Share News

Double Decker Road: 8 లేన్లతో డబుల్‌ డెక్కర్‌ ఎలివేటెడ్‌ కారిడార్‌

ABN , Publish Date - Aug 04 , 2025 | 04:08 AM

హైదరాబాద్‌-విజయవాడ నేషనల్‌ హైవేపై ట్రాఫిక్‌ రద్దీని తగ్గించేందుకు ఎల్బీ నగర్‌ నుంచి హయత్‌నగర్‌ వరకు 5.5 కిలోమీటర్ల మేర 8వరుసలతో డబుల్‌ డెక్కర్‌ ఎలివేటెడ్‌ కారిడార్‌(రోడ్డు)ను నిర్మించాలని రాష్ట్ర ప్రభుత్వం యోచిస్తోంది.

Double Decker Road: 8 లేన్లతో డబుల్‌ డెక్కర్‌ ఎలివేటెడ్‌ కారిడార్‌

  • విజయవాడ హైవేలో ఎల్బీనగర్‌ నుంచి

  • హయత్‌నగర్‌ రేడియో స్టేషన్‌ వరకు నిర్మాణం

  • 5.5 కిలోమీటర్ల దూరం.. రూ.650 కోట్ల ఖర్చు

  • అనుమతుల కోసం 6న కేంద్ర మంత్రి గడ్కరీని కలుస్తా

  • ఆర్‌అండ్‌బీ మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి వెల్లడి

హైదరాబాద్‌/మన్సూరాబాద్‌, ఆగస్టు 3 (ఆంధ్రజ్యోతి): హైదరాబాద్‌-విజయవాడ నేషనల్‌ హైవేపై ట్రాఫిక్‌ రద్దీని తగ్గించేందుకు ఎల్బీ నగర్‌ నుంచి హయత్‌నగర్‌ వరకు 5.5 కిలోమీటర్ల మేర 8వరుసలతో డబుల్‌ డెక్కర్‌ ఎలివేటెడ్‌ కారిడార్‌(రోడ్డు)ను నిర్మించాలని రాష్ట్ర ప్రభుత్వం యోచిస్తోంది. ఇందుకు రూ.650 కోట్ల వరకు ఖర్చవుతుందని ప్రాథమికంగా అంచనా వేసింది. నాగ్‌పూర్‌లో నిర్మించిన ఓ డబుల్‌ డెక్కర్‌ కారిడార్‌ నమూనాలోనే ఇక్కడ కూడా నిర్మించాలని భావిస్తున్నారు. ఆ నమూనా ప్రకారం కింది భాగంలో సర్వీస్‌ రోడ్డు ఉంటుంది. మధ్యలో ఎన్‌హెచ్‌-65 (విజయవాడ హైవే) మార్గం అనుసంధానమవుతుంది. దానిపైన మెట్రో రైలు మార్గం ఉంటుంది. ఈ మేరకు ఎలివేటెడ్‌ కారిడార్‌ను మంజూరు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం కేంద్రాన్ని విజ్ఞప్తి చేయనుంది. ఇందుకోసం మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఈ నెల 6న కేంద్ర మంత్రి నితిన్‌ గడ్కరీని కలవనున్నారు. ఆదివారం ఆయన ఎల్బీనగర్‌ పనామా చౌరస్తా నుంచి హయత్‌నగర్‌ రేడియో స్టేషన్‌ వరకు విజయవాడ జాతీయ రహదారిని ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే మల్‌రెడ్డి రంగారెడ్డి, రోడ్ల అభివృద్ధి సంస్థ చైర్మన్‌ రాంరెడ్డితో కలిసి పరిశీలించారు. ఎలివేటెడ్‌ కారిడార్‌ కోసం వెంటనే డీపీఆర్‌ను సిద్ధం చేయాలని అధికారులను ఆదేశించారు. అనంతరం విలేకరులతో మాట్లాడారు. హైవే నుంచి ప్రధాన చౌరస్తాలు, కాలనీలకు వెళ్లే చోట్ల యూటర్న్‌లను ఏర్పాటు చేస్తూ డబుల్‌ డెక్కర్‌ రోడ్డును వచ్చే ఏడాది జూన్‌లోపు నిర్మిస్తామన్నారు.


విజయవాడ హైవేపై 17చోట్ల ప్రమాద స్థలాలను గుర్తించామని, ఆ ప్రాంతాల్లో ఫ్లైఓవర్‌ బ్రిడ్జిలను నిర్మిస్తామని తెలిపారు. హైదరాబాద్‌ నుంచి విజయవాడకు 2 గంటల్లో చేరుకునేలా మరో గ్రీన్‌ఫీల్డ్‌ ఎక్స్‌ప్రెస్‌ రోడ్డును నిర్మించనున్నామని, ఇదే విషయంపై ఏపీ సీఎం చంద్రబాబు కూడా కేంద్రానికి విజ్ఞప్తి చేశారని తెలిపారు. రెండు నెలల్లోనే ఈ పనులు మొదలవుతాయన్నారు. ప్రజల్లో కాంగ్రెస్‌ పాలనపై ఎంతో నమ్మకం ఏర్పడిందని, వచ్చే స్థానిక సంస్థల ఎన్నికల్లో 90ు సీట్లతో కాంగ్రెస్‌ అభ్యర్థులు తప్పక గెలుస్తారని ఆయన ధీమా వ్యక్తం చేశారు. కాగా, హైదరాబాద్‌-విజయవాడ (ఎన్‌హెచ్‌-65) మార్గంలో ఎల్బీనగర్‌ నుంచి ఔటర్‌ రింగు రోడ్డు వరకు ట్రాఫిక్‌ రద్దీ అధికంగా ఉంటోంది. అందుకే ఎన్‌హెచ్‌ఏఐ ఈ రోడ్డును విస్తరించడంతో పాటు అవసరమైన చోట్ల విజయవాడ వరకు ఫ్లై ఓవర్లు నిర్మిస్తోంది.


ఈ క్రమంలోనే 2021లో చింతలకుంట నుంచి మల్కాపూర్‌ వరకు దాదాపు 25కి.మీ. మేర రోడ్డు విస్తరణకు రూ.541కోట్లు మంజూరు చేసింది. హయత్‌నగర్‌, వనస్థలిపురంతో పాటు మరో ఒకటి, రెండు చోట్ల అండర్‌పా్‌సలను నిర్మించాలని నిర్ణయించారు. అయితే, అండర్‌పా్‌సలకు స్థానికులు అంగీకరించలేదు. ఫలితంగా ఈ కొద్ది దూరం మినహా మిగతా చోట్ల దాదాపు 80ు పనులు పూర్తయ్యాయి. ఈ నేపథ్యంలోనే ఎల్బీనగర్‌ చింతలకుంట నుంచి హయత్‌నగర్‌ వరకు డబుల్‌ డెక్కర్‌ ఎలివేటెడ్‌ కారిడార్‌ నిర్మించాలని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తోంది. కాగా, మెట్రో రైలు రెండో దశ అనుమతుల బాధ్యతను కూడా సీఎం రేవంత్‌ తనపై పెట్టారని వెంకట్‌ రెడ్డి చెప్పారు. త్వరలో రేవంత్‌తో కలిసి ప్రధాని మోదీ, కేంద్రమంత్రి గడ్కరీని కలుస్తామన్నారు.


ఈ వార్తలు కూడా చదవండి..

టాలీవుడ్‌లో షూటింగ్స్ బంద్..

కాళేశ్వరం కమిషన్ నివేదికపై కీలక భేటీ.. ఎందుకంటే..

ధర్మస్థలలో మరో షాకింగ్ ఘటన.. దేశవ్యాప్తంగా ఆందోళన

Read latest Telangana News And Telugu News

Updated Date - Aug 04 , 2025 | 04:08 AM