Government Loans: ‘అప్పు’డే సగం దాటింది!
ABN , Publish Date - Aug 06 , 2025 | 03:50 AM
రాష్ట్ర ప్రభుత్వం బడ్జెట్‌లో అంచనా వేసుకున్న రుణాల సేకరణలో అప్పుడే సగం దాటిపోయింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో రూ.54,009 కోట్ల రుణాలు తీసుకోవాలని ప్రతిపాదించగా..
రాష్ట్ర బడ్జెట్‌లో రుణసేకరణ అంచనా రూ.54,009 కోట్లు
నాలుగు నెలల్లో చేసిన అప్పు రూ.30,900 కోట్లు
మంగళవారం ఒక్కరోజే రూ.5,000 కోట్లు సేకరణ
అంచనా మేరకు అందని రాబడులు, పథకాలకు నిధులు సర్దాల్సి రావడమే కారణం!
రుణాల్లో ప్రభుత్వం చేతికందినది రూ.20,266 కోట్లు
మిగతా సొమ్ము పాత అప్పుల అసలు, వడ్డీల కింద సంబంధిత ఆర్థిక సంస్థలకు బదలాయింపు
హైదరాబాద్, ఆగస్టు 5 (ఆంధ్రజ్యోతి): రాష్ట్ర ప్రభుత్వం బడ్జెట్‌లో అంచనా వేసుకున్న రుణాల సేకరణలో అప్పుడే సగం దాటిపోయింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో రూ.54,009 కోట్ల రుణాలు తీసుకోవాలని ప్రతిపాదించగా.. నాలుగు నెలల్లోనే రూ.30,900 కోట్ల మేర సేకరించింది. రాబడులు అంచనాల మేరకు లేకపోవడం, వివిధ పథకాలకు నిధులను సర్దాల్సి రావడం, పాత అప్పులకు అసలు, వడ్డీలు చెల్లించాల్సి ఉండటం నేపథ్యంలో ఎక్కువ మొత్తంలో రుణ సేకరణ చేయాల్సి వస్తోందని ఆర్థికశాఖ వర్గాలు పేర్కొంటున్నాయి. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ప్రభుత్వం రూ.64,539 కోట్ల మార్కెట్ రుణాలను తీసుకోవాలని యోచించింది. కానీ కేంద్ర ప్రభుత్వం రూ.54,009 కోట్ల రుణాలకు మాత్రమే అనుమతించింది. సాధారణంగా ప్రభుత్వం బడ్జెట్‌లో అంచనా వేసుకున్న రుణాల్లో ప్రతినెలా కొంత చొప్పున సేకరిస్తూ ఉంటుంది.
అవసరానికి తగినట్టుగా ఒక నెలలో ఎక్కువగా, మరో నెలలో తక్కువగా తీసుకుంటుంది. గరిష్టంగా ఒక నెలలో రూ.5,000 కోట్ల వరకు తీసుకునేది. అయితే ఈసారి ప్రతినెలా రుణ సేకరణ భారీగానే ఉంటోంది. ఏప్రిల్‌లో రూ.4,400 కోట్లు, మేలో రూ.4,500 కోట్లు, జూన్‌లో రూ.8,500 కోట్లు, జూలైలో రూ.8,500 కోట్ల చొప్పున రుణం తీసుకుంది. ఆగస్టులో మంగళవారం (5వ తేదీన) రూ.5000 కోట్ల అప్పు తీసుకుంది. ఇక ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో తీసుకున్న రూ.30,900 కోట్ల రుణాల్లో రాష్ట్ర ప్రభుత్వానికి నేరుగా జూన్ ఆఖరు నాటికి అందినది రూ.20,266 కోట్లే. మిగతా సొమ్మును పాత అప్పుల అసలు, వడ్డీల కింద ఆర్‌బీఐ మినహాయించి.. సంబంధిత ఆర్థిక సంస్థలకు బదలాయించింది.