Share News

CM Revanth Reddy: సమాంతర సమరం

ABN , Publish Date - Aug 26 , 2025 | 03:28 AM

తెలంగాణలో స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించి బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు కల్పించే విషయమై ప్రభుత్వం స్పష్టతకు వచ్చింది. రాజకీయ పోరాటంతో పాటు న్యాయ పోరాటం సైతం చేయాలని నిర్ణయించింది. సీఎం రేవంత్‌రెడ్డి...

CM Revanth Reddy: సమాంతర సమరం

  • ఇటు పార్టీల పరంగా 42 శాతం రిజర్వేషన్లు

  • అటు సుప్రీంకోర్టులో న్యాయ పోరాటం

  • ఒకేసారి చేపట్టాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం

  • బీసీ రిజర్వేషన్లపై ఢిల్లీలో మేధోమథనం

  • జస్టిస్‌ సుదర్శన్‌రెడ్డి, సింఘ్వీలతో మంతనాలు

  • వేణుగోపాల్‌తో ముఖ్యమంత్రి, మంత్రుల భేటీ

  • నేడు బిహార్‌కు రేవంత్‌, మంత్రుల బృందం

న్యూఢిల్లీ, ఆగస్టు 25 (ఆంధ్రజ్యోతి): తెలంగాణలో స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించి బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు కల్పించే విషయమై ప్రభుత్వం స్పష్టతకు వచ్చింది. రాజకీయ పోరాటంతో పాటు న్యాయ పోరాటం సైతం చేయాలని నిర్ణయించింది. సీఎం రేవంత్‌రెడ్డి, ఈ అంశంపై వేసిన మంత్రుల కమిటీ సోమవారం ఢిల్లీకి చేరుకున్నారు. సాయంత్రం న్యాయ నిపుణుడు, రాజ్యసభ సభ్యుడు అభిషేక్‌ సింఘ్వీతో ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, మంత్రులు శ్రీధర్‌ బాబు, ఉత్తమ్‌ కుమార్‌ రెడ్డి, పొన్నం ప్రభాకర్‌, సీనియర్‌ నేతలు కేశవరావు, వి.హనుమంతరావు, ఖనిజాభివృద్ధి కార్పొరేషన్‌ చైర్మన్‌ ఇరవత్రి అనిల్‌ భేటీ అయ్యారు. కుల గణనపై నిపుణుల కమిటీ చైర్మన్‌, ఇండియా కూటమి ఉప రాష్ట్రపతి అభ్యర్థి జస్టిస్‌ సుదర్శన్‌రెడ్డిని పొన్నం ప్రభాకర్‌, సీతక్క, శ్రీధర్‌ బాబు, ఈరావత్రి అనిల్‌, వినయ్‌ కుమార్‌ కలిశారు. స్థానిక సంస్థల ఎన్నికలు సెప్టెంబర్‌ 30 లోపు నిర్వహించాలని, అంతకంటే ముందు రిజర్వేషన్లు ఖరారు చేయాలని హైకోర్టు ఆదేశించిన అంశంపై ఇరువురితో చర్చించారు. బీసీలకు రిజర్వేషన్ల అమలు అధికారికంగా చేసే వెసులుబాటు లేకపోతే ఏ విధంగా స్థానిక సంస్థల ఎన్నికలకు వెళ్లాలి? పార్టీ పరంగా రిజర్వేషన్లు కల్పిస్తే ఎలా ఉంటుంది? అనే అంశంపై చర్చించారు. రాష్ట్రపతి, గవర్నర్‌ కాలయాపనపై సుప్రీంను ఆశ్రయిస్తే? విద్య, ఉద్యోగాలు, స్థానిక ఎన్నికల్లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్‌ కల్పిస్తూ మార్చి 17న తెలంగాణ అసెంబ్లీ ఆమోదించిన రెండు బిల్లులూ ఐదు నెలలుగా రాష్ట్రపతి వద్దనే పెండింగ్‌లో ఉండటంపై చర్చించారు. రాష్ట్రపతి, గవర్నర్‌ల కాలయాపనపై సుప్రీంకోర్టును ఆశ్రయిస్తే ఎలా ఉంటుందని సింఘ్వీతో చర్చించారు. రాష్ట్రాలు పంపిన బిల్లులపైన 90 రోజుల్లోగా రాష్ట్రపతి నిర్ణయం తీసుకోవాలంటూ సుప్రీంకోర్టు ఇచ్చిన రూలింగ్‌ బీసీ రిజర్వేషన్ల బిల్లులకూ వర్తిస్తుందా? అనే అంశంపైనే ప్రధానంగా చర్చించారు. సుప్రీంకోర్టుకు వెళితే ఆ కారణం చూపి, పంచాయతీ ఎన్నికల నిర్వహణకు హైకోర్టును గడువు కోరే అవకాశం పైనా చర్చలు జరిగాయి. సభలో బీసీ బిల్లులపై తీర్మానం పెట్టి ఆమోదించి, దాని ఆధారంగా జీవో తేవొచ్చా అనేదీ చర్చించారు. పార్టీ పరంగా బీసీలకు 42 శాతం రిజర్వేషన్‌తో స్థానిక ఎన్నికలపై ముందుకు వెళుతూనే బిల్లుల ఆమోదం కోసం సుప్రీంకోర్టును ఆశ్రయించడం అనేదే ఖాయంగా కనిపిస్తోంది. ఆగస్ట్‌ 28 లోగా మంత్రివర్గ ఉపసంఘం ప్రభుత్వానికి నివేదిక సమర్పించాలి. 29న మంత్రివర్గ సమావేశం నిర్వహించి నిర్ణయం తీసుకోవాలి. ఢిల్లీలో సోమవారం సమావేశంతో ఈ అంశంపై ఏం చేయాలన్న దానిపై స్పష్టత వచ్చినట్లు సమాచారం.


కేసీ వేణుగోపాల్‌తో రేవంత్‌, భట్టి భేటీ

కేసీ వేణుగోపాల్‌తో రేవంత్‌, భట్టి, ఉత్తమ్‌, పొంగులేటి, పొన్నం భేటీ అయ్యారు. బీసీ రిజర్వేషన్లు, కార్పొరేషన్‌ చైర్మన్లు, మంత్రివర్గ విస్తరణ, జూబ్లిహిల్స్‌ ఉప ఎన్నికపై చర్చించారు. మంగళవారం ఉదయమే ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డితోపాటు మంత్రులు బిహార్‌ వెళ్లనున్నారు. రాహుల్‌గాంధీ ఓటర్‌ అధికార్‌ యాత్రలో మంత్రులు పాల్గొంటారు.


ఇవి కూడా చదవండి..

ఎన్ని ఒత్తిళ్లు ఎదురైనా రైతులకు హాని జరగనీయం.. అమెరికా టారిఫ్‌లపై మోదీ

ట్రంప్ టారిఫ్‌లపై పీఎంవో కీలక సమావేశం

For More National News

Updated Date - Aug 26 , 2025 | 03:28 AM