Share News

Miss World 2025: చేనేత వస్త్రాల్లో మరింత అందంగా..

ABN , Publish Date - May 25 , 2025 | 04:53 AM

మిస్‌ వరల్డ్‌ వేదికపై తెలంగాణ చేనేత వస్త్రాలు తళుక్కున మెరిశాయి. శనివారం ట్రైడెంట్‌ హోటల్‌లో జరిగిన వరల్డ్‌ ఫ్యాషన్‌ ఫినాలేలో ప్రపంచ సుందరి పోటీదారులంతా అంతర్జాతీయ ఖ్యాతి పొందిన పోచంపల్లి, గద్వాల్‌ చేనేత వస్త్రాలు ధరించి ర్యాంప్‌ వాక్‌ చేశారు.

Miss World 2025: చేనేత వస్త్రాల్లో మరింత అందంగా..

  • పోచంపల్లి, గద్వాల, గొల్లభామ చీరలతో అందాల భామల ర్యాంప్‌ వాక్‌

  • తర్వాత ఆధునిక ఫ్యాషన్‌ వస్త్రాలతోనూ..

  • ఘనంగా మిస్‌ వరల్డ్‌ ఫ్యాషన్‌ ఫినాలే

  • ఆసియా-ఓషియానా విజేతగా నందిని

హైదరాబాద్‌, మే 24 (ఆంధ్రజ్యోతి): మిస్‌ వరల్డ్‌ వేదికపై తెలంగాణ చేనేత వస్త్రాలు తళుక్కున మెరిశాయి. శనివారం ట్రైడెంట్‌ హోటల్‌లో జరిగిన వరల్డ్‌ ఫ్యాషన్‌ ఫినాలేలో ప్రపంచ సుందరి పోటీదారులంతా అంతర్జాతీయ ఖ్యాతి పొందిన పోచంపల్లి, గద్వాల్‌ చేనేత వస్త్రాలు ధరించి ర్యాంప్‌ వాక్‌ చేశారు. సంప్రదాయబద్ధమైన దుస్తుల్లో అలరించారు. అమెరికా, కరేబియన్‌ దేశాల సుందరీమణులు చేనేత వస్ర్తాలు ధరించి.. యూరోప్‌, ఏషియా, ఓషియానా అందగత్తెలు గొల్లభామ చేనేత చీరలతో అలరించారు. తెలంగాణ సంస్కృతి ఉట్టిపడేలా, ఈ ప్రాంతానికే పరిమితమైన డిజైన్లతో ఈ వస్త్రాలు, చీరలను రూపొందించడం గమనార్హం. మిస్‌ ఇండియా నందిని గుప్తా ఎరుపు రంగు పటోలా లెహంగాలో తళుక్కుమన్నారు. తెలంగాణ చేనేత వస్త్రాలను ప్రపంచ సుందరి పోటీదారుల కోసం డిజైన్‌ చేయడం ఆనందంగా, గర్వంగా ఉందని డిజైనర్‌ అర్చనా కొచ్చారు ఈ సందర్భంగా పేర్కొన్నారు.

28.jpg


ఈ కార్యక్రమంతో తెలంగాణ చేనేత చీరలు, ఇతర వస్త్రాలకు ప్రపంచవ్యాప్తంగా ఖ్యాతి దక్కుతుందని తెలిపారు. ఇక ఫ్యాషన్‌ ఫినాలే న్యాయనిర్ణేతలు, ఆహూతులు తెలంగాణ సంప్రదాయ డిజైన్లను చూసి ప్రశంసలు కురిపించారు. ప్రపంచ దేశాల సుందరీమణులు స్థానిక చేనేత వస్త్రాలను అంతర్జాతీయ వేదికపై ప్రదర్శించటం.. ఆ డిజైన్లకు, తయారీదారులకు మంచి గుర్తింపును, మార్కెటింగ్‌ అవకాశాలను ఇస్తుందని చెప్పారు. తెలంగాణ చేనేత వస్ర్తాలతో సందడి చేసిన అనంతరం.. ప్రపంచ ప్రఖ్యాత డిజైనర్లు రూపొందించిన ఆధునిక ఫ్యాషన్‌ వస్త్రాలతో అందాల భామలు ర్యాంప్‌ వాక్‌ చేశారు. తెలంగాణ చేనేత వస్ర్తాల కార్యక్రమానికి సంబంధించి.. ఏషియా-ఓషియానా విభాగంలో టాప్‌ మోడల్‌ ఫైనల్‌ టైటిల్‌ను భారత సుందరి నందినీ గుప్తా సాధించారు. యూరప్‌ విభాగంలో ఐర్లాండ్‌, అమెరికన్‌ విభాగంలో మార్టేనికూ, ఆఫ్రికన్‌ విభాగంలో నమీబియా అందగత్తెలు విజేతగా నిలిచారు.


ఇవి కూడా చదవండి

Government Doctor: భార్యను పుట్టింటికి పంపించి.. వేరే మగాళ్లతో ఇంట్లో ఆ వీడియోలు..

Telangana: కవిత చెప్పిన దెయ్యాలు వారే.. సామ సంచలన కామెంట్స్..

Updated Date - May 25 , 2025 | 05:53 AM