Share News

జాతీయస్థాయి క్రీడా పోటీలకు తెలంగాణ పోలీసులు!

ABN , Publish Date - Feb 03 , 2025 | 04:32 AM

తెలంగాణ పోలీసు శాఖలోని ప్రతిభావంతులైన క్రీడాకారులకు మరింత మెరుగైన శిక్షణ ఇచ్చి వారిని జాతీయస్థాయి క్రీడాకారులుగా తీర్చిదిద్దడానికి ప్రణాళిక రూపొందిస్తున్నామని డీజీపీ జితేందర్‌ ఒక ప్రకటనలో తెలిపారు.

జాతీయస్థాయి క్రీడా పోటీలకు తెలంగాణ పోలీసులు!

  • అందుకోసం మూడు నెలల ప్రత్యేక శిక్షణ: డీజీపీ జితేందర్‌

హైదరాబాద్‌, ఫిబ్రవరి 2(ఆంధ్రజ్యోతి): తెలంగాణ పోలీసు శాఖలోని ప్రతిభావంతులైన క్రీడాకారులకు మరింత మెరుగైన శిక్షణ ఇచ్చి వారిని జాతీయస్థాయి క్రీడాకారులుగా తీర్చిదిద్దడానికి ప్రణాళిక రూపొందిస్తున్నామని డీజీపీ జితేందర్‌ ఒక ప్రకటనలో తెలిపారు. ప్రత్యేక రాష్ట్రం ఏర్పాడ్డాక తొలిసారి పోలీసుశాఖలో రాష్ట్ర స్థాయి క్రీడాపోటీలను కరీంనగర్‌లో అయిదురోజుల పాటు నిర్వహించామని ఆయన తెలిపారు. ఆ పోటీల్లో విజేతలుగా నిలిచిన వారికి మూడు నెలలు శిక్షణ ఇచ్చి జాతీయ స్థాయిలో అత్యధిక మెడల్స్‌ సాధించే విధంగా తీర్చిదిద్దనున్నామని ఆయన తెలిపారు. అందుకోసం క్రీడా విభాగం ఐజీ రమేష్‌ ఆధ్వర్యంలో ప్రత్యేక ప్రణాళిక రూపొందిస్తున్నామని పేర్కొన్నారు.


జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో ప్రతిభను క నబరిచి స్పెషల్‌ పోలీసు బెటాలియన్‌లో డీఎస్పీలుగా పనిచేస్తున్న క్రికెటర్‌ సిరాజ్‌, మహిళా బాక్సర్‌ నికత్‌ జరీన్‌ల పర్యవేక్షణలో శిక్షణా కేంద్రాలను ఏర్పాటు చేయనున్నామని జితేందర్‌ తెలిపారు. జాతీయ స్థాయి క్రీడాపోటీల్లో తెలంగాణ పోలీసుల్లో ఎవరైనా మొదటి బహుమతి తెచ్చుకుంటే వారికి మూడులక్షల నగదు, మూడు ఇంక్రిమెంట్లు, రెండో బహుమతి సంపాదిస్తే రెండులక్షల నగదు, రెండు ఇంక్రిమెంట్లు, మూడో బహుమతి సాధిస్తే లక్ష నగదు, ఒక ఇంక్రిమెంట్‌ ఇవ్వనున్నట్లు ఆయన చెప్పారు. దీని ద్వారా క్రీడల్లో పోలీసులు మరింత ఉత్సాహాన్ని క నబరిచే అవకాశాలున్నాయని వివరించారు. పోలీసుశాఖలో రాష్ట్రస్థాయిలో నిర్వహించిన క్రీడా పోటీల్లో 2,380 మంది క్రీడాకారులు పాల్గొన్నారని, ఇందులో 296 మంది మహిళలు, 12 మంది ఐపీఎస్‌ అధికారులు ఉన్నారని తెలిపారు.

Updated Date - Feb 03 , 2025 | 04:32 AM