Share News

Rice Auction: 7 లక్షల టన్నుల పాత ధాన్యానికి మళ్లీ వేలం!

ABN , Publish Date - Aug 14 , 2025 | 04:31 AM

రాష్ట్రంలో యాసంగి (2022-23) సీజన్‌లో రైస్‌మిల్లర్ల వద్ద మిగిలిపోయిన 7.09 లక్షల మెట్రిక్‌ టన్నుల ధాన్యాన్ని మళ్లీ వేలంపాటలో (రీ- టెండర్‌) విక్రయించాలని మంత్రివర్గ ఉపసంఘం రాష్ట్ర ప్రభుత్వానికి సిఫారసు చేసింది.

Rice Auction: 7 లక్షల టన్నుల పాత ధాన్యానికి మళ్లీ వేలం!

  • క్వింటాకు 2 వేల చొప్పున ధర ఖరారు

  • అంతకంటే ఎక్కువ కోట్‌ చేస్తేనే అమ్మకం

  • ప్రభుత్వానికి ఉపసంఘం సిఫారసులు

హైదరాబాద్‌, ఆగస్టు 13 (ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలో యాసంగి (2022-23) సీజన్‌లో రైస్‌మిల్లర్ల వద్ద మిగిలిపోయిన 7.09 లక్షల మెట్రిక్‌ టన్నుల ధాన్యాన్ని మళ్లీ వేలంపాటలో (రీ- టెండర్‌) విక్రయించాలని మంత్రివర్గ ఉపసంఘం రాష్ట్ర ప్రభుత్వానికి సిఫారసు చేసింది. ఈ మేరకు డిప్యూటీ సీఎం భట్టివిక్రమార్క, మంత్రులు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, తుమ్మల నాగేశ్వరరావు, దుద్దిళ్ల శ్రీధర్‌బాబులతో కూడిన మంత్రివర్గ ఉపసంఘం నిర్ణయించింది. క్యాబినెట్‌ సమావేశంలో ఈ అంశంపై చర్చించి టెండరు నోటిఫికేషన్‌ జారీచేయాలని ప్రభుత్వం భావిస్తోంది. ఈసారి టెండరు నిబంధనల్లో కీలక మార్పులు చేయాలని కూడా మంత్రివర్గ ఉపసంఘం సూచించింది. గతంలో టెండర్లు పిలిచినపుడు ఎలాంటి మూల ధర నిర్ణయించలేదు. బిడ్డర్లు కోట్‌ చేసిన ధరల ఆధారంగా.. ఎక్కువ కోట్‌ చేసిన ఏజెన్సీలకు టెండర్లు అప్పగించారు. ఈసారి అలాకాకుండా మంత్రివర్గ ఉపసంఘం మూల ధరను క్వింటాలుకు రూ.2 వేల చొప్పున నిర్ణయించింది. ఆన్‌లైన్‌లో మూల ధర కంటే ఎక్కువ ధర కోట్‌ చేసిన ఏజెన్సీకే టెండర్లు ఖరారు చేస్తారు.


పాత బిడ్డర్ల డిపాజిట్‌ రూ.66 కోట్ల జప్తు

పాత టెండరు అగ్రిమెంటు ప్రకారం కేంద్రీయ భండార్‌ 2.58 లక్షల మెట్రిక్‌ టన్నుల ధాన్యం తీసుకెళ్లలేదు. న్యాకాఫ్‌ (నేషనల్‌ అగ్రికల్చర్‌ కో-ఆపరేటివ్‌ ఫెడరేషన్‌) 4.51 లక్షల టన్నుల ధాన్యాన్ని రైస్‌మిల్లర్ల నుంచి తీసుకోలేదు. అయితే కేంద్రీయ భండార్‌ సెక్యూరిటీ డిపాజిట్‌ రూ.112 కోట్లు ప్రభుత్వం వద్ద ఉంది. న్యాకాఫ్‌ డిపాజిట్‌ రూ.168 కోట్లు ఉంది. ఇందులో అగ్రిమెంటు ప్రకారం తీసుకోని ధాన్యానికి గాను కేంద్రీయ భండార్‌ నుంచి రూ.24 కోట్లు, న్యాకాఫ్‌ నుంచి రూ.42 కోట్లు కలిపి రూ.66 కోట్లు జప్తుచేయాలని ఉపసంఘం నిర్ణయించింది. మరోవైపు మిల్లర్లు 5.41 లక్షల టన్నుల టెండరు ధాన్యాన్ని బహిరంగ మార్కెట్లో అమ్ముకున్నట్లు విజిలెన్స్‌ తనిఖీల్లో నిర్ధారణ అయ్యింది. ధాన్యం రికవరీతోపాటుు 25 శాతం జరిమానా విధించి.. 125 శాతం ధాన్యం రికవరీ చేయాలనే చర్చ ఉపసంఘంలో వచ్చింది. అయితే దీనిపై ఇంకా స్పష్టమైన నిర్ణయం తీసుకోలేదని తెలిసింది. గతంలో నిర్వహించిన టెండర్లలో పాల్గొని 12వ లాట్‌ను దక్కించుకున్న హిందుస్థాన్‌ ఏజెన్సీకి మాత్రం మినహాయింపునిచ్చారు. ఈ ఏజెన్సీకి 1.59 లక్షల మెట్రిక్‌ టన్నుల ధాన్యం దక్కింది. అయితే గడిచిన ఏడాదిన్నరలో ఒక్క గింజ కూడా రైస్‌మిల్లుల నుంచి తీసుకోలేదు. కానీ, ఈ ఏజెన్సీపై ఎలాంటి చర్యలు తీసుకోలేదు.


ఈ వార్తలు కూడా చదవండి..

సోనియా గాంధీ లక్ష్యంగా సంచలన ఆరోపణలు..

రిమాండ్ పొడిగింపు.. కోర్టు వద్ద చెవిరెడ్డి హల్‌చల్

Read latest Telangana News And Telugu News

Updated Date - Aug 14 , 2025 | 04:32 AM