Share News

local body elections: రాష్ట్రంలో 70 పంచాయతీలు తగ్గాయి!

ABN , Publish Date - Jul 17 , 2025 | 04:46 AM

స్థానిక సంస్థల ఎన్నికల విషయంలో రాష్ట్ర ప్రభుత్వం వడివడిగా అడుగులు వేస్తోంది. రాష్ట్రంలో వార్డులు, పంచాయతీలు, ఎంపీటీసీ, జడ్పీటీసీ, ఎంపీపీ, జడ్పీ చైర్మన్‌ స్థానాలను ఖరారు చేసింది.

local body elections: రాష్ట్రంలో 70 పంచాయతీలు తగ్గాయి!

660 వార్డులు.. 44 ఎంపీటీసీలు కూడా.. మొత్తం వార్డులు 1,12,694, పంచాయతీలు 12,778

  • ఎంపీటీసీలు 5,773.. ఎంపీపీ, జడ్పీటీసీలు 566.. స్థానిక సంస్థల నిర్ధారణ

  • పంచాయతీరాజ్‌ శాఖ ఉత్తర్వులు

  • గవర్నర్‌ నుంచి ఆర్డినెన్స్‌ వచ్చిన తర్వాత వారంలో రిజర్వేషన్లు!

హైదరాబాద్‌, జూలై 16 (ఆంధ్రజ్యోతి): స్థానిక సంస్థల ఎన్నికల విషయంలో రాష్ట్ర ప్రభుత్వం వడివడిగా అడుగులు వేస్తోంది. రాష్ట్రంలో వార్డులు, పంచాయతీలు, ఎంపీటీసీ, జడ్పీటీసీ, ఎంపీపీ, జడ్పీ చైర్మన్‌ స్థానాలను ఖరారు చేసింది. పలు గ్రామాలను కొత్త మునిసిపాలిటీల్లో విలీనం చేయడంతో స్థానిక సంస్థల సంఖ్య తగ్గింది. రాష్ట్రవ్యాప్తంగా ఎన్నికలు జరగాల్సిన స్థానిక సంస్థల సంఖ్యను ఖరారు చేస్తూ పంచాయతీరాజ్‌ శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. 2019లో 1,13,354 వార్డులుండగా ఇప్పుడా సంఖ్య 660 తగ్గి.. 1,12,694 వార్డులకు చేరింది. గతంలో 12,848 పంచాయతీలుండగా.. ప్రస్తుతం 12,778 ఉన్నాయి. 70 పంచాయతీలు తగ్గాయి. ఎంపీటీసీలు 5,817 ఉండగా.. 44 తగ్గి ఈ సారి 5,773కు; ఎంపీపీ, జడ్పీటీసీ స్థానాలు 570 ఉండగా 4 తగ్గి.. ఈ సారి 566 స్థానాల్లో ఎన్నికలు జరగనున్నాయి. రాష్ట్రంలో ప్రస్తుతం 32 జడ్పీ స్థానాలుండగా.. మేడ్చల్‌ మల్కాజిగిరి జిల్లా పరిధిలోని గ్రామాలన్నింటినీ మునిసిపాలిటీలో కలపడంతో ఈ స్థానం తగి 31కి చేరింది. మరోవైపు జిల్లా పంచాయతీ అధికారులు, ఎంపీడీవోలను స్థానిక ఎన్నికల నిర్వహణకు సన్నద్ధంగా ఉండాలని ఆ శాఖ ఉన్నతాధికారులు ఆదేశించారు. మరోవైపు స్థానిక ఎన్నికల్లో బీసీలకు 42శాతం రిజర్వేషన్ల అమలుకు పంచాయతీరాజ్‌ చట్టం-2018లోని సెక్షన్‌ 285(ఏ)లో సవరణ చేయడానికి గవర్నర్‌ ఆమోదం కోసం ఇప్పటికే ఆర్డినెన్స్‌ ముసాయిదాను పంపింది. గవర్నర్‌ దగ్గరి నుంచి ఆర్డినెన్స్‌ రావడమే తరువాయి అన్నట్లుగా రాష్ట్ర ప్రభుత్వం ఎన్నికల ప్రక్రియలో ముందుకెళుతోంది.


ఆర్డినెన్స్‌ రాగానే..

గవర్నర్‌ దగ్గరి నుంచి ఆర్డినెన్స్‌ వచ్చిన వారంలోపే రిజర్వేషన్ల అంశాన్ని తేల్చే దిశగా ప్రభుత్వం చర్యలు చేపడుతోంది. దాంతో పాటు ఎన్నికల సిబ్బందికి శిక్షణ కూడా పూర్తవనుంది. మొత్తంగా స్థానిక ఎన్నికల్లో రిజర్వేషన్ల ఖరారు ప్రక్రియను హైకోర్టు సూచించిన జూలై 25కల్లా పూర్తిచేయనున్నట్లు అధికార వర్గాలు చెబుతున్నాయి. ఆ తర్వాత ఏ క్షణమైనా స్థానిక సమరానికి నోటిఫికేషన్‌ విడుదల చేయొచ్చనే ఊహాగానాలు వినిపిస్తున్నాయి. ఆగస్టు 15కల్లా స్థానిక సంస్థల ఎన్నికల క్రతువును పూర్తిచేయాలని సర్కారు యోచిస్తున్నట్లు సమాచారం. ఆ తర్వాత అసెంబ్లీ సమావేశాలను నిర్వహించాలని భావిస్తున్నట్లు తెలుస్తోంది. ఆగస్టులో అసెంబ్లీ సమావేశాలు నిర్వహించే అవకాశం ఉందంటూ ఇటీవల శాసనమండలి చైర్మన్‌ గుత్తా సుఖేందర్‌రెడ్డి చేసిన వ్యాఖ్యలు ఇందుకు బలం చేకూరుస్తున్నాయి.


రిజర్వేషన్లు ఎలా ఉంటాయో?

స్థానిక ఎన్నికలకు సంబంధించి ఒక్కో అడుగు ముందుకు పడుతుండడం, తాజాగా ఎన్నికలు నిర్వహించే వార్డులు, గ్రామాలు, ఎంపీటీసీ, జడ్పీటీసీ స్థానాలను సర్కారు ఖరారు చేయడం, వాటిని ప్రకటించడంతో క్షేత్రస్థాయిలో రాజకీయం వేడెక్కుతోంది. వార్డు నుంచి జడ్పీ చైర్మన్‌ వరకు రాబోయే రిజర్వేషన్ల వ్యవహారంపైనే చర్చ జరుగుతోంది. ఇదే విషయానికి సంబంధించి తమ గ్రామం, మండల పరిధిలో రిజర్వేషన్లు ఎలా వస్తాయనే దానిపై అన్ని పార్టీల నాయకులు ఆరా తీస్తున్నారు. ఎస్సీ, ఎస్టీలకు పోగా మిగిలిన వాటిలో బీసీలకు 42 శాతం రిజర్వేషన్లను కేటాయించనుండడమే ఇందుకు కారణమనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.


ఇవి కూడా చదవండి

కాళేశ్వరం అవినీతి ఇంజినీర్లకు ఇక చుక్కలే..ఈడీ విచారణకు సిద్ధం..


యూట్యూబ్‌లో ఆ వీడియోలపై ఆదాయం రద్దు.. కొత్త రూల్స్

మరిన్ని జాతీయ, తెలుగు వార్తల కోసం క్లిక్ చేయండి

Updated Date - Jul 17 , 2025 | 04:46 AM