Share News

Normal Delivery: కడుపు‘కోత’ల్లో టాప్‌

ABN , Publish Date - Jul 21 , 2025 | 04:14 AM

ఇప్పుడు సిజేరియన్‌ అంటే షాక్‌ అవుతున్నావు కదూ..! మార్క్‌ మై వర్డ్స్‌.. ఇంకో 30 ఏళ్ల తర్వాత నార్మల్‌ డెలివరీ అంటే అంతా షాక్‌ అవుతారు’’... ఇది ‘అదిరింది’ అనే సినిమాలో ఓ ప్రైవేటు ఆస్పత్రి ఎండీ పాత్రలో ఎస్‌.జే.సూర్య మరో డాక్టర్‌తో చెప్పే డైలాగ్‌.

Normal Delivery: కడుపు‘కోత’ల్లో టాప్‌

  • రాష్ట్రంలో 58% సిజేరియన్‌ ప్రసవాలే..

  • దేశంలో తెలంగాణదే మొదటి స్థానం

  • ప్రైవేటులో 73%, సర్కారీలో 48%

  • రాష్ట్రంలో ప్రతి గంటకు 27 సిజేరియన్లు

  • 25 జిల్లాల్లోని ప్రైవేటు ఆస్పత్రుల్లో 80-90 శాతం శస్త్రచికిత్స కాన్పులే

  • 8 జిల్లాల్లోని సర్కారీ ఆస్పత్రుల్లో 70%

  • వైద్య శాఖ తాజా నివేదికలో వెల్లడి

హైదరాబాద్‌, జూలై 20 (ఆంధ్రజ్యోతి): ‘‘ఇప్పుడు సిజేరియన్‌ అంటే షాక్‌ అవుతున్నావు కదూ..! మార్క్‌ మై వర్డ్స్‌.. ఇంకో 30 ఏళ్ల తర్వాత నార్మల్‌ డెలివరీ అంటే అంతా షాక్‌ అవుతారు’’... ఇది ‘అదిరింది’ అనే సినిమాలో ఓ ప్రైవేటు ఆస్పత్రి ఎండీ పాత్రలో ఎస్‌.జే.సూర్య మరో డాక్టర్‌తో చెప్పే డైలాగ్‌. అదే సీన్‌ ఇప్పుడు తెలంగాణలో కనిపిస్తోంది. భవిష్యత్తులో సాధారణ ప్రసవం అయిందంటే అద్భుతం జరిగిందనే మాటలు వినిపించినా ఆశ్చర్యపోనక్కర్లేదని అంటున్నారు. రాష్ట్రంలో సహజ ప్రసవాలు తగ్గుతున్నాయి. ఏటికేడు ‘కడుపు కోతలు’ పెరిగిపోతున్నాయి. దేశంలోనే సిజేరియన్‌ ప్రసవాల్లో రాష్ట్రం మొదటి స్థానంలో ఉంది. ప్రభు త్వం ఎన్ని చర్యలు తీసుకుంటున్నా ఫలితం ఉండటం లేదన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. రాష్ట్రంలో ప్రతి గంటకు 27 సిజేరియన్‌ డెలివరీలు జరుగుతున్నాయి. ఈ ఏడాది మే, జూన్‌లో ప్రభుత్వ, ప్రైవేటు ఆస్పత్రుల్లో కలిపి మొత్తం 67,103 ప్రసవా లు జరగ్గా.. అందులో 39,300 (58ు) సిజేరియన్లే. ప్రైవేటు ఆస్పత్రుల్లో 73 శాతానికిపైగా, ప్రభుత్వ ఆస్పత్రుల్లో 48ు సిజేరియన్‌ ప్రసవాలేనని వైద్య ఆరోగ్యశాఖ సర్కారుకు ఇచ్చిన తాజా నివేదికలో పేర్కొంది. రెండు రోజుల క్రితం వైద్య ఆరోగ్య శాఖ ఉన్నతస్థాయి సమీక్ష జరిగింది.


‘ప్రైవేటు’లో 25 జిల్లాల్లో 80 శాతం సీ-సెక్షన్లే

రాష్ట్రంలో ప్రైవేటు ఆస్పత్రులు ఎడాపెడా సిజేరియన్‌ (సీ సెక్షన్‌) ప్రసవాలు చేసేస్తున్నాయి. సాధారణ ప్రసవమంటే ఒకటి రెండు రోజుల్లో డిశ్చార్జ్‌ అవుతారు. అదే సిజేరియన్‌ అయితే కనీసం నాలుగైదు రోజులన్నా ఆస్పత్రిలో ఉండాలి. బిల్లు కూడా ఎక్కువ అవుతుంది. కొన్ని కేసుల్లో బిడ్డ అడ్డం తిరిగిందనే సాకుతోనూ కొన్ని ప్రైవేటు ఆస్పత్రులు సిజేరియన్‌ ప్రసవాలు చేస్తున్నాయి. రాష్ట్రంలో నిర్మల్‌, పెద్దపల్లి, సిరిసిల్ల, సిద్దిపేట, నిజామాబాద్‌, ములు గు జిల్లాల్లో 90ు వరకు సిజేరియన్‌ డెలివరీలే కావడం గమనార్హం. అలాగే 80-90ు మధ్యలో సిజేరియన్‌ జరుగుతున్న జిల్లాల జాబితాలో గద్వాల, ఆసిఫాబాద్‌, వికారాబాద్‌, ఆదిలాబాద్‌, సంగారెడ్డి, మెదక్‌, భూపాలపల్లి, కామారెడ్డి, కరీంనగర్‌, సూర్యాపేట, ఖమ్మం, జగిత్యాల, నల్లగొండ, యాదాద్రి భువనగిరి, మంచిర్యాల, వరంగల్‌, మహబూబాబాద్‌, హన్మకొండ జిల్లాలు ఉన్నాయి. ఒక్క మేడ్చల్‌ మల్కాజిగిరి జిల్లాలో మాత్రమే కేవలం 47ు డెలివరీలు సిజేరియన్లని వైద్యఆరోగ్య శాఖ నివేదికలో వెల్లడైంది. మిగిలిన ఏడు జిల్లాల్లో 67-79ు మధ్యలో సిజేరియన్లు జరుగుతున్నట్లు ఆ రిపోర్టులో పేర్కొంది. ఈ ఏడాది మే, జూన్‌ నెలల్లో రాష్ట్రంలోని ప్రైవేటు ఆస్పత్రుల్లో 28,440 ప్రసవాలు జరగ్గా, అందులో 20,876 (73ు) డెలివరీలు సిజేరియన్లేనని ఆ నివేదికలో వెల్లడైంది.


ప్రభుత్వ ఆస్పత్రుల్లోనూ అదే పరిస్థితి

ప్రభుత్వ ఆస్పత్రుల్లోనూ 48% సిజేరియన్‌ ప్రసవాలు జరుగుతున్నాయి. ప్రధానంగా 8 జిల్లాల్లోని సర్కారీ దవాఖానాల్లో 70ు ప్రసవాలు సిజేరియన్లేనని ఆ నివేదికలో వెల్లడైంది. జగిత్యాల (75%), నిర్మల్‌ (74), పెద్దపల్లి (73), హన్మకొండ (73), కరీంనగర్‌ (71), సిరిసిల్ల (71), వరంగల్‌ (69), మహబూబాబాద్‌ (67) జిల్లాల్లో సిజేరియన్లు ఎక్కువగా జరుగుతున్నాయి. 20 జిల్లాల్లోని ప్రభుత్వ ఆస్పత్రుల్లో రాష్ట్ర సగటు 48ు కంటే ఎక్కువగా సీ సెక్షన్లు జరుగుతున్నాయని ఆ నివేదిక పేర్కొంది. సాధారణ ప్రసవాలు ఎక్కువగా జరిగే జిల్లాల జాబితాలో మేడ్చల్‌ మల్కాజిగిరి అగ్రస్థానంలో ఉంది. అక్కడ జరిగే ప్రతి వంద ప్రసవాల్లో 74 సాధారణ ప్రసవాలే. ఆ తర్వాత స్థానాల్లో గద్వాల (72), ఆసిఫాబాద్‌ (71), ఆదిలాబాద్‌ (69) జిల్లాలు ఉన్నాయి. మే, జూన్‌ నెలల్లో ప్రభుత్వ ఆస్పత్రుల్లో మొత్తం 38,663 ప్రసవాలు జరగ్గా, అందులో 20,239 సాధారణ, మిగిలిన 18,424 సీ సెక్షన్‌ జరిగాయి.


సిజేరియన్ల తగ్గింపునకు కార్యాచరణ

రాష్ట్రంలో సిజేరియన్‌ ప్రసవాలు పెరిగిపోతుండడంపై సర్కారు ఆందోళన వ్యక్తం చేస్తోంది. కొంతమేరకు తగ్గించేందుకు కార్యాచరణ చేపట్టింది. ప్రధానంగా ప్రైవేటు ఆస్పత్రుల్లో జరిగే సీ సెక్షన్‌ ప్రసవాలపై ఆడిట్‌ను పకడ్బందీగా నిర్వహించాలని నిర్ణయించింది. ఎక్కువ సీజేరియన్లు చేస్తున్న వాటిపై నిఘా పెట్టనుంది. అలాగే సాధారణ ప్రసవాలపై గర్భిణులకు అవగాహన కల్పించనున్నారు. ‘హైరిస్క్‌ ప్రెగ్నెంట్‌’ కేసులను ముందుగానే గుర్తించి, రిఫరల్‌ ఆస్పత్రులకు పంపనున్నారు. వైద్య విద్య సంచాలకులు, వైద్యవిధాన పరిషత్‌ ఆస్పత్రుల్లో మిడ్‌వైఫరీ సేవలను మరింత బలోపేతం చేయనున్నారు.


30 తర్వాత సాధారణ ప్రసవాలు కష్టమే

ప్రస్తుతం ఆడపిల్లలు ఆలస్యంగా పెళ్లిళ్లు చేసుకుంటున్నారు. వెంటనే పిల్లల్ని కనడం లేదు. 30 దాటిన తర్వాత గర్భం దాల్చిన వారిలో సాధారణ ప్రసవం జరగడం కష్టమే. ఇటువంటి కేసుల్లో సిజేరియన్‌కే వైద్యులు ప్రాధాన్యమినిస్తారు. సీ సెక్షన్‌ పెరగడానికి ఇది కూడా ప్రధాన కారణం. అలాగే మొదటిసారి ప్రసవం సాధారణ ప్రసవమయ్యేలా చూడాలి. ఒకసారి సీ సెక్షన్‌ అయితే.. రెండోసారి నార్మల్‌ అవడం కష్టం. ఇటువంటి వాటిలో 60-70 శాతం సీ సెక్షన్‌ జరుగుతాయి. సాధారణ ప్రసవం కావాలంటే కొన్నిసార్లు 24 గంటల సమయం కూడా పడుతుంది. అంత సమయం వేచి చూడటం లేదు.

- డాక్టర్‌ వెల్లంకి జానకి, గైనకాలజిస్టు, గాంధీ ప్రభుత్వ ఆస్పత్రి.


ఈ వార్తలు కూడా చదవండి..

త్వరలో యాదగిరి ఆధ్యాత్మిక మాసపత్రిక, టీవీ చానల్‌

రేవంత్‌ నాటుకోడి.. కేటీఆర్‌ బాయిలర్‌ కోడి

Read latest Telangana News And Telugu News

Updated Date - Jul 21 , 2025 | 04:14 AM