Share News

Telangana Hospital Diesel Generators: ఆస్పత్రుల్లో కరెంట్‌ కష్టాలకు చెక్‌

ABN , Publish Date - Jul 23 , 2025 | 04:42 AM

గత ఏప్రిల్‌లో పెద్దపల్లి జిల్లా గోదావరిఖని జనరల్‌ ఆస్పత్రిలో విద్యుత్తు సరఫరాలో ..

Telangana Hospital Diesel Generators: ఆస్పత్రుల్లో కరెంట్‌ కష్టాలకు చెక్‌
Telangana Hospital Diesel Generators

  • 107 ఆస్పత్రుల్లో డీజిల్‌ జనరేటర్లు.. 3 నెలల్లో ఏర్పాటు

  • రూ.21.96 కోట్లు మంజూరు.. కొనుగోలుకు టెండర్లు

  • రాష్ట్రంలోని 215 ఆస్పత్రుల్లో 109 చోట్ల ఇప్పటికే జనరేటర్లు

హైదరాబాద్‌, జూలై 22 (ఆంధ్రజ్యోతి): గత ఏప్రిల్‌లో పెద్దపల్లి జిల్లా గోదావరిఖని జనరల్‌ ఆస్పత్రిలో విద్యుత్తు సరఫరాలో తీవ్ర అంతరాయం నెలకొంది. జనరేటర్‌ లేకపోవడంతో అక్కడున్న నవజాత శిశువులు అల్లాడిపోయారు. ఇటీవల ఉమ్మడి మెదక్‌ జిల్లాలోని ఓ సర్కారు దవాఖానాలో కరెం టు పోవడంతో అక్కడి డ్యూటీ డాక్టర్‌ సెల్‌ఫోన్‌ లైట్‌ వేసుకుని రోగులకు వైద్యం చేశారు. ఇలాంటి ఘటనలు ప్రభుత్వ ఆస్పత్రుల్లో చాలాచోట్ల నెలకొంటున్నాయి. ఈదురుగాలులు, వర్షాల కారణంగా విద్యుత్తు సరఫరాలో అంతరాయం.. అప్రకటిత కోతల కారణంగా ప్రభుత్వ ఆస్పత్రుల్లో కరెంట్‌ లేక రోగులు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. డెలివరీలు, ఆపరేషన్ల సమయాల్లో తీవ్ర ఇబ్బందులు ఎదురవుతున్నా యి. ఈ సమస్య పరిష్కారంపై సర్కారు దృష్టి పెట్టింది. రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వ ఆస్పత్రుల్లో పవర్‌ బ్యాక్‌పపై సర్వే నిర్వహించింది. రాష్ట్రంలో డైరెక్టరేట్‌ మెడికల్‌ ఎడ్యుకేషన్‌ (డీఎంఈ), వైద్య విధాన పరిషత్తు (వీవీపీ) పరిధిలో మొత్తంగా 215 ఆస్పత్రులున్నాయి. డీఎంఈ పరిధిలోని 47 ఆస్పత్రులకుగాను 38 చోట్ల, వీవీపీలో 168కి గాను 71 చోట్ల మాత్రమే డీజిల్‌ జనరేటర్లు ఉన్నట్లు వెల్లడైంది. ఆ మేరకు రాష్ట్రవ్యాప్తంగా 107 ఆస్పత్రుల్లో (49శాతం) కరెంట్‌ కష్టాలున్నట్లుగా గుర్తించారు. ఈ ఆస్పత్రుల కోసం డీజిల్‌ జనరేటర్లను వెంటనే కొనుగోలు చేయాలని ఈ సర్వే సిఫారసు చేసింది. సర్వే నివేదిక ఆధారంగా 107 ఆస్పత్రుల్లో డీజిల్‌ జనరేటర్లు కొనుగోలు చేయాలని సర్కారు ఆదేశించింది. జూలై 3న జనరేటర్ల కొనుగోలుకు రూ.21.96 కోట్లు విడుదల చేస్తూ జీవో జారీ చేసింది. మొత్తం 107 ఆస్పత్రుల్లో పవర్‌ బ్యాకప్‌ ఏర్పాట్లు చేయాలని ఆ ఉత్తర్వుల్లో పేర్కొంది. ఈ మేరకు తెలంగాణ వైద్య సేవలు మౌలిక సదుపాయాల అభివృద్ధి సంస్థ (టీజీఎంఎస్ఐడీసీ) డీజిల్‌ జనరేటర్ల కొనుగోలుకు టెండర్లు పిలిచింది. ఈ నెలాఖరు వరకు టెండర్లకు గడువు విధించింది. టెండరు దక్కించుకున్న సంస్థ 3 నెలల్లో జనరేటర్లను ఏర్పాటు చేయాల్సి ఉంటుంది. అక్టోబరు చివరి నాటికి జనరేటర్ల ఏర్పాటు పూర్తవుతుందని వైద్యవర్గాలు పేర్కొన్నాయి. వీటి నిర్వహణ బాధ్యతను సంబంధిత ఆస్పత్రుల సూపరింటెండెంట్లకే అప్పగించారు. జనరేటర్లకు మరమ్మతులు చేయిచాల్సి వస్తే ఆస్పత్రి అభివృద్ధి నిధుల (హెచ్‌డీఎస్) నుంచి వెచ్చించాలని సర్కారు సూచించింది.


నిలోఫర్‌లో తీరనున్న కష్టాలు

హైదరాబాద్‌లో పిల్లల పెద్దాస్పత్రిగా పేరుగాంచిన నిలోఫర్‌లో పవర్‌ బ్యాకప్‌ సరిగా లేదని సర్వే లో వెల్లడైంది. ఆ ఆస్పత్రి కోసం రెండు డీజిల్‌ జనరేటర్లు కొనుగోలు చేయనున్నారు. 320 కేవీఏ, 500 కేవీఏ సామర్థ్యంగల డీజిల్‌ జనరేటర్లను అక్కడ ఏర్పాటు చేయనున్నారు. హైదరాబాద్‌లోని గోల్కొం డ డెంటల్‌ కాలేజీ ఆస్పత్రి, ఎర్రగడ్డలోని మానసిక ఆస్పత్రితో పాటు ఆదిలాబాద్‌ రిమ్స్‌, కొత్తగూడెం, సిరిసిల్ల, నారాయణపేట, గద్వాల బోధనాస్పత్రులు, మేడ్చల్‌లోని ఏరియా ఆస్పత్రికి జనరేటర్లను కొనుగోలు చేస్తున్నారు. ఇక వీవీపీ పరిధిలోని అర్బన్‌ హెల్త్‌ సెంటర్లు, కమ్యూనిటీ హెల్త్‌ సెంటర్లు, ఏరియా ఆస్పత్రుల్లోనూ జనరేటర్లు ఏర్పాటు చేయనున్నారు. హైదరాబాద్‌ జిల్లాలో 10, ఆదిలాబాద్‌లో 2, కొత్తగూడెంలో 3, జగిత్యాలలో 3, జనగాంలో 2, కామారెడ్డిలో 7, కరీంనగర్‌లో 2, ఖమ్మంలో 3, ఆసిఫాబాద్‌లో 5, మహబూబాబాద్‌లో 4, మెదక్‌లో 2, మేడ్చల్‌లో 3, నాగర్‌ కర్నూల్‌లో 3, నల్లగొండలో 4, నారాయణపేట్‌లో 2, నిర్మల్‌లో 2, నిజామాబాద్‌లో 5, పెద్దపల్లిలో 2, సిరిసిల్లలో 4, రంగారెడ్డి జిల్లాలో 9, సంగారెడ్డిలో 6, సిద్దిపేటలో 2, సూర్యాపేటలో 4, వికారాబాద్‌లో 2, వనపర్తిలో 4, యాదాద్రి, మహబూబ్‌నగర్‌ జిల్లాల్లో ఒక్కో ఆస్పత్రి కోసం జనరేటర్లను కొనుగోలు చేస్తున్నారు.

ఈ వార్తలు కూడా చదవండి..

కోర్టును ఆశ్రయించిన మహిళ.. సీజేఐ ఆసక్తికర వ్యాఖ్యలు

ధన్‌ఖఢ్ రాజీనామా వెనుక నితీష్‌ను తప్పించే కుట్ర.. ఆర్జేడీ ఆరోపణ

మరిన్ని జాతీయతెలుగు వార్తల కోసం క్లిక్ చేయండి

Updated Date - Jul 23 , 2025 | 04:42 AM