Share News

Uttam Kumar Reddy: ప్రాజెక్టుల వద్దే ఉండాలి

ABN , Publish Date - Aug 14 , 2025 | 04:12 AM

రాష్ట్రంలో కురుస్తున్న భారీ వర్షాల నేపథ్యంలో ఇంజనీర్లందరూ క్షేత్రస్థాయిలోని రిజర్వాయర్లు, కాల్వలు, చెరువుల వద్దే మకాం వేయాలని నీటిపారుదల శాఖ మంత్రి ఎన్‌.ఉత్తమ్‌కుమార్‌రెడ్డి ఆదేశించారు.

Uttam Kumar Reddy: ప్రాజెక్టుల వద్దే ఉండాలి

  • 72 గంటలపాటు పర్యవేక్షించాలి

  • క్షేత్రస్థాయి ఇంజనీర్లకు ఉత్తమ్‌ ఆదేశం

హైదరాబాద్‌, ఆగస్టు 13 (ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలో కురుస్తున్న భారీ వర్షాల నేపథ్యంలో ఇంజనీర్లందరూ క్షేత్రస్థాయిలోని రిజర్వాయర్లు, కాల్వలు, చెరువుల వద్దే మకాం వేయాలని నీటిపారుదల శాఖ మంత్రి ఎన్‌.ఉత్తమ్‌కుమార్‌రెడ్డి ఆదేశించారు. రానున్న 72 గంటల పాటు రాత్రింబవళ్లు వాటిని పర్యవేక్షించాలని సూచించారు. ఉన్నత స్థాయి ఇంజనీర్లు కూడా సంబంధిత ప్రాజెక్టుల వద్ద నిరంతరం అందుబాటులో ఉండి.. జిల్లా యంత్రాంగానికి నిర్ణయాలు తీసుకోవడంలో సహకరించాలన్నారు. మంగళవారం రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ఈఎన్సీలు, సీఈలు, ఎస్‌ఈలు, ఈఈలు, డీఈఈలతో సచివాలయం నుంచి మంత్రి వీడియో కాన్ఫరెన్స్‌ నిర్వహించారు. వచ్చే 24 గంటల్లో భద్రాద్రి కొత్తగూడెం, జయశంకర్‌ భూపాలపల్లి, ఖమ్మం, మెదక్‌, మేడ్చల్‌-మల్కాజ్‌గిరి, ములుగు, సంగారెడ్డి, సూర్యాపేట, వికారాబాద్‌, యాదాద్రి-భువనగిరి జిల్లాల్లో అతిభారీ వర్షాలు, రాష్ట్రంలోని మిగిలిన ప్రాంతాల్లో వచ్చే 72 గంటల్లో భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ హెచ్చరించిన విషయాన్ని ఈ సందర్భంగా మంత్రి గుర్తు చేశారు.


ప్రస్తుత సంక్లిష్ట పరిస్థితుల్లో ఏ అధికారి కూడా క్షేత్రస్థాయి(హెడ్‌క్వార్టర్‌)ని వదిలి వెళ్లరాదని, సెలవు కూడా పెట్టరాదని ఆదేశించారు. గ్రామ స్థాయిలోని అత్యంత చిన్న చెరువు నుంచి రాష్ట్రంలోని అతిపెద్ద జలాశయం వరకు సాగునీటి వనరులన్నింటినీ అతి సమీపం నుంచి పర్యవేక్షించాలన్నారు. ఏదైనా ప్రమాదం నెలకొని ఉన్నా, పరిస్థితులు నియంత్రణ కోల్పోతున్నా తక్షణమే జిల్లా కలెక్టర్‌కు, సంబంధిత సీఈ, నీటిపారుదల శాఖ ముఖ్య కార్యదర్శికి సమాచారం అందించాలన్నారు. కాల్వలు, చెరువులకు గండ్లు పడ్డట్టు గుర్తిస్తే.. తక్షణమే నష్టనివారణ చర్యలు తీసుకోవాలన్నారు. జలాశయాలు, ఇతర సున్నిత ప్రదేశాల్లో పోలీసు, రెవెన్యూ అధికారులతో కలిసి గస్తీ నిర్వహించాలని నీటిపారుదల శాఖ అధికారులను ఉత్తమ్‌ ఆదేశించారు. వరదల నిర్వహణకు సంబంధించిన అత్యవసర పనులకు క్షేత్ర స్థాయి ఇంజనీర్లు ఉన్నతాధికారుల నుంచి అనుమతుల కోసం నిరీక్షించవద్దని మంత్రి ఉత్తమ్‌ అన్నారు. జీవో 45 ద్వారా దఖలు పడిన అధికారాలను వినియోగించుకొని జారీ చేసిన నిధులను ఖర్చు చేసేందుకు వారికి విచక్షణాధికారాలు కల్పిస్తున్నట్లు ప్రకటించారు. ఈ సందర్భంగా జిల్లాల వారీగా, ప్రాజెక్టుల వారీగా ప్రత్యేక సమీక్ష నిర్వహించారు. కాగా, ప్రస్తుతానికి పరిస్థితి నియంత్రణలోనే ఉందని, క్షేత్ర స్థాయిలో ప్రాజెక్టుల పర్యవేక్షణను మరింతగా ఉధృతం చేస్తామని అధికారులు బదులిచ్చారు. ఏదైనా అత్యవసర పరిస్థితి ఉత్పన్నమైతే స్పందించడానికి తాను రెండుమూడు రోజులు ఫోన్‌లో అందుబాటులో ఉంటాననిమంత్రి చెప్పారు.


ఈ వార్తలు కూడా చదవండి..

సోనియా గాంధీ లక్ష్యంగా సంచలన ఆరోపణలు..

రిమాండ్ పొడిగింపు.. కోర్టు వద్ద చెవిరెడ్డి హల్‌చల్

Read latest Telangana News And Telugu News

Updated Date - Aug 14 , 2025 | 04:12 AM