Work Hours: రోజుకు గరిష్ఠంగా 10 గంటల పని
ABN , Publish Date - Jul 06 , 2025 | 04:14 AM
కార్మికశాఖ పర్యవేక్షణలో ఉండే సంస్థల్లో పనిచేసే ఉద్యోగులు కార్మికుల పని గంటల విషయంలో నిబంధనలను ప్రభుత్వం సవరించింది.
వారానికి 48 గంటలు..
మించితే ఓవర్‌టైమ్ వేతనం
నిరాఘాటంగా 6 పని గంటలకు మించవద్దు
అరగంట విశ్రాంతి తప్పనిసరి
త్రైమాసికంలో ఓటీ.. 144 పని గంటలు దాటరాదు
రాష్ట్ర కార్మిక శాఖ తాజా నోటిఫికేషన్
హైదరాబాద్, జూలై 5 (ఆంధ్రజ్యోతి): కార్మికశాఖ పర్యవేక్షణలో ఉండే సంస్థల్లో పనిచేసే ఉద్యోగులు/కార్మికుల పని గంటల విషయంలో నిబంధనలను ప్రభుత్వం సవరించింది. ఏదైనా సంస్థ తమ ఉద్యోగి/కార్మికుడితో రోజులో గరిష్ఠంగా 10 గంటలపాటు పని చేయించుకోవచ్చని తెలిపింది. అయితే వారం మొత్తం కలిపి 48 గంటలపాటు మాత్రమే పనిచేయించాలనే నిబంధనకు లోబడి ఈ 10 గంటల పని ఉండాలని పేర్కొంటూ ఈ వెసులుబాటు కల్పించింది. ఈ మేరకు సులభతర వాణిజ్యంలో భాగంగా తెలంగాణ దుకాణాలు, సంస్థల చట్టం-1980లోని సెక్షన్-73 సబ్ సెక్షన్-4 ద్వారా దఖలు పడిన అధికారాలను అనుసరిస్తూ కార్మిక శాఖ ముఖ్యకార్యదర్శి ఎం.దానకిశోర్ శనివారం నోటిఫికేషన్ జారీ చేశారు.
ఇక నిరాఘాటంగా 6 గంటలకు మించి ఏ ఉద్యోగి/కార్మికుడితో పనిచేయించడానికి వీల్లేదని, మధ్యలో కనీసం 30 నిమిషాలపాటు విరామం తప్పనిసరిగా ఉండాలని పేర్కొన్నారు. వారంలో 48 గంటల మించి పనిచేస్తే.. విధిగా ఓవర్ టైమ్ వేతనం అందుకోవడానికి ఉద్యోగి/కార్మికుడు అర్హుడని తెలిపారు. కాగా, ఏ ఉద్యోగితో అయినా విశ్రాంతికి లోబడి 12 గంటలకు మించి కూడా పని చేయించడానికి అవకాశం ఉంటుంది. అయితే ఇది కూడా ఒక త్రైమాసికంలో 144 గంటలు, వారంలో 48 గంటల పనిగంటలకు లోబడే ఉంటుంది. ఇక ఈ ఉత్తర్వులను ఉల్లంఘిస్తే కంపెనీకి ఇచ్చిన వెసులుబాటును ఎలాంటి నోటీసు లేకుండా రద్దు చేస్తారు.
ఇవి కూడా చదవండి
తిరుపతికి వెళ్లేందుకు గూగుల్‌ను నమ్మారు.. తీరా చూస్తే
మహిళలను కోటీశ్వరులను చేయడమే లక్ష్యంగా ముందుకు: డిప్యూటీ సీఎం భట్టి
Read Latest Telangana News And Telugu News