Share News

Judiciary: విమెన్‌ జస్టిస్‌లో తెలంగాణ టాప్‌

ABN , Publish Date - Aug 25 , 2025 | 03:48 AM

మహిళా న్యాయమూర్తుల సంఖ్యలో తెలంగాణ హైకోర్టు దేశంలోనే మొదటి స్థానంలో నిలిచింది...

Judiciary: విమెన్‌ జస్టిస్‌లో తెలంగాణ టాప్‌

  • తెలంగాణ హైకోర్టులో 30లో 10 మంది మహిళా న్యాయమూర్తులు

  • సిక్కింలో ముగ్గురు జడ్జిల్లో ఒకరు మహిళ.. తొమ్మిదో స్థానంలో ఆంధ్రప్రదేశ్‌ హైకోర్టు

  • 8 హైకోర్టుల్లో ఒక్కొక్కరే మహిళా జడ్జిలు.. మరో 3 హైకోర్టుల్లో మహిళలు సున్నా

  • సుప్రీంలో మహిళా జడ్జిలు 6.06శాతమే.. మహిళా సీజే నిల్‌

  • తొలి మహిళా సీజేఐగా 2027లో జస్టిస్‌ బీవీ నాగరత్న

  • ‘సెంటర్‌ ఫర్‌ లా అండ్‌ పాలసీ రిసెర్చ్‌’ నివేదిక

న్యూఢిల్లీ, ఆగస్టు 24 (ఆంధ్రజ్యోతి): మహిళా న్యాయమూర్తుల సంఖ్యలో తెలంగాణ హైకోర్టు దేశంలోనే మొదటి స్థానంలో నిలిచింది. మొత్తం 30 మంది జడ్జిలకు గాను.. 10 మంది మహిళా న్యాయమూర్తులున్నారు. అంటే.. జడ్జిల సంఖ్యలో మహిళల వాటా 33.3ు. ఆ తర్వాతి స్థానంలో సిక్కిం హైకోర్టు ఉంది. అక్కడ ముగ్గురు జడ్జిల్లో ఒకరు మహిళ (33.3ు). ఈ జాబితాలో ఆంధ్రప్రదేశ్‌ హైకోర్టు 9వ స్థానంలో ఉంది. ఏపీలో 30 మంది జడ్జిల్లో ఐదుగురు మహిళలున్నారు. సుప్రీంకోర్టులో 33 మంది న్యాయమూర్తుల్లో ఇద్దరు(6.06ు) మాత్రమే మహిళలు ఉండడం గమనార్హం..! ఈ మేరకు ‘సెంటర్‌ ఫర్‌ లా అండ్‌ పాలసీ రిసెర్చ్‌’’ అనే సంస్థ ‘ఈక్వల్‌ జస్టిస్‌’ పేరుతో ఓ నివేదికను విడుదల చేసింది.

సుప్రీంకోర్టులో ఇలా..

సుప్రీంకోర్టు ఏర్పాటైనప్పటి నుంచి ఇప్పటివరకు ప్రస్తుతం ఉన్నవారితో కలిపి మొత్తం 279 మంది జడ్జిలు పనిచేస్తే.. వారిలో మహిళల వాటా 11 మాత్రమే..! 1989లో జస్టిస్‌ ఫాతిమా సుప్రీంకోర్టు జడ్జిగా సేవలందించిన తొలి మహిళ కాగా.. 58 సంవత్సరాల వయసులో సర్వోన్నత న్యాయస్థానంలో న్యాయమూర్తిగా ప్రమాణ స్వీకారం చేసిన జస్టిస్‌ రూమాపాల్‌ అతి పిన్నవయస్కురాలైన జడ్జిగా చరిత్ర పుటల్లో నిలిచిపోయారు. 2013లో తొలిసారి జస్టిస్‌ రంజనా దేశాయ్‌, జస్టిస్‌ సుధామిశ్రాతో మొదటి మహిళా బెంచ్‌ ఏర్పాటైంది. జస్టిస్‌ ఎన్వీ రమణ హయాంలో మాత్రమే ఏకకాలంలో సుప్రీంకోర్టులో ముగ్గురు మహిళా న్యాయమూర్తులు-- జస్టిస్‌ హిమాకోహ్లి, జస్టిస్‌ బీవీ నాగరత్న, జస్టిస్‌ బేలా.ఎం.త్రివేది పనిచేశారు. ఈ ముగ్గురితో 2021 ఆగస్టు 31న జస్టిస్‌ ఎన్వీ రమణ ప్రమాణస్వీకారం చేయించారు. బార్‌ కౌన్సిల్‌ ఆఫ్‌ ఇండియా(బీసీఐ) నుంచి ఇప్పటి వరకు నేరుగా తొమ్మిది మంది సుప్రీంకోర్టు న్యాయమూర్తులుగా ప్రమాణస్వీకారం చేయగా.. వారిలో జస్టిస్‌ ఇందు మల్హోత్రా(2018) మాత్రమే మహిళా జడ్జి. ఇప్పటి వరకు 51 మంది భారత ప్రధాన న్యాయమూర్తులు(సీజేఐ)గా సేవలందిస్తే.. వారిలో ఒక్క మహిళ కూడా లేరు. 2027లో జస్టిస్‌ బీవీ నాగరత్నకు సీజేఐగా అవకాశం దక్కనుంది. 36 రోజుల పాటు సీజేఐగా ఉండనున్నారు. ఆమె తొలి మహిళా సీజేఐగా చరిత్రకెక్కనున్నారు.


హైకోర్టుల్లో..

1937లో జస్టిస్‌ అన్నాచాందీ దేశంలోనే మొదటి న్యాయమూర్తిగా ఉన్నారు. ఆమె కేరళలోని ఓ జిల్లా కోర్టులో న్యాయమూర్తిగా సేవలందించారు. హైకోర్టుకు సీజే అయిన మొదటి మహిళగా జస్టిస్‌ లీలాసేథ్‌(1991) ఉన్నారు. ఆమె హిమాచల్‌ప్రదేశ్‌ హైకోర్టులో సేవలందించారు. సిక్కిం, మణిపూర్‌, హిమాచల్‌ప్రదేశ్‌, ఝార్ఖండ్‌, ఛత్తీ్‌సగఢ్‌, ఒడిసా, మధ్యప్రదేశ్‌, బిహార్‌ హైకోర్టుల్లో ఒక్కొక్కరు చొప్పున మహి ళా న్యాయమూర్తులు సేవలందిస్తున్నారు. ఉత్తరాఖండ్‌, త్రిపుర, మేఘాలయ హైకోర్టుల్లో అసలు మహిళా జడ్జిలే లేరు. మధ్యప్రదేశ్‌, బిహార్‌, ఛత్తీ్‌సగఢ్‌, గువాహటి, సిక్కిం, మణిపూర్‌ హైకోర్టులలో ఇప్పటి వరకు ఒక్కరు కూడా బార్‌ కౌన్సిల్‌(న్యాయవాద వృత్తి) నుంచి నేరుగా మహిళా న్యాయమూర్తులుగా నియమితులవ్వకపోవడం గమనార్హం..!


ఇవి కూడా చదవండి..

మరాఠా రిజర్వేషన్‌పై ఆఖరి పోరాటం.. మనోజ్ జారంగే పిలుపు

రాహుల్ ఓటర్ అధికార్ యాత్రలో జోష్.. హాజరుకానున్న ప్రియాంక

రాహుల్ యాత్రలో మళ్లీ అపశృతి

For More National News And Telugu News

Updated Date - Aug 25 , 2025 | 03:48 AM