Share News

High Court: కేపీహెచ్‌బీ ప్లాట్ల అమ్మకాలు ఖరారు చేయొద్దు

ABN , Publish Date - Jan 25 , 2025 | 03:50 AM

కూకట్‌పల్లి (కేపీహెచ్‌బీ) కాలనీలోని వివిధ ఫేజ్‌ల్లో మిగిలిపోయిన 24 ఓపెన్‌ ప్లాట్ల వేలం బిడ్లను ఖరారు చేయరాదని రాష్ట్ర ప్రభుత్వం, తెలంగాణ హౌసింగ్‌ బోర్డు, జీహెచ్‌ఎంసీ, ఇతర అధికారులకు హైకోర్టు ఆదేశాలు జారీచేసింది.

High Court: కేపీహెచ్‌బీ ప్లాట్ల అమ్మకాలు ఖరారు చేయొద్దు

  • లేఅవుట్‌లో చూపెట్టకుండా మిగిలిన పాట్లు అనడం తగదు

  • ఇష్టానుసారం వ్యవహరిస్తామంటే చెల్లదు: హైకోర్టు

హైదరాబాద్‌, జనవరి 24 (ఆంధ్రజ్యోతి): కూకట్‌పల్లి (కేపీహెచ్‌బీ) కాలనీలోని వివిధ ఫేజ్‌ల్లో మిగిలిపోయిన 24 ఓపెన్‌ ప్లాట్ల వేలం బిడ్లను ఖరారు చేయరాదని రాష్ట్ర ప్రభుత్వం, తెలంగాణ హౌసింగ్‌ బోర్డు, జీహెచ్‌ఎంసీ, ఇతర అధికారులకు హైకోర్టు ఆదేశాలు జారీచేసింది. వేలాన్ని సవాలు చేస్తూ చివరి నిమిషంలో దాఖలైన వ్యాజ్యంపై విచారణ జరిపిన ధర్మాసనం ఈ ఉత్తర్వులు ఇచ్చింది. కేపీహెచ్‌బీలోని వివిధ ఫేజ్‌లలో మిగిలిపోయిన ప్లాట్ల విక్రయానికి జారీ చేసిన నోటిఫికేషన్‌ను కొట్టివేయాలని కోరుతూ కేపీహెచ్‌బీ ఫేజ్‌ 15 వెంకటరమణ కాలనీ వెల్ఫేర్‌ అసోసియేషన్‌ పిటిషన్‌ దాఖలు చేసింది. పిటిషనర్‌ తరఫున న్యాయవాది ఎం.రూపేందర్‌ వాదిస్తూ.. ఇప్పటికే ఆమోదం పొందిన లేఅవుట్‌కు, 2011 నాటి జీవో 6కు విరుద్ధంగా ప్రభుత్వం ప్లాట్లను విక్రయించాలని చూస్తోందని ఆరోపించారు.


ఇది లేఅవుట్‌ షరతులను ఉల్లంఘించడమే అవుతుందని పేర్కొన్నారు. ప్రభుత్వం, ఇతర ప్రతివాదుల తరఫున అడ్వకేట్‌ జనరల్‌ సుదర్శన్‌రెడ్డి వాదిస్తూ వేలం నిర్వహణపై ఈనెల 9న నోటిఫికేషన్‌ జారీచేశామని, శుక్రవారం బహిరంగ వేలం షెడ్యూల్‌ ఉండగా చిట్టచివరి నిమిషంలో పిటిషన్‌ వేయడంలో దురుద్దేశం ఉందని ఆరోపించారు. కాలనీ అసోసియేషన్‌కు పిటిషన్‌ వేసే అర్హత లేదని పేర్కొన్నారు. వాదనలు విన్న ధర్మాసనం.. తమకు సమర్పించిన సాంక్షన్డ్‌ లేఅవుట్‌లో 24 స్థలాలను ప్లాట్లుగా గుర్తించలేదని, నెంబర్‌ కేటాయించలేదని తెలిపింది. అలాంటప్పుడు ఆ జాగాలను మిగిలిపోయిన ప్లాట్లుగా ఎలా పేర్కొంటారని ప్రశ్నించింది. ప్రభుత్వమే ప్రైవేటు డెవలపర్‌ తరహాలో వ్యవహరిస్తామంటే కుదరదని తెలిపింది. ఆ ఓపెన్‌ప్లాట్లను స్థానిక సంస్థకు బదిలీ చేసినట్లు ఆధారాలు చూపించలేదని పేర్కొంది. అందువల్ల వాటి విక్రయాన్ని ఖరారు చేయకూడదని ఆదేశించింది. తదుపరి విచారణ 30కి వాయిదా పడింది.


ఈ వార్తలు కూడా చదవండి:

Virender Sehwag: విడాకులు తీసుకోనున్న వీరేంద్ర సెహ్వాగ్..

Kaleshwaram Commission: నేటి కాళేశ్వరం విచారణ.. అత్యంత కీలకం

Updated Date - Jan 25 , 2025 | 03:51 AM