Share News

Telangana Land Value Increase: భూముల మార్కెట్‌ విలువ పెంపు

ABN , Publish Date - Jul 23 , 2025 | 04:38 AM

భూముల మార్కెట్‌ విలువలు పెంచేందుకు ప్రభుత్వం సన్నద్ధమైంది..

Telangana Land Value Increase: భూముల మార్కెట్‌ విలువ పెంపు
Telangana Land Value Increas

ఆ దిశగా సర్కార్‌ సన్నద్ధం.. వివరాల సేకరణ.. కొత్త ప్రాంతాలపై దృష్టి

  • 2013లో సమగ్ర అధ్యయనం.. పెంపు

  • ఆ తర్వాత విలువల సవరణలకు మాత్రమే పరిమితం

  • ఈ సారి అధ్యయనానికి రాష్ట్ర సర్కారు నిర్ణయం

  • కొత్తగా అభివృద్ధి చెందిన ప్రాంతాలపై నివేదిక కోరిన మంత్రి

  • నేడు నిర్ణయం తీసుకునే చాన్స్‌

హైదరాబాద్‌, జూలై 22 (ఆంధ్రజ్యోతి): భూముల మార్కెట్‌ విలువలు పెంచేందుకు ప్రభుత్వం సన్నద్ధమైంది. ఇందుకోసం అనేక కోణాల్లో వివరాలను సేకరిస్తోంది. 2013లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో.. రహదారులు, ప్రాంతాల ప్రాతిపదికన సమగ్ర అధ్యయనం జరిపిన తర్వాత భూముల ధరలను పెంచారు. తెలంగాణ ఆవిర్భావం తర్వాత.. 2021 వరకు భూముల విలువలను పెంచలేదు. 2021లో ప్రభుత్వం అప్పటి విలువలను 20% పెంచుతూ నిర్ణయం తీసుకుంది. 2022లో మరోసారి 33ు మేర పెంచారు. విలువల పెంపు తప్పితే.. ఈ రెండు సందర్భాల్లో సమగ్ర అధ్యయనం జరగలేదు. దీంతో.. ఇప్పుడు సమగ్ర అధ్యయనం జరిపి, భూముల విలువ పెంపునకు చర్యలు తీసుకోవాలని మంత్రి పొంగులేటి శ్రీనివా్‌సరెడ్డి స్టాంపులు-రిజిస్ట్రేషన్ల అధికారులను ఆదేశించారు. అధికారులు ఆ మేరకు నివేదికను సిద్ధం చేసినట్లు సమాచారం. బుధవారం సచివాలయంలో మంత్రి నేతృత్వంలో జరగనున్న సమావేశంలో దీనిపై సమీక్షించి, భూముల మార్కెట్‌ విలువల పెంపుపై ఓ నిర్ణయం తీసుకునే అవకాశాలున్నట్లు అధికారులు చెబుతున్నారు.

వ్యత్యాసాల్లేకుండా..

తెలంగాణ ఆవిర్భావం తర్వాత.. రహదారుల విస్తరణ, పట్టణీకరణ శరవేగంగా జరిగింది. 2014లో 69గా ఉన్న మునిసిపాలిటీలు ఇప్పుడు 158కి చేరాయి. జీహెచ్‌ఎంసీ, హెచ్‌ఎండీఏ పరిధిలో పారిశ్రామిక ప్రగతి, ఐటీపార్కుల ఏర్పాటు జరిగింది. అయితే.. దీనికి సంబంధించి సమగ్ర అధ్యయనం జరగలేదని ప్రభుత్వం గుర్తించింది. రాష్ట్రం విస్తీర్ణంలో సుమారు 49% పట్టణాలు ఉన్నట్లు ప్రభుత్వం భావిస్తోంది. దీంతో.. జరిగిన అభివృద్ధి ప్రాతిపదికన అధ్యయనం జరిపి, మార్కెట్‌ విలువలను పెంచాలని ప్రభుత్వం భావిస్తోంది. ఆ తర్వాత ఏటా కనీసం 2% పెంపుతో ముందుకు సాగాలని యోచిస్తోంది. మహారాష్ట్ర కూడా ఇదే విధంగా ఏటా 2% పెంపు నిబంధనను అమలు చేస్తోందని మార్కెట్‌ విలువలపై గతంలో అధ్యయనం చేసిన ఓ ఏజెన్సీ ప్రభుత్వానికి ఇచ్చిన నివేదికలో పేర్కొంది. రిజిస్ట్రేషన్లు బాగా పెరిగే ప్రాంతాల్లో ఏటా భూముల విలువలను పెంచడం వల్ల ప్రభుత్వ ఆదాయం పెరుగుతందని ఆ నివేదికలో సూచించింది. ఏటా కాకుండా.. మూడు-నాలుగేళ్లకు ఓసారి విలువలను పెంచితే.. రిజిస్ట్రేషన్ల సంఖ్య తగ్గిపోయి, ఉపయోగం ఉండకపోవచ్చని అభిప్రాయపడింది. ఈ క్రమంలో అన్ని కోణాల్లో సమగ్ర అధ్యయనం జరిపింది. ఈ నివేదికపై బుధవారం జరిగే సమీక్షలో చర్చించి, ప్రభుత్వం ఓ నిర్ణయం తీసుకునే అవకాశాలున్నాయి.


ఆదాయం పెంపుపై దృష్టి

ఆదాయ వనరుల సమీకరణలో భాగంగా ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క ఆధ్వర్యంలో జరుగుతున్న ప్రతి సమావేశంలో రిజిస్ట్రేషన్ల శాఖకు ఈ ఏడాది లక్ష్యాలను చేరుకునేందుకు వీలైన ప్రణాళికలతో రావాలని పదే పదే చెబుతున్నారు. ఆదాయం పెంపునకు భూముల విలువలు పెంచక తప్పని పరిస్థితి ఏర్పడినట్లు తెలుస్తోంది. గత ఏడాది ఆశించిన స్థాయిలో ఆదాయం రాకపోవడంతో.. ఈ ఆర్థిక సంవత్సరంలో మెరుగైన ఫలితాలు సాధించాలనే లక్ష్యంతో రిజిస్ట్రేషన్ల శాఖ ముందుకు సాగుతోంది. 2014నుంచి గత ఏడాది వరకు వచ్చిన ఆదాయ వివరాలను పరిశీలిస్తే.. కొవిడ్‌ కల్లోల సమయంలో వృద్ధి -25.5ు మేర పడిపోయింది. 2021-22లో ఒక్కసారిగా పుంజుకొని 135.17% వృద్ధిని సాధించినా.. 2023-24 నుంచి మూడు శాతం లోపే ఉంటోంది. 2024-25లో 3% అదనపు ఆదాయం వస్తుందని భావించినా.. ప్రతికూల ఫలితాలే కనిపించాయి. దీంతో ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి ప్రభుత్వం రూ.19 వేల కోట్లను లక్ష్యంగా పెట్టింది. ఈ లక్ష్యాన్ని సాధించాలంటే.. భూముల విలువల పెంపు తప్పనిసరి అని అధికారులు స్పష్టం చేస్తున్నారు.

ఈ వార్తలు కూడా చదవండి..

కోర్టును ఆశ్రయించిన మహిళ.. సీజేఐ ఆసక్తికర వ్యాఖ్యలు

ధన్‌ఖఢ్ రాజీనామా వెనుక నితీష్‌ను తప్పించే కుట్ర.. ఆర్జేడీ ఆరోపణ

మరిన్ని జాతీయతెలుగు వార్తల కోసం క్లిక్ చేయండి

Updated Date - Jul 23 , 2025 | 04:38 AM