Share News

Road Development: 9 ఉమ్మడి జిల్లాలు.. 373 రోడ్లు!

ABN , Publish Date - Jul 04 , 2025 | 04:51 AM

హైబ్రిడ్‌ యాన్యునిటీ మోడ్‌ (హ్యామ్‌) విధానంలో హైదరాబాద్‌ మినహా మిగిలిన 9 ఉమ్మడి జిల్లాల్లో మొత్తం 373 రోడ్లను అభివృద్ధి చేయనున్నారు.

Road Development: 9 ఉమ్మడి జిల్లాలు.. 373 రోడ్లు!

హ్యామ్‌ విధానంలో తొలుత నిర్మించే రోడ్లు ఇవే

  • ప్యాకేజీలు జిల్లాల వారీగానా? సర్కిళ్ల ప్రకారమా?

  • కసరత్తు చేస్తున్న ఆర్‌ అండ్‌బీ

  • త్వరలో సీఎంకు నివేదిక

హైదరాబాద్‌, జూలై 3 (ఆంధ్రజ్యోతి): హైబ్రిడ్‌ యాన్యునిటీ మోడ్‌ (హ్యామ్‌) విధానంలో హైదరాబాద్‌ మినహా మిగిలిన 9 ఉమ్మడి జిల్లాల్లో మొత్తం 373 రోడ్లను అభివృద్ధి చేయనున్నారు. ఇందులో కొన్ని కొత్తవి కాగా, మరి కొన్ని ఇప్పటికే ఉన్న డబుల్‌ రోడ్లను నాలుగు లేన్లుగా విస్తరించనున్నారు. తొలిదశలో నిర్మించనున్న రోడ్లకు బిడ్‌ ప్రాజెక్టు కాస్ట్‌ కింద రూ.6,478కోట్లు అవసరమవుతాయని ఆర్‌అండ్‌బీ ప్రాథమికంగా అంచనా వేసింది. హ్యామ్‌ విధానంలో అభివృద్ధి చేయనున్న రోడ్లపై ప్రస్తుతం ట్రాఫిక్‌ రద్దీ ఎలా ఉందన్న అంశంపై ఇప్పటికే అధ్యయనం పూర్తయింది. ఈ మేరకు అధిక ట్రాఫిక్‌ రద్దీ ఉన్న పలు రోడ్లను గుర్తించింది. భువనగిరి- చిట్యాల, వనపర్తి-జడ్చర్ల, నాగర్‌కర్నూల్‌లో ఒక రోడ్డు, మన్ననూర్‌ మార్గంలో ఒకటి, మహబూబ్‌నగర్‌- వనపర్తి, తల్లాడ- భద్రాచలం, ఖమ్మం- ఇల్లందు, చంద్రుపట్ల రోడ్డు, నారాయణ పేట-మక్తల్‌, గద్వాల-ఎర్రగిరి రోడ్డు, మరికల్‌ రోడ్డు, హన్మకొండ-నర్సంపేట, మెదక్‌-వడియారం రోడ్లపై ట్రాఫిక్‌ రద్దీ ఎక్కువగా ఉన్నట్టు అధ్యయనంలో తేల్చారు. ప్రస్తుతం ఈ రోడ్లు రెండు వరుసలతో ఉండగా.. నాలుగు వరుసలుగా నిర్మించాలని, అవసరమైన చోట 7ఫ్లస్‌ పావ్‌షోల్డర్‌ (ఇది ఆర్‌అండ్‌బీలో వినియోగించే సాంకేతిక పదం) విధానంలో అభివృద్ధి చేయాలని ప్రాథమికంగా నిర్ణయించింది. కాగా, హ్యామ్‌ విధానంలో రోడ్ల అభివృద్ధి పనులు చేపట్టేందుకు నాలుగు విధానాలపై అర్‌ అండ్‌ బీ అధికారులు కసరత్తు చేస్తున్నారు. వీటిలో మొదటది ఉమ్మడి జిల్లా వారీగా రోడ్లను నిర్మిస్తే.. ఎలా ఉంటుదన్న దానిపై చర్చిస్తున్నారు.


దీని ప్రకారం హైదరాబాద్‌ మినహా మిగిలిన 9 ఉమ్మడి జిల్లాల్లో 373 రోడ్ల నిర్మాణానికి బిడ్‌ ప్రాజెక్టు కాస్ట్‌ కింద రూ.6,478కోట్లు అవసరమని తేల్చారు. వీటిలో అధికంగా ఉమ్మడి మహబూబ్‌నగర్‌ జిల్లాలో 909 కి.మీ మేర 46 రోడ్లు, నల్లగొండలో 53 రోడ్లను 699కి.మీ మేర అభివృద్ధి చేయాల్సి ఉంటుంది. ఇలా మిగిలిన జిల్లాల్లోనూ లెక్కలను తీశారు. ఇక, ప్యాకేజీల వారీగా అయితే మొత్తం కిలోమీటర్లను 14 ప్యాకేజీలుగా విభజించారు. వీటిలో ఏవైనా ప్యాకేజీలు పెద్దగా ఉన్నాయనుకుంటే రెండుగా విభజించాలని నిర్ణయించారు. ఇక, సర్కిళ్ల వారీగా అయితే మొత్తం కిలోమీటర్లను 16 ప్యాకేజీలు, క్లస్టర్ల వారీగా పనులు చేయాలంటే... 27 ప్యాకేజీలుగా లెక్క తేలినట్లు తెలిసింది. ఈ విధానాల్లో సర్కిళ్ల ప్రకార మైతే ఇబ్బంది లేకుండా ఉంటుందని, టెండర్ల ప్రక్రియ నుంచి పనుల నిర్వహణ దాకా ఎక్కడా జాప్యం జరగదని అధికారులు అంచనా వేస్తున్నారు. ఈ మేరకు సమగ్ర వివరాలతో నివేదిక రూపొందించి, సీఎంకు అందించనున్నారు. సీఎం నిర్ణయం మేరకు స్పష్టత రానుంది.


‘హ్యామ్‌’ పర్యవేక్షణకు బృందం

హ్యామ్‌ విధానంలో అభివృద్ధి చేయనున్న రోడ్ల పర్యవేక్షణకు ఆర్‌అండ్‌బీ శాఖ ప్రత్యేక బృందాన్ని ఏర్పాటు చేసింది. ఈ మేరకు ఒక చీఫ్‌ ఇంజనీర్‌, ఒక సూపరింటెండెంట్‌ ఇంజనీర్‌, ఇద్దరు ఎగ్జిక్యూటివ్‌ ఇంజనీర్లు, ఇద్దరు డిప్యూటీ ఇంజనీర్లు, ముగ్గురు జూనియర్‌ టెక్నికల్‌ ఆఫీసర్లతోపాటు మరో ఇద్దరు, ముగ్గురు సిబ్బంది కలిపి మొత్తం 12-13 మందితో ఈ బృందాన్ని నియమించినట్లు తెలిసింది.


ఇవి కూడా చదవండి

రాయచోటిలో ఉగ్రవాదులు అరెస్ట్.. కీలక అప్ డేట్..

తెలంగాణ నీటి వాటాను ఏపీకి దారాదత్తం చేశారు.. కేసీఆర్, హరీష్‌లపై మహేష్ గౌడ్ ఫైర్

టాలీవుడ్‌లో పైరసీ గుట్టు రట్టు.. ఒకరి అరెస్ట్

Read latest Telangana News And Telugu News

Updated Date - Jul 04 , 2025 | 04:51 AM