Telangana News: గోదావరి బేసిన్‌లోని ప్రాజెక్టులన్నింటికీ జలకళ..
ABN , Publish Date - Aug 18 , 2025 | 09:23 PM
ప్రస్తుతం భారీగా కురుస్తున్న వర్షాల కారణంగా గోదావరి బేసిన్లో ఉన్న ప్రాజెక్టులన్నీ జలకళ సంతరించుకున్నాయి. ఎస్సారెస్పీ, ఎల్లంపల్లి ప్రాజెక్టులు నిండటంతో ఉత్తర తెలంగాణలో వరద కాల్వతో పాటు మిడ్ మానేరు, ఎల్ఎండీలో క్రమంగా నీటి నిల్వలు పెరుగుతున్నాయి.
ప్రస్తుతం భారీగా కురుస్తున్న వర్షాల కారణంగా గోదావరి బేసిన్లో (Godavari basin) ఉన్న ప్రాజెక్టులన్నీ జలకళ సంతరించుకున్నాయి. ఎస్సారెస్పీ, ఎల్లంపల్లి ప్రాజెక్టులు (Projects) నిండటంతో ఉత్తర తెలంగాణలో వరద కాల్వతో పాటు మిడ్ మానేరు, ఎల్ఎండీలో క్రమంగా నీటి నిల్వలు పెరుగుతున్నాయి. మహారాష్ట్రతోపాటు, ఎగువన గోదావరి పరివాహకంలో కురిసిన వర్షాలతో ఎస్సారెస్పీకి మూడు రోజులుగా ఇన్ ఫ్లో కొనసాగుతోంది. సోమవారం మధ్యాహ్నం 1.25 లక్షల క్యూసెక్కుల ఇన్‌ఫ్లో నమోదైంది. అలాగే దాదాపు 76867 క్యూసెక్కుల అవుట్ ఫ్లో ఉంది.
కాకతీయ కెనాల్‌కు 5 వేల క్యూసెక్కులు, ఎస్సారెస్పీ నుంచి 18 వేల క్యూసెక్కుల నీటిని ఇందిరమ్మ వరద కాల్వ ద్వారా మిడ్ మానేరుకు వదులుతున్నారు. ఇక, శ్రీపాద ఎల్లంపల్లి ప్రాజెక్టులో నీటి నిల్వలు 18.92 టీఎంసీలకు చేరుకున్నాయి. ఈ ప్రాజెక్టు గరిష్ఠ నీటి నిల్వ సామర్థ్యం 20.175 టీఎంసీలు. 148 మీటర్ల గరిష్ట నీటి మట్టం కాగా, ప్రస్తుతం 147.55 మీటర్ల నీటి మట్టం ఉంది. ఈ ప్రాజెక్టు పరివాహకంలో కురిసిన వర్షాలతో 48293 క్యూసెక్కుల ఇన్ ప్లో ఉంది. ఈ ప్రాజెక్టు నుంచి హైదరాబాద్ తాగునీటితో పాటు ఎన్టీపీసీకి నీటిని విడుదల చేస్తున్నారు. అలాగే నంది పంప్ హౌస్‌కు 6300 క్యూసెక్కుల నీటిని వదులుతున్నారు.
ఆగస్ట్ 13వ తేదీ నుంచి అయిదు రోజులుగా ఎల్లంపల్లి నుంచి మిడ్ మానేరుకు 4.12 టీఎంసీల నీటిని వదిలారు. మిడ్ మానేరు జలాశయంలో 10.81 టీఎంసీల నీటి నిల్వలున్నాయి. ప్రస్తుత నీటి మట్టం 309.63 మీటర్లు. ఈ నీటి మట్టం 311.14 మీటర్లకు చేరితే, నీటి నిల్వ 13.13 టీఎంసీలకు చేరుతుంది. ఇప్పుడున్న ఇన్ ఫ్లో ప్రకారం ఆగస్ట్ 20 నుంచి పంపింగ్ ప్రారంభించే అవకాశాలున్నాయని ఇరిగేషన్ ఇంజనీర్లు తెలిపారు. మిడ్ మానేరు నుంచి నాలుగు పంప్‌లను రన్ చేయాలంటే 25.77 టీఎంసీల నీటి నిల్వ చేరాలి.
ఈ వార్తలు కూడా చదవండి
హైదరాబాద్ కూకట్‌పల్లిలో దారుణం, ఇంట్లో ఒంటరిగా ఉన్న పన్నెండేళ్ల బాలిక హత్య
కేంద్రం నుంచి 3 లక్షల మెట్రిక్ టన్నుల యూరియా రావాలి.. కాంగ్రెస్ ఎంపీ మల్లు రవి
Read latest Telangana News And Telugu News