Share News

Medaram Jatara: మేడారం ఖ్యాతి ఖండాంతరాలు దాటాలి

ABN , Publish Date - Sep 04 , 2025 | 04:27 AM

తెలంగాణ ఆత్మగౌరవానికి ప్రతీకలైన మేడారం సమ్మక్క, సారలమ్మ వనదేవతల జాతర ఖ్యాతి ఖండాంతరాలు దాటాలని, ఈ మేరకు మహాజాతరను నిర్వహించనున్నట్లు మంత్రులు మంత్రి కొండా సురేఖ, ధనసరి అనసూయ సీతక్క, అడ్లూరి లక్ష్మణ్‌ కుమార్‌ తెలిపారు.

Medaram Jatara: మేడారం ఖ్యాతి ఖండాంతరాలు దాటాలి

మహాజాతరకు ముందే పనులు పూర్తి చేయాలి

  • ఒకే వరుసలో సమ్మక్క, సారలమ్మ పగిడిద్దరాజు, గోవిందరాజుల గద్దెలు

  • మేడారం మాస్టర్‌ ప్లాన్‌పై సమీక్ష నిర్వహించిన మంత్రులు సురేఖ, సీతక్క, అడ్లూరి లక్ష్మణ్‌

హైదరాబాద్‌/ములుగు, సెప్టెంబరు 3 (ఆంధ్రజ్యోతి): తెలంగాణ ఆత్మగౌరవానికి ప్రతీకలైన మేడారం సమ్మక్క, సారలమ్మ వనదేవతల జాతర ఖ్యాతి ఖండాంతరాలు దాటాలని, ఈ మేరకు మహాజాతరను నిర్వహించనున్నట్లు మంత్రులు మంత్రి కొండా సురేఖ, ధనసరి అనసూయ సీతక్క, అడ్లూరి లక్ష్మణ్‌ కుమార్‌ తెలిపారు. జాతర ఏర్పాట్లు, ప్రాంగణంలో శాశ్వత నిర్మాణాలపై మంత్రులు సచివాలయంలో దేవాదాయ శాఖ మంత్రి చాంబర్‌లో బుధవారం ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించారు. సమీక్షలో దేవాదాయ శాఖ ముఖ్య కార్యదర్శి శైలజారామయ్యర్‌, ములుగు కలెక్టర్‌ దివాకర్‌ ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మేడారం పూజారుల సూచనల మేరకు వనదేవతల ప్రాంగణ నూతన డిజైన్‌ను మంత్రులు పరిశీలించారు. డిజైన్లలో చేయాల్సిన మార్పులపై సూచనలు చేశారు. మేడారం నిర్వహణ పనులను మహాజాతరలోపు పూర్తి చేసేలా చర్యలు చేపట్టాలని అధికారులు, నిర్మాణ సంస్థను మంత్రులు ఆదేశించారు. భక్తుల సందర్శనార్థం వనదేవతల గద్దెల ఎత్తు పెంచాలని పూజారులు మంత్రుల దృష్టికి తీసుకురాగా.. తగిన మేరకు డిజైన్లు మార్చాలనీ సూచించారు. భక్తుల సందర్శనార్థం సమ్మక్క, సారలమ్మ, పగిడిద్దరాజు గోవిందరాజుల గద్దెలు ఒకే వరుస క్రమంలో ఉండేలా ఏర్పాటు చేయాలని ఆదేశించారు. తద్వారా ఎలాంటి జాప్యం లేకుండా వనదేవతలను భక్తులు దర్శించుకునేందుకు అనువుగా ఉంటుందని మంత్రులు చెప్పారు. గత జాతర అనుభవాలను దృష్టిలో ఉంచుకొని మరిన్ని ఏర్పాట్లు చేయాలని, జాతర సమయంలో భక్తులకు సహాయపడేందుకు వాలంటీర్లను నియమించాలని సూచించారు. ఆదివాసి సంస్కృతి సంప్రదాయాలకనుగుణంగా మేడారం పరిసరాలను తీర్చిదిద్దాలన్నారు. ఈసారి మహాజాతరకు ప్రభుత్వం రూ.150 కోట్లు కేటాయించిందని మంత్రులు తెలిపారు.


ఇందిరా మహిళా క్యాంటీన్లు

జాతరకు వెళ్లే మార్గాల్లో ఇందిరా మహిళా క్యాంటీ న్లను ఏర్పాటు చేయాలని అధికారులకు మంత్రులు సూచించారు. ఈ క్యాంటీన్ల ద్వారా భక్తులకు అవసరమైన తినుబండారాలు అందేలా చూడాలన్నారు. అవసరమైతే అంగన్‌వాడీ టీచర్లు, ఆశా కార్యకర్తల ద్వారా సేవలందించేలా చర్యలు తీసుకోవాలన్నారు.

రూ.236.2 కోట్లతో మాస్టర్‌ ప్లాన్‌

  • గద్దెల అభివృద్ధికి రూ. 58.2 కోట్లు

  • గద్దెల వద్ద కళాకృతి పనులకు రూ.6.8 కోట్లు

  • జంపన్న వాగు అభివృదికి రూ.39 కోట్లు.

  • భక్తుల వసతి ఏర్పాట్లకు రూ.50 కోట్లు

  • రోడ్ల అభివృద్ధి పనులకు రూ.52.5 కోట్లు

  • మిగతా నిధులు ఇతరత్రా పనులు, ఖర్చుల నిమిత్తం వెచ్చించనున్నారు.


ఇవి కూడా చదవండి

బీఆర్ఎస్ పార్టీకి, ఎమ్మెల్సీ పదవికీ కవిత రాజీనామా..

వేరే పార్టీలో చేరికపై క్లారిటీ ఇచ్చిన కల్వకుంట్ల కవిత

Updated Date - Sep 04 , 2025 | 04:27 AM