Share News

జూలైలోనే ‘స్థానిక’ సమరం!

ABN , Publish Date - May 30 , 2025 | 04:18 AM

రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికలకు రంగం సిద్ధమవుతోంది. జూలైలోనే గ్రామ పంచాయతీ, ఎంపీటీసీ, జడ్పీటీసీ, మునిసిపాలిటీ ఎన్నికలను నిర్వహించాలని రాష్ట్ర ప్రభుత్వం ప్రాథమికంగా నిర్ణయించింది.

జూలైలోనే ‘స్థానిక’ సమరం!

  • ఎన్నికలకు రంగం సిద్ధం

  • జూన్‌ చివర్లో నోటిఫికేషన్‌!

  • ఆగస్టు రెండో వారం నాటికి ప్రక్రియ పూర్తికి యోచన

హైదరాబాద్‌, మే 29 (ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికలకు రంగం సిద్ధమవుతోంది. జూలైలోనే గ్రామ పంచాయతీ, ఎంపీటీసీ, జడ్పీటీసీ, మునిసిపాలిటీ ఎన్నికలను నిర్వహించాలని రాష్ట్ర ప్రభుత్వం ప్రాథమికంగా నిర్ణయించింది. జూన్‌ చివరివారంలో నోటిఫికేషన్‌ విడుదల చేసేందుకు ఏర్పాట్లు జరుగుతున్నట్లు విశ్వసనీయంగా తెలిసింది. ఆగస్టు రెండో వారం నాటికి ఎన్నికల ప్రక్రియను పూర్తిచేయాలని భావిస్తున్నట్లు సమాచారం. దీనిపై సంబంధిత అధికారులకు మౌఖిక ఆదేశాలు వెళ్లాయని తెలిసింది. ఇప్పటికే ఓటర్ల జాబితా, వార్డుల విభజన, పోలింగ్‌ కేంద్రాల గుర్తింపు పనులు ఓ కొలిక్కి వచ్చాయి. వీటన్నింటిపైనా ఉన్నతాధికారులు మరోసారి సమీక్ష నిర్వహించనున్నారు.


గ్రామ పంచాయతీలకే ముందు..!

మూడు స్థానిక సంస్థల్లో మొదట గ్రామ పంచాయతీ ఎన్నికలను నిర్వహించాలని భావిస్తున్నట్టు సమాచారం. రాష్ట్రంలో 12,633 పంచాయతీలకు ఎన్నికలు జరుగుతాయని అఽధికారికవర్గాలు చెబుతున్నాయి. ఈ పంచాయతీలన్నింటి పరిధిలో కలిపి 1,13,500కుపైగా వార్డులున్నాయి. మునిసిపాలిటీల్లో కలిపే పంచాయతీల్లోని వార్డులుపోగా.. మిగతా వాటికి ఎన్నికలు నిర్వహిస్తారు. ఇక 5,817 ఎంపీటీసీ, 567 ఎంపీపీ, 567 జడ్పీటీసీ స్థానాలకు ఎన్నికలు జరుగుతాయి. హైదరాబాద్‌, మేడ్చల్‌-మల్కాజిగిరి మినహా 31 జిల్లాల్లో జడ్పీ చైర్మన్లను ఎన్నుకుంటారు.


కాంగ్రెస్‌లో పార్టీపరంగా రిజర్వేషన్లు!

స్థానిక సంస్థల్లో బీసీలకు 42శాతం రిజర్వేషన్‌ అమలు చేయాలని సర్కారు నిర్ణయించిన సంగతి తెలిసిందే. ఈ మేరకు అసెంబ్లీలో బిల్లులను ఆమోదించి కేంద్రానికి పంపింది. కానీ కేంద్రం పెండింగ్‌లో పెట్టింది. స్థానిక ఎన్నికల నోటిఫికేషన్‌ నాటికల్లా కేంద్రం నిర్ణయం తీసుకోకుంటే.. ప్రస్తుత రిజర్వేషన్లతోనే ఎన్నికలు నిర్వహించాల్సి ఉంటుంది. అంటే మొత్తంగా 50శాతం దాటకుండా రిజర్వేషన్లు అమలు చేయాలి. స్థానిక సంస్థల పరిధిలో ఎస్సీ, ఎస్టీలకు జనాభా దామాషా ప్రకారం రిజర్వేషన్లు కేటాయించి.. మిగతా రిజర్వేషన్లను బీసీలకు ఇవ్వాలి. ఈ లెక్కన గతంలో బీసీలకు గ్రామ పంచాయతీ, ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల్లో 21-22 శాతం, మున్సిపాలిటీల్లో 31శాతం రిజర్వేషన్లు అమలయ్యాయి. అయితే స్థానిక సంస్థల్లో నేరుగా రిజర్వేషన్లు పెంచలేని నేపథ్యంలో.. పార్టీపరంగా బీసీలకు 42శాతం స్థానాలను కేటాయిస్తామని కాంగ్రెస్‌ గతంలోనే ప్రకటించింది. ప్రస్తుతం దీనిపై కసరత్తు జరుగుతోంది.


క్యాడర్‌లో జోష్‌ నింపేందుకు..

మంత్రులు, ఎమ్మెల్యేలు, కార్పొరేషన్ల చైర్మన్లు వంటి నేతలందరినీ క్షేత్రస్థాయిలో అందుబాటులో ఉండాలని సీఎం రేవంత్‌ సూచించారు. ప్రభుత్వ పథకాలను విస్తృతంగా ప్రజల్లోకి తీసుకెళ్లాలని ఆదేశించారు. మరోవైపు కాంగ్రె్‌సలో గ్రామ, మండల, జిల్లా స్థాయి వరకు అవకాశం ఉన్న పదవులను భర్తీ చేసేందుకు రంగం సిద్ధం చేస్తున్నారు. తద్వారా క్షేత్రస్థాయి క్యాడర్‌లో ఉత్సాహం నెలకొంటుందని భావిస్తున్నారు. ఇక రాష్ట్రంలో ఇటీవలి రాజకీయ పరిణామాలు కూడా స్థానిక ఎన్నికల్లో కలిసి వస్తాయని కాంగ్రెస్‌ అంచనా వేస్తోంది.


ఈ వార్తలు కూడా చదవండి

కేసీఆర్ కుటుంబం మరో కొత్త సినిమా.. యెన్నం సెటైరికల్ కామెంట్స్

గద్దర్ అవార్డుల ప్రకటన.. విజేతలు వీరే

Read Latest Telangana News And Telugu News

Updated Date - May 30 , 2025 | 04:18 AM