కోట్లు

పది నెలల్లో వచ్చింది

340 కోట్లు

నిరుటి కంటే తక్కువ

  • టార్గెట్‌ చేరాలంటే రెండు నెలల్లో రూ.6,629 కోట్లు రావాలి

  • ప్రస్తుతం సగటు రాబడి రూ.1,160 కోట్లు మాత్రమే

  • నిరుటి ఆదాయం రూ.14,588 కోట్లు చేరడమూ కష్టమే!

  • ఫిబ్రవరి, మార్చిలో 1700 కోట్లు రాబట్టడంపై అధికారుల దృష్టి

  • తద్వారా గత ఏడాది కంటే తగ్గకుండా చూసే ప్రయత్నం

  • ఆశలన్నీ భూ క్రమబద్ధీకరణ దరఖాస్తులపైనే!

హైదరాబాద్‌, ఫిబ్రవరి 3(ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలో రిజిస్ట్రేషన్ల ఆదాయం కుదేలైంది. ఈ ఆర్థిక సంవత్సర లక్ష్యానికి ఆమడదూరంలో ఉంది. గత ఏడాది రాబడిని అందుకోవడమూ కష్టంగానే కనిపిస్తోంది. పది నెలల కాలాన్ని పరిశీలిస్తే ఇది స్పష్టమవుతోంది. 2024-25కు గాను లక్ష్యం రూ.18,229 కోట్లు కాగా.. ఏప్రిల్‌-జనవరి మధ్య వచ్చింది కేవలం రూ.11,600 కోట్లే కావడం గమనార్హం. 2023-24 ఆర్థిక సంవత్సరంలో ఏప్రిల్‌ -జనవరి ఆదాయంతో పోల్చి చూస్తే ఇది రూ.340 కోట్లు తక్కువ. దీంతోనే ఈసారి అంచనాలను చేరడం సాధ్యం కాదని అర్థమవుతోంది. ఇక 2023-24లో రిజిస్ట్రేషన్ల ద్వారా రూ.14,588 కోట్లు రాగా.. దీనిని 22 శాతం (రూ.18,229 కోట్లకు) పెంచుతూ 2024-25కు లక్ష్యాన్ని నిర్దేశించారు. అయితే, అనుకున్నదొక్కటి అయింది ఒక్కటి తీరున.. రియల్‌ ఎస్టేట్‌ జోరు తగ్గడంతో రాబడి సమకూరే పరిస్థితి లేకుండా పోయింది. ఈ నేపథ్యంలో కనీసం నిరుటి ఆదాయానికి తగ్గకుండా అయినా చూడాలని ప్రత్యేక దృష్టిసారించారు.


ఫిబ్రవరి, మార్చిలో నెలకు రూ.1,700 కోట్ల చొప్పున రూ.3,400 కోట్లు రాబట్టాలని భావిస్తున్నారు. కాగా, 2024-25 ఆర్థిక సంవత్సరానికి ప్రభుత్వం నిర్దేశించిన లక్ష్యం రూ.18,299 కోట్లు. ఈ మొత్తం రావాలంటే రెండు నెలల్లో రూ.6,629 కోట్లు ఆర్జించాలి. అంటే నెలకు రూ.3,314 కోట్లు. కానీ, గత పది నెలల సగటు చూస్తే నెలకు రూ.1,160 కోట్లు మాత్రమే. దీన్నిబట్టి ఇప్పుడున్న పరిస్థితుల్లో అసలు టార్గెట్‌ చేరడం అసాధ్యమని తేలిపోతోంది. అందుకనే నెలకు కనీసం రూ.1700 కోట్ల చొప్పున అయినా రాబట్టాలని రిజిస్ట్రేషన్ల శాఖ అధికారులు కసరత్తు చేస్తున్నారు. 2023-24 ఆర్థిక సంవత్సరం ఆదాయం రూ.14,588 కోట్లను చేరాలన్నా మిగిలిన రెండు నెలల్లో రూ.2,988 కోట్లు రావాలి. అయితే, గత ఏడాది ఏప్రిల్‌-జనవరి కాలంలో ఆదాయం రూ.11,940 కోట్లు ఉంది. ఇందులో జనవరిలోనే రూ.1,061 కోట్లు వచ్చాయి. 2024-25లో ఏప్రిల్‌-జనవరి మధ్య రాబడి రూ.11,600 కోట్లు. కానీ, జనవరిలో ఆదాయం తగ్గి.. రూ.980 కోట్లే వచ్చాయి.


  • లే అవుట్‌ క్రమబద్ధీకరణ పథకం (ఎల్‌ఆర్‌ఎస్‌) కింద 2020లో వచ్చిన దర ఖాస్తులపై ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకున్నా ఆరు నెలల నుంచి పురోగతి అంతంతమాత్రమే. దీన్ని సద్వినియోగం చేసుకుని ఆదాయం పెంచుకోవాలని రిజిస్ట్రేషన్ల శాఖ ప్రణాళికలను సిద్ధం చేస్తోంది. గత ఏడాదికి మించి రాబడి రాబట్టుకునేందుకు ఈ రెండు నెలల్లో ఉన్న ఏకైక మార్గం ఎల్‌ఆర్‌ఎస్‌. అందుకని ప్రత్యేక డ్రైవ్‌ నిర్వహించి ఎక్కువ దరఖాస్తులను పరిష్కరిస్తే రిజిస్ట్రేషన్లు పెరిగే అవకాశం ఉంటుందనే భావనలో అధికారులు ఉన్నారు. పంచాయతీలు, మున్సిపాలిటీలు, కార్పొరేషన్ల నుంచి దాదాపు 25.70 లక్షల మంది ఎల్‌ఆర్‌ఎస్‌ దరఖాస్తు చేసుకున్నారు. హెచ్‌ఎండీఏ పరిధిలో 3.58 లక్షలు, జీహెచ్‌ఎంసీలో 1.06 లక్షలు, కార్పొరేషన్లు, మున్సిపాలిటీల నుంచి 13.69 లక్షలు, పంచాయతీల నుంచి 6 లక్షలు, అర్బన్‌ డెవల్‌పమెంట్‌ అథారిటీల నుంచి 1.35 లక్షల దరఖాస్తులు అందాయి. వీటి పరిష్కారం ఊపందుకుంటే ఆదాయం పెరిగే అవకాశాలు లేకపోలేదు.

  • ఏప్రిల్‌ నుంచి కొత్త మార్కెట్‌ విలువలు వచ్చే అవకాశం ఉండడంతో ఫిబ్రవరి, మార్చిలో రిజిస్ట్రేషన్లు పెరుగుతాయని అధికారులు చెబుతున్నారు. గృహ రుణాలు, వాణిజ్య ఒప్పందాల రిజిస్ట్రేషన్లను ప్రోత్సహించే విధానాలు అమలు చేయడంపై ఆలోచనలు చేస్తున్నారు. మార్కెట్‌ విలువలను సమీక్షించి తక్కువగా ఉన్నచోట్ల సవరించడం, ఎక్కువగా ఉన్నదగ్గర హేతుబద్ధీకరణ ద్వారా రిజిస్ట్రేషన్లు పెరిగేలా చూడాలనే ఉద్దేశంలో ఉన్నారు.


ఇవి కూడా చదవండి..

KTR: రాష్ట్రంలో ఉప ఎన్నికలకు సిద్ధంగా ఉండాలి.. వేటు తప్పదా..


Gun Firing Case: రూ.333 కోట్లు.. వంద మంది యువతులే టార్గెట్.. వెలుగులోకి ప్రభాకర్ నేరాలు

Supreme Court: తెలంగాణ ఎమ్మెల్యేల అనర్హత కేసు.. సుప్రీంకు కేటీఆర్

Read Latest Telangana News And Telugu News

Updated Date - Feb 04 , 2025 | 04:12 AM